Will It Be Left Like This? ఇలానే వదిలేస్తారా?
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:20 AM
Will It Be Left Like This? జిల్లాలో పలుచోట్ల అతిథిగృహాలు అధ్వానంగా మారాయి. భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పిచ్చిమొక్కల నడుమ దయనీయస్థితిలో దర్శనమి స్తున్నాయి.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన వైనం
ఆక్రమణలకు గురువుతున్నా పట్టించుకునే వారేరీ?
పాలకొండ, జనవరి16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల అతిథిగృహాలు అధ్వానంగా మారాయి. భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పిచ్చిమొక్కల నడుమ దయనీయస్థితిలో దర్శనమి స్తున్నాయి. గతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు అతిథ్యమిచ్చిన గెస్ట్‌హౌస్ లు అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. యథేచ్ఛగా అవి ఆక్రమణలకు గురవు తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇదీ పరిస్థితి..
అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలకొండలో ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం నిర్మించారు. అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర సిబ్బందిని ఆర్‌అండ్‌బీ శాఖ ఏర్పాటు చేసింది. కాల క్రమంలో పరిస్థితి మారింది. ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మించిన ఈ భవనం నేడు పూర్తిగా శిథిలమైంది. కనీస మరమ్మతులకు కూడా చర్యలు చేపట్టలేదు. మరోవైపు ఈ భవనంలోని ఎంతో విలువైన ఫర్నీచర్, ఇతర వస్తువులు దొంగలపాలయ్యాయి. వీరఘట్టంలో ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహానిదీ ఇదే పరిస్థితి. కనీస నిర్వహణ లేకపోవ డంతో భవనాలు శిథిలమయ్యాయి. కార్యాల య ప్రాంగణం కొంతమేర ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తుంది. ఇక కురుపాం నియోజక వర్గం లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వసతిగృహం కూడా గత 15 ఏళ్లుగా వినియోగంలో లేదు. దీంతో ఆ బంగ్లాను పూర్తిగా తొలగించారు.
ఇతర అవసరాలకు వినియోగం..
పాలకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహం స్థలాన్ని సీతంపేట ఐటీడీఏ ఉన్నతాధికారులు లీజు ప్రాతిపదికన తీసుకుని పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటుకు అనుమతులివ్వాలని ఆ పార్టీ నాయకులు ఉన్నతాధికారు లకు వినతిపత్రం అందించారు. వీరఘట్టంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహం ప్రాంగణం కొంతమేర ఆక్రమణకు గురైనట్టు తెలిసింది. మిగిలిన కొంత భాగానికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 15 ఏళ్లు కిందటే పట్టాలు మంజూరు చేసినట్లు సమాచారం. కురుపాంలోని అతిథిగృహం బంగ్లాను తొలగించడంతో ఆ స్థలం ఖాళీగానే ఉంది. దీనిపై ఆర్‌అండ్‌బీ జేఈఈ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. జిల్లాలో గెస్ట్ హౌస్‌ల విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామని తెలిపారు.