Share News

Will it ever change?ఇకనైనా మారతారా?

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:10 AM

Will it ever change? సీఎం చంద్రబాబు నాయుడి హెచ్చరికలతోనైనా జిల్లా ప్రజాప్రతినిధుల్లో మార్పు వస్తుందా? అన్న చర్చ సాగుతోంది. వారి అనైతిక కార్యకలాపాలు, కుటుంబ సభ్యుల జోక్యం వంటి వాటిపై ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే.

Will it ever change?ఇకనైనా మారతారా?

ఇకనైనా మారతారా?

ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం క్లాస్‌

అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయన్న అధినేత

తండ్రి జోక్యం ఎక్కువవుతోందని ఓ నేతకు హెచ్చరిక

మీడియాపరంగా వద్దు.. ప్రజల్లోకి వెళ్లండని నిర్దేశం

విజయనగరం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడి హెచ్చరికలతోనైనా జిల్లా ప్రజాప్రతినిధుల్లో మార్పు వస్తుందా? అన్న చర్చ సాగుతోంది. వారి అనైతిక కార్యకలాపాలు, కుటుంబ సభ్యుల జోక్యం వంటి వాటిపై ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. ‘నా వద్ద పక్కా సమాచారం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు? కుటుంబసభ్యుల అతి జోక్యం, ప్రకటనల ఆర్భాటం, ఇసుక, మట్టి మాఫియాలతో చేతులు కలపడం, కూటమి పార్టీల శ్రేణులను పట్టించుకోకపోవడం, గ్రూపులను ప్రోత్సహించడం వంటివి నాకు తెలుసు. మారడానికి మరో చాన్స్‌ ఇస్తున్నాను. మారకపోతే నేనే మార్చేస్తాను’ అన్న సీఎం చంద్రబాబు హెచ్చరికలతో జిల్లా ప్రజాప్రతినిధులకు దిమ్మ తిరిగింది. జిల్లా పరిస్థితిని, సమస్యలను వివరించాలనుకుని వెళ్లిన వారికి తమ తప్పుఒప్పులను వెల్లడించేసరికి ఖంగుతిన్నారు. అందులోనూ సూటిగా లోపాలను చెప్పడంతో విస్తుపోయారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని, పక్కదారి పట్టొద్దని పదే పదే అధినేత చెప్పిన విషయాలను సావధానంగా విన్నారు. ఇక ఎంత మేర మారతారో చూడాలి. అమరావతిలో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి, ఎంపీతో సీఎం చంద్రబాబు ఇటీవల సమావేశమైన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలు, నిధులపైనే ఈ సమావేశం ఉంటుందనుకున్నారు. విన్నపాలు వింటూనే అధినేత లోపాలు బహిర్గతం చేశారు. వెళ్లాల్సిన మార్గాన్ని నిర్దేశించారు. కూటమి ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కట్టుదాటుతున్న క్రమంలో నిఘా వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారంతో ఆయన మాట్లాడారు. ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే కీలక ప్రజాప్రతినిధుల ఎదుట వారి వైఫల్యాలను బయటపెట్టేసరికి ఎమ్మెల్యేలు షాక్‌కు గురైనట్టు సమాచారం.

నియోజకవర్గాల వారీ చర్చ ఇలా

- జిల్లా కీలక ప్రజాప్రతినిధి శాఖలపరంగా బాగానే పనిచేస్తున్నారు కానీ కుటుంబసభ్యుల మితిమీరిన జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆ నేత బంధువు ప్రమేయం పెరగడంపై సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లేదు సార్‌..అటువంటిదేమీ లేదు అని సదరు నేత చెప్పినా చంద్రబాబు సంతృప్తి చెందలేదని తెలిసింది. బదిలీలు, ఇతరత్రా వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో అవకాశం ఇస్తే ఇలా చేయడం భావ్యం కాదని కూడా చంద్రబాబు తేల్చిచెప్పినట్టు సమాచారం. పైగా వ్యక్తిగత సహాయకులు సైతం విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని.. కట్టడి చేయాల్సిందేనని , ముఖ్యమంత్రి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

- సాధారణ కార్యకర్తగా ఉన్న నేతకు ఢిల్లీస్థాయి అవకాశం కల్పిస్తే ఏంచేస్తున్నారని ఒక నేతను చంద్రబాబు తలంటినట్టు తెలుస్తోంది. మీడియాలో కాదు.. ప్రజల్లో ఉండాలని అక్షింతలు వేశారట. అరుదైన అవకాశం ఇస్తే అల్లుకుపోవాల్సింది పోయి.. ఇదేంటి పరిస్థితి అంటూ సీఎం ప్రశ్నించేసరికి బిక్కముఖం చేసినట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిందేనని.. ఏదో మీడియాపరంగా కార్యక్రమాలు చేపడతామంటే కుదరదని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

- ‘ఏమ్మా కూటమి తరుపున మంచి అవకాశం దక్కింది. కానీ కూటమి పార్టీ శ్రేణులనే కలుపుకొని వెళ్లడం లేదు. పైగా అధికారులపై మీ భర్త పెత్తనం ఏంటి? అది టీడీపీ గెలిచే సీటు. కానీ కూటమి ధర్మంలో భాగంగా అవకాశం ఇచ్చాం. కూటమిలోని అన్ని పార్టీల శ్రేణులను కలిసి వెళ్లకపోతే ఎలా? ఇలా అయితే చాలా కష్టం అమ్మ. అవకాశాలు కోసం చాలామంది వేచి చూస్తున్నారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడమే ముఖ్యం. ’ అని చంద్రబాబు సలహా ఇచ్చారు.

- ‘పార్టీలో మీరు సీనియర్‌. అందుకే పక్క జిల్లా నుంచి తెప్పించి బలమైన నియోజకవర్గాన్ని అప్పగించాం. పెద్దరికాన్ని చూపించాల్సిన సమయం. పార్టీతో పాటు మిగతా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోండి. ఎక్కడైనా పార్టీలో ఇబ్బందులు వస్తే పెద్దరికంతో చక్కదిద్దండి. సహచర ఎమ్మెల్యేతో మీకు ఏంటి సమస్య. అనవసరంగా కేడర్‌లో ఒక అస్పష్టత ఉంది. అందుకే దానిపై కేడర్‌కు సంకేతాలు పంపండి. ఆ ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోండి’ అంటూ జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.

- ‘టీడీపీలో అవకాశాలు అందరికీ దక్కుతాయి. వెనుకా ముందు అన్నది వారి వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది. పదవులు ఆశించడం, పోటీపడడం అనేది సహజం. మీరు ముఖ్య నేతలను కలుపుకొని వెళ్లడం లేదన్న విమర్శ ఉందమ్మా. అందుకే కాస్తా జాగ్రత్తగా ఉండండి. అందర్నీ సమన్వయం చేసుకోండి..’ అంటూ విశాఖ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఆ మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు చురకలు అంటించారట.

- ‘జిల్లాలో ఓవరాల్‌గా ఆ నియోజకవర్గం పనితీరు బాగుంది. కానీ కొంచెం అక్కడక్కడా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రత్యర్థులు రాచరికం ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. బాగానే పనిచేస్తున్నారు. కోట నుంచి రాజకీయాలు బాగానే చేస్తున్నారు. కానీ రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకోండి’ అంటూ చారిత్రక నియోజకవర్గ ఎమ్మెల్యేకు చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

- ‘అమ్మా మీరు తండ్రి పేరును నిలబెట్టేలా పనిచేయాలి. ఆయనకు మించి అన్నట్టు ఉండాలి. అక్కడక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి చూడండి. ఎన్నికలకు ముందు.. తరువాత చాలామంది పార్టీలో చేరారు. వారిని సమన్వయం చేసుకోలేకపోతున్నారన్న అపవాదు మీపై ఉంది. అందుకే మంచి పనితీరుతో ముందుకెళ్లండి. అందర్నీ సమన్వయం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశమివ్వకండి’ అంటూ ఆ యువ మహిళా ఎమ్మెల్యేకు చురకలు అంటించారట చంద్రబాబు. మొత్తానికైతే సుతిమెత్తగా కాకుండా కాస్తా కఠువుగా సీఎం చంద్రబాబు జిల్లా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

-----------------------

Updated Date - Apr 11 , 2026 | 12:11 AM