Will It Be Completed This Time? ఈసారైనా పూర్తయ్యేనా?
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:16 AM
Will It Be Completed This Time? ప్రభుత్వ పథకాలు పక్కతోవ పట్టకుండా ఉండేందుకు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే గడువును పొడిగించారు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని శుక్రవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది పూర్తయితే కుటుంబాలకు ఫ్యామిలీ కార్డులను అందించనున్నారు.
ఈనెల 25లోగా పూర్తిచేయాలని ఆదేశం
క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో వేగవంతం కాని ప్రక్రియ
ఉల్లాస్ సర్వేదీ అదే తీరు..
జిల్లా అధికారుల అసంతృప్తి
గరుగుబిల్లి, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు పక్కతోవ పట్టకుండా ఉండేందుకు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే గడువును పొడిగించారు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని శుక్రవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది పూర్తయితే కుటుంబాలకు ఫ్యామిలీ కార్డులను అందించనున్నారు. వాస్తవంగా ఈ సర్వేను డిసెంబరు 14న ప్రారంభించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో పూర్తిస్థాయిలో సర్వే పూర్తి చేసేందుకు గడువును పెంచారు. జిల్లాలో 2,97,314 కుటుంబాలున్నాయి. శుక్రవారం నాటికి 1,99,438 కుటుంబ సభ్యుల సర్వేను పూర్తి చేశారు. మొత్తంగా 350 సచివాలయాల పరిధిలోని 3,030 మందికి ఈ బాధ్యత అప్పగించగా.. 2,745 మందే సర్వేలో పాల్గొంటున్నారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బందిలో మార్పు రావడం లేదు.
ఇదిలా ఉండగా గ్రామాల్లో శత శాతం అక్షరాస్యతను సాధించేందుకు ప్రభుత్వం అక్షర ఆంధ్రలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు సర్వేకు ఆదేశాలు జారీ చేసినా.. మం డల స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియ కూడా తీవ్ర జాప్యమవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో గుర్తించిన 67,111 మంది నిరక్షరాస్యులకు గాను 55,715 మంది వివరాలను నమోదు చేశారు. నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం కలిగించేందుకు 6,711 మంది వలంటీర్లకు గాను 5,975 మందిని నియమించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో (వెలుగు) ఎంపిక చేస్తున్న వలంటీర్లకు ఎటువంటి గౌరవ వేతనం మంజూరు కాకపోవడంతో అత్యధికులు సర్వేకు వెనుకంజ వేస్తున్నారు. మొత్తంగా సచివాలయాల పరిధిలోని రెండు సర్వేల నిర్వహణపై తీవ్ర జాప్యం నెలకొ నడంతో జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమగ్ర కుటుంబ సర్వేను సెలవు దినాల్లో కూడా నిర్వహించాలని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు పరుగులు తీస్తున్నారు. జిల్లా అధికారులు ఆగ్రహానికి ఎవరు బలి అవుతారోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘ గ్రామస్థాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సంతకం నెర్చుకునేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వెలుగు సంఘాలు, సచివాలయాల సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. సమగ్ర కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తాం. సర్వేల్లో జాప్యం చేసే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతాం.’ అని గరుగుబిల్లి ఎంపీడీవో జి.పైడితల్లి తెలిపారు.