Share News

Will Industrial Growth పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తారా?

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:16 AM

Will Industrial Growth Gain Momentum? మన్యం జిల్లాలో పారిశ్రామిక పురోగతి కనిపించడం లేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు కావడం లేదు. పట్టుమని పదిమందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ కూడా లేకపోవడంతో మన్యం వాసులకు వలసలు తప్పడం లేదు.

Will Industrial Growth  పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తారా?
పనుకువలస ఎంఎస్‌ఎంఈ పార్క్‌ వద్ద రోడ్డు పనులు జరుగుతున్న దృశ్యం

  • ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు అందుబాటులోకి వచ్చేదెప్పుడో?

  • స్థల సేకరణలోనే అధికారులు.. వలసబాటలో జిల్లావాసులు

పార్వతీపురం, ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లాలో పారిశ్రామిక పురోగతి కనిపించడం లేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు కావడం లేదు. పట్టుమని పదిమందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటీ కూడా లేకపోవడంతో మన్యం వాసులకు వలసలు తప్పడం లేదు. జిల్లాలో పాలకొండ మినహాయిస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) కోసం పార్క్‌ల ఏర్పాటుకు చర్యలు ఊపందు కోవడం లేదు. ఇంకా స్థల ఎంపికలోనే పారిశ్రామిక, రెవెన్యూ అధికారులు ఉండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలో 26వ స్థానంలో అట్టడుగున మన్యం ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించగా.. మరి దీనిపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇకనైనా పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి.. స్థానికంగా ఉపాధి కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- పాలకొండ నియోజకవర్గం.. సీతంపేట మండలం పనుకువలస వద్ద 27 ఎకరాల 26 సెంట్ల విస్తీర్ణంలో సుమారు రూ.3.42 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకు న్నారు. ఈ పార్క్‌లో 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 170 ప్లాట్స్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు. వాటిని ఔత్సాహిక పారి శ్రామికవేత్తలకు కేటాయించి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసు కోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆప్రాంతంలో వీధిలైట్ల ఏర్పాటుతో పాటు రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్లాట్లు కేటాయించనున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యేక్షంగా , పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.

- కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామం వద్ద 19 ఎకరాల 26 సెంట్లు స్థలాన్ని సర్వే నెంబర్‌ 158తో పాటు 159లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కోసం స్థల ఎంపిక చేశారు. ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలంటే రూ.3.85 కోట్ల వరకు చెల్లించాలని ఈ ఏడాది జనవరి 8న పారిశ్రామిక శాఖాధికారులకు ఓ లేఖ వెళ్లింది. అయితే దానిపై ఇంతవరకు ఎటువంటి చర్యల్లేవు.

- పార్వతీపురం నియోజకవర్గం నర్సిపురం పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్‌ 485లో 4 ఎకరాల 78 సెంట్లను ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కోసం ఎంపిక చేశారు. అయితే ఈ స్థలం జగనన్న కాలనీ కోసం గతంలో ఎంపిక చేశారు. పార్వతీపురం పట్టణ నిరుపేదలకు అప్పట్లో పట్టాలు కూడా అందించారు. అయితే అది నివాసయోగ్యమైన స్థలం కాకపోవడంతో ఏ ఒక్కరూ అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఆ స్థలాన్ని ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కోసం కేటాయించారు. కాగా ఆ ప్రాంతంలో పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు వేరే ప్రాంతంలో స్థలం మంజూరు చేయాల్సిన ఉంది. ఆ తర్వాతనే ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అంతా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

- సాలూరు ప్రాంతంలో సర్వే నెంబర్‌ 390లో 15 ఎకరాలను ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కోసం ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో పైపు కల్వర్టుతో పాటు కాజ్‌వే నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. దీని కోసం రూ.70 లక్షలు మంజూరు చేశారు. కాగా ఇంకా ఆ పనులు పూర్తికాలేదు.

Updated Date - Feb 12 , 2026 | 12:16 AM