గిట్టుబాటయ్యేనా?
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:21 AM
ఎల్నినో ప్రభావంతో పత్తి దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు కనీసం నాలుగు క్వింటాలు కూడా రావడం లేదు.
- తగ్గిన పత్తి దిగుబడి
- ధర లేక రైతుల దిగాలు
- క్వింటాకు రూ.8,700 చెల్లించాలని విన్నపం
బొబ్బిలి రూరల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో పత్తి దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు కనీసం నాలుగు క్వింటాలు కూడా రావడం లేదు. పోని చేతికొచ్చిన పంటకైనా మద్దతు ధర ఉందా? అంటే అదీ లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి మండలంలో పారాది, నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం, కాశిందొరవలన, పక్కి, మెట్టవలస తదితర గ్రామాల్లో పత్తి సాగు అధికంగా ఉంది. సుమారు 430 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. భూమిని దున్నడం మొదలుకొని పంట చేతికొచ్చే వరకూ ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. పత్తిని ఏరేందుకు ఒక మనిషికి రూ.250 నుంచి రూ.350 వరకు కూలి ఇవ్వాలి. ఎండ బెట్టడానికి, పురుగు మందులు, ఎరువులు, తదితర ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని వాపోతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని అంటున్నారు. ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా పెట్టుబడి పోను కొంతమేర మాత్రమే మిగులుతుందని పేర్కొంటున్నారు. కానీ, గరిష్టంగా 4 క్వింటాళ్లు కూడా రావడం లేదని, దీంతో పెట్టుబడి ఖర్చులు ఎలా రాబట్టుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు.
దళారుల చేతికి పంట
పంట పెట్టుబడి కోసం అవసరమైన డబ్బులను కొందరు రైతులు వ్యాపారుల వద్ద అప్పుగా తెస్తున్నారు. ఈ అప్పులు తీర్చేందుకు పత్తిని వారికే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దళారులు క్వింటాకు రూ.8,100 ధర చెబుతున్నారని, దీనివల్ల తగిన ఆదాయం రావడంలేదని అంటున్నారు. పత్తి సాగు ఖర్చులు, అప్పుల భారం దృష్ట్యా క్వింటాకు కనీస మద్దతు ధర రూ.8,700 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రూ. 8,700 చెల్లించాలి
నేను రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఈ ఏడాది ఆశించిన దిగుబడి రాక నష్టాలు ఎదురవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు పత్తిని వ్యాపారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. క్వింటాకు రూ. 8,100 ధర చెబుతున్నారు. కనీసం రూ. 8,700 ధర కల్పిస్తేనే మాకు కొంత ఊరట లభిస్తుంది
- బెవర నారాయణమ్మ, రైతు, పారాది గ్రామం
సరైన మద్దతు ధర కల్పించాలి
ఎకరంలో పత్తి పంట సాగు చేశాను. పెట్టబడి ఖర్చులు భారీగా పెరిగాయి. కానీ ఆశించిన దిగుబడి రాలేదు. పంట కోసం చేసిన అప్పులు తీర్చాలంటే గిట్టుబాటు ధర రావాలి. ప్రస్తుత ధరలతో సాగు ఖర్చులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం స్పందించి పత్తికి సరైన మద్దఽతు ధర కల్పించాలి.
-కలిశెట్టి అప్పయ్య, రైతు, గొర్లె సీతారాంపురం
ప్రభుత్వానికి తెలియజేశాం
పత్తి సాగులో రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాఖ సూచనలు అనుసరించాలి. పంట దిగుబడి, గిట్టుబాటు ధరకు సంబంధించి రైతులకు అవసరమైన సూచనలు అందిస్తాం. మద్దతు ధరకోసం ప్రభుత్వానికి తెలియజేశాం.
-మజ్జి శ్యామ్సుందర్, మండల వ్యవసాయ అధికారి, బొబ్బిలి