గాడిన పడేనా?
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:41 PM
Will It Get Back on Track? సీతంపేట ఐటీడీఏ పాలన గాడితప్పుతోంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. సమయపాలన సైత కొరవడుతోంది. పూర్తిస్థాయిలో అధికారులు గిరిజనులకు అందుబాటులో ఉండడం లేదు. రెగ్యులర్ పీవోను నియమించక పోవడంతో ఐటీడీఏ పరిస్థితి దయనీయంగా మారింది.
కొన్నాళ్లుగా ఇన్‌చార్జిల పాలన
అధికారులు, ఉద్యోగుల్లో కొరవడిన జవాబుదారీతనం
మూతపడుతున్న జీవనోపాధి పథకాలు
రహదారి పనుల్లో నాణ్యతాలోపం
పెదవి విరుస్తున్న గిరిజనులు
సీతంపేట రూరల్, జూలై12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పాలన గాడితప్పుతోంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. సమయపాలన సైత కొరవడుతోంది. పూర్తిస్థాయిలో అధికారులు గిరిజనులకు అందుబాటులో ఉండడం లేదు. రెగ్యులర్ పీవోను నియమించక పోవడంతో ఐటీడీఏ పరిస్థితి దయనీయంగా మారింది. గిరిజనుల జీవనోపాధుల మెరుగు కోసం నెలకొల్పిన యూనిట్లపై పర్యవేక్షణ లేక ఒక్కో పథకం మూతపడుతోంది. ఏజెన్సీలో డోలీ రహిత గ్రామాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రహదారి పనులకు రూ.వేల కోట్లు మంజూరు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఇంజనీరింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని గిరిపుత్రులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏ ఏర్పడి సుమారు 43ఏళ్లు కావస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈప్రాంతంలోని మన్యం బిడ్డలకు అనేక సంక్షేమ, అభివృద్థి పథకాలను అందించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం అశాస్ర్తీయంగా చేపట్టిన జిల్లా విభజన కారణంగా గిరిజనులకు అందాల్సిన సంక్షేమ పథకాలు నీరుగారుతున్నాయి. వీడీవీకేల పనితీరు, ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యతలోపం, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐటీడీఏలో 20సబ్‌ప్లాన్ మండలాలు ఉండగా వీటిలో 16మండలాలు శ్రీకాకుళం జిల్లాలో, 4 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. సబ్‌ప్లాన్ మండలాల్లో సుమారు 2లక్షల పైచీలుకు గిరిపుత్రులు జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజ నులకు సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయ యంత్రపరికరాలను రాయితీపై పంపిణీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న గిరిజనులకు అందిస్తున్న అభివృద్థి పథకాలపై ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది.
ఇన్‌చార్జిలతోనే కాలయాపన
సీతంపేట ఐటీడీఏ.. గడిచిన రెండేళ్లుగా ఇన్‌చార్జి పీవోల పాలనలోనే సాగుతోంది. పాలకొండ సబ్‌కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్‌లకే సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో బాధ్యతలను అప్ప గించి నెట్టుకొస్తున్నారు. దీంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐటీడీఏకు ఇన్‌చార్జి పీవోలు కావడం, ఏశాఖపైనా పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోవడంతో ఐటీడీఏ పరిధిలోని కొన్ని శాఖలు నిర్వీర్యమవుతున్నాయని గిరిజన సంఘాలు బహిరంగంగానే విమర్శి స్తున్నాయి.
ఐటీడీఏలో ఎవరికి వారే...
సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలోని ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. ఇన్‌చార్జి పీవోతో పాటు ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండడం లేదు. వివిధ శాఖల అధికారులతో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదు. కార్యాలయంలో ఎవరూ ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి. దీంతో వివిధ పనులు, సమస్యలపై ఐటీడీఏకు వెళ్తున్న వారు ఈసురోమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. మరోవైపు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక)ను మొక్కుబడిగా నిర్వహిస్తుండడంతో గిరిజన సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
మూతపడుతున్న వీడీవీకేలు..
గిరిజన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పిన వీడీవీకే(వన్‌థన్ వికాస్ కేంద్రాలు)లు ఒక్కోక్కటిగా మూతపడుతున్నాయి. ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల్లో గతంలో సుమారు 30వరకు వీడీవీకేలను ఏర్పాటుచేశారు. వాటి బలోపేతానికి కేంద్రాల నిర్వాహకులకు రుణాలతో పాటు గిరిజన మహిళలకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి యంత్రాలను కూడ సమకూర్చారు. పసుపు, జీడి ప్రోససింగ్ యూనిట్లతో పాటు పిండి, ఆయిల్‌మిల్లులు, బ్రూమ్‌స్టిక్స్(కొండచీపుర్ల)కటింగ్ యంత్రాలను అందజేశారు. అయితే ప్రస్తుతం కొన్ని యూనిట్లు మాత్రమే నడుస్తుండగా చాలా వరకు వీడివీకేలు మూతపడినట్లు తెలుస్తోంది. వీటి నిర్వహణపై ఐటీడీఏతో పాటు వెలుగు డీపీఎం, ఏపీఎం స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జ్వరాలతో సతమతం
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో కొందరు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. సీజన్ కావడంతో ఆశ్రమ పాఠశాలల్లో జ్వరపీడితులు సంఖ్య ఎక్కువగా ఉంది. మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు గిరిజన విద్యార్థులను పీడిస్తున్నాయి. గతంలో అపెడమిక్ సీజన్ ప్రారంభంలోనే ముందస్తు చర్యలు తీసుకునేవారు. వైద్యాధికారులతో పాటు గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఆశ్రమ పాఠ శాలల హెచ్‌ఎం, గురుకులాల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది మన్యంలో మలేరియా విజృంభి స్తోంది. ఏ గిరిజన గ్రామాల్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. అంతేకాకుండా గిరిజన విద్యాలయాల్లో అపారిశుధ్యం, మెనూ అమలులో లోపాలు కనిపిస్తున్నాయి.
ఇంజనీరింగ్ శాఖపై ఆరోపణలు
గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో పలు గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న సీసీ రహదారి పనుల్లో నాణ్యతాలోపం కనిపిస్తున్నా.. ఐటీడీఏ అధికారులకు పట్టడం లేదు. పనులపై ఆయా గ్రామాల గిరిజనులే నేరుగా ఇన్‌చార్జి పీవోకు ఫిర్యాదు చేశారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే...
‘వీడీవీకేల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం. వాటిని నిర్వహిస్తున్న ఎస్‌హెచ్‌జీ సభ్యుల కు కొత్త యంత్రాలు అందిస్తాం. ఇంజనీరింగ్‌శాఖ ద్వారా చేపడుతున్న పనులను పర్యవేక్షిస్తాం. అవసరమైతే క్వాలిటీ కంట్రోల్ విభాగం ద్వారా తనిఖీలు చేపతాం. ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు మినహా మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటున్నా. ’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.