Kharif? ఖరీఫ్‌కైనా అందేనా?
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:28 AM
Will It Be Available at Least for Kharif? వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్) ప్రాజెక్టు ఆధుని కీకరణ పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రాకపోవడంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పంటపొలాలకు సాగునీరందడం ప్రశ్నార్థకంగా మారింది.
ఏళ్లు గడుస్తున్నా.. కొలిక్కిరాని వైనం
అధ్వానంగా మారిన కాలువలు..
భూములకు అందని నీరు
ఆందోళనలో రైతులు
మక్కువ రూరల్, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్) ప్రాజెక్టు ఆధుని కీకరణ పనులకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రాకపోవడంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పంటపొలాలకు సాగునీరందడం ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ ప్రాజెక్టు నుంచి మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల్లో 24,700 ఎకరాలకు నీరందాల్సి ఉంది. అయితే జైకా నిధులతో చేపట్టాల్సిన పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఉప కాలువల పరిధి లోని భూములకు అరకొరగా సాగునీటి సరఫరా జరుగుతోంది. వాస్తవంగా వీఆర్‌ఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రధాన కాలువలతో పాటు ఉపకాలువల ఆధునికీకరణకు 2020లో రూ.63కోట్ల మేర జైకా నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో కుడి ప్రధాన కాలువలో 700మీటర్ల వరకు లైనింగ్ పనులు పూర్తిచేశారు. అయితే కాంట్రాక్టర్‌కు సుమారు రూ.9కోట్ల వరకు బిల్లులు చెల్లించక పోవ డంతో ఆ పనులు సగంలోనే నిలిచిపోయాయి. ఇటీవల కాంట్రాక్టర్‌కు రూ.8.60 కోట్ల వరకు చెల్లిం చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నా.. ఇప్పటివరకు కాలువల పనులు తిరిగి ప్రారంభిం చలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
- ప్రస్తుతం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలతోపాటు ఉపకాలువలన్నీ డొంకలు, తుప్పలతో మూసుకుపోయాయి. చప్పబుచ్చింపేట వద్ద 12 ఉపకాలువ పూర్తిగా శిఽథిలావస్థకు చేరుకుంది.దీని పరిధిలో గతంలో నిర్మించిన కల్వర్టులు, కానాలు దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో ఈ కాలువకు రెండువైపులా ఉన్న మట్టికట్టలు కోతకు గురై గెడ్డను తలపిస్తున్నాయి. చప్పబుచ్చింపేట నుంచి వెంకటభైరిపురం వరకు 12గ్రామాలకు చెందిన సుమారు 2వేల ఎకరాలకు 12 ఉపకాలువ ద్వారా నీరందాల్సి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా దానికి మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు పరిధిలో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
- ఇదిలా ఉండగా కొండబుచ్చింపేట నుంచి గోపాలపురం వరకు ఉన్న కుడి బ్రాంచి కాలువ కూడా అధ్వానంగా మారింది. కోన, గోపాలపురం భూములకు సాగునీరందడం లేదని రైతులు వాపోతున్నారు. కాగా సరాయివలస, కొండబుచ్చింపేట గ్రామాల పొలాలకు నీరందించే ఈ కాలువను పదేళ్లుగా పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం అది పిచ్చిమొక్కలతో అధ్వానంగా మారిందని వారు చెబుతున్నారు.
- కవిరివలస నుంచి మార్కొండపుట్టి వరకు ఉన్న ఎడమ ప్రధాన కాలువ నుంచి గత పదేళ్లగా పంటపొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. 2014లో రూ.లక్షలు ఖర్చుచేసి కాలువ పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. ఎడమ ప్రధానకాలువ పరిధిలో గోముఖి అక్విడెక్టు నిర్మాణం పూర్తిచేస్తేనే తమ పొలాలకు నీరందుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం గోముఖి లింక్ చానల్ ద్వారా తోటవలస, కవిరిపల్లి శంబరలో భూములకు నీరందుతుందని తమకెలాంటి ప్రయోజనం కలగడం లేదని రైతులు వాపోతున్నారు. అక్విడెక్ట్ పూర్తిచేస్తే ఎడమకాలువ పరిధిలో సుమారు 8వేల ఎకరాల్లో సగం భూములకైనా ఖరీఫ్‌లో సాగునీరందే అవకాశం ఉంది.
- ప్రాజెక్టులో పనులు చేపట్టేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు లేకపోవడం, మరోవైపు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెలాఖరు లోగా పాత కాంట్రాక్టర్ స్పందించకుంటే.. కొత్తగా కాంట్రాక్టరు ద్వారా పనులు చేయించి.. జూన్ 15లోగా పూర్తి చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రాజెక్టు డీఈఈ సురేష్‌ను వివరణ కోరగా.. వీఆర్‌ఎస్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేశామని తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేసి.. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.