Will Irrigation సాగునీటి కష్టాలు తీరేనా?
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:47 PM
Will Irrigation Woes Be Resolved? కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి, జియ్యమ్మ వలస మండలాల పరిధిలో ఎనిమిది పంచాయతీల్లో భూములకు దశాబ్దాల నుంచి సాగు నీరందడం లేదు. దీంతో ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు
వాటిని రద్దు చేసిన వైసీపీ సర్కారు
ఏటా రైతులకు తప్పని ఇబ్బందులు.. వరుణుడిపైనే ఆధారం
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
జియ్యమ్మవలస, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి, జియ్యమ్మ వలస మండలాల పరిధిలో ఎనిమిది పంచాయతీల్లో భూములకు దశాబ్దాల నుంచి సాగు నీరందడం లేదు. దీంతో ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడిపై ఆధారపడి సాగు చేపడుతున్నారు. కాగా గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆయా ప్రాంతరైతులు కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి..
గత టీడీపీ ప్రభుత్వం 2019లో నాగూరు, తోటపల్లి, చింతల బెలగాంలలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేస్తూ జీవో 164ను విడుదల చేసింది. నాగూరు, తోటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అప్పట్లో రూ.26.77 కోట్లు మంజూరు చేసింది. దీని ద్వారా గరుగుబిల్లి మండలంలో నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, పిట్టలమెట్ట, సంతోషపురం, కొత్త సంతోషపురం, నాగూరు గ్రామాల్లో 5,274 ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. ఇక జియ్యమ్మవలస మండలంలో చింతలబెలగాం వద్ద ఏర్పాటు చేయాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.17.25 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చింతలబెలగాం, రాజయ్య పేట, తుమ్మల దత్తివలస, సింగనాపురం, చినకుదమ, పెదకుదమ, గౌరీపురం, గంగరాజపురం గదబవలస, కేటీ వాడ, నీచుకవలస, తురక నాయుడువలసలో 2,726 ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ల బృందం పరిశీలించి.. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు హైడ్రాలిక్ అనుమతులు కూడా ఇచ్చేసింది. మొత్తంగా రూ. 45.13 కోట్లతో నిర్మాణం చేసేందుకు నీటి పారుదలశాఖ అంతా సిద్ధం చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కానీ వారి ఆనందం ఎంత కాలం నిలవలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జీవోను రద్దు చేసింది. దీంతో ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు. ఫలితంగా ఏటా రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని ఆయా ప్రాంతరైతులు కోరుతున్నారు.