Will It Be Left As It Is? అలానే వదిలేస్తారా?
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:52 PM
Will It Be Left As It Is? జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం లేదు. మరమ్మతులకు గురవడంతో పూర్తిగా మూలకు చేరాయి.
ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు
ప్రభుత్వంపై అదనపు భారం
పాలకొండ, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం లేదు. మరమ్మతులకు గురవడంతో పూర్తిగా మూలకు చేరాయి. కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలకొండ, సాలూరు, పార్వతీపురంలోని ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ 500 ఎల్‌పీఎం ప్లాంట్‌ను ఏర్పాటు చేశాయి. ఒక్కో ప్లాంట్ కోసం రూ.60 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు ద్వారా తెలుస్తోంది. సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం ప్రైవేట్ సంస్థలపై ఆధారపడకుండా పీఏస్‌ఏ ప్లాంట్లు అమర్చారు. ప్రకృతి నుంచి ప్రాణవాయువు తయారుచేసి.. పైపుల ద్వారా రోగుల బెడ్ వద్దకే ఆక్సిజన్ అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. అమర్చిన కొన్నాళ్లకే చిన్నపాటి సమస్యలతో అవన్నీ మూలకు చేరాయి. మరమ్మతులను సరిచేసే యంత్రాంగం అందుబాటులో లేకపోవడం, నిధులు మంజూరు కాకపోవడంతో పీఏస్‌ఏ ప్లాంట్లు మూతపడ్డాయి. ప్రధానంగా కంప్రెషర్, సెన్సార్‌లో లోపాలు, ధర్మామీటర్, ఫిల్టర్, ఫ్రెజర్‌గేజ్, డ్రయ్యర్, విద్యుత్ ఇతరత్రా సాంకేతిక సమస్యలను సరిదిద్ది వినియోగంలోకి తీసుకొచ్చే చొరవ ఎక్కడా కానరావడం లేదు. ప్లాంట్ల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయడంతో ప్రస్తుతం అవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కాగా ఎప్పటి లానే ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను ప్రైవేట్ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం లక్షలాది రుపాయలను వెచ్చిస్తున్నారు తప్ప ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిం చాలని రోగులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
పాలకొండ, పార్వతీపురం, సాలూరులోని వంద పడకల ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ప్లాంట్ల మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. సాంకేతిక సమస్యలను తెలియజేశాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే వాటిని వినియోగంలోకి తెస్తాం.
- జి.నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్, పార్వతీపురం మన్యం