Industrial Growth పారిశ్రామిక ప్రగతి పట్టదా?
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:09 AM
Will Industrial Growth Ever Take Off? ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఎంతో ముఖ్యం. ప్రధానంగా వలసల నివారణకు, స్థానికంగా ఉపాధి కల్పనకు అవి ఎంతగానో దోహదపడతాయి. అందుకే ప్రభుత్వం కూడా నియోజకవర్గాల్లో సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలిచ్చి.. త్వరగా అనుమతులు మంజూరు చేయాలని, పరిశ్రమల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు సైతం ప్రతి సమావేశంలో ఆదేశిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది.
నాలుగు నియోజకవర్గాల్లో పూర్తికాని పనులు..
ఏర్పాటు కాని పరిశ్రమలు
జిల్లావాసులకు తప్పని వలసలు
పార్వతీపురం, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఎంతో ముఖ్యం. ప్రధానంగా వలసల నివారణకు, స్థానికంగా ఉపాధి కల్పనకు అవి ఎంతగానో దోహదపడతాయి. అందుకే ప్రభుత్వం కూడా నియోజకవర్గాల్లో సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలిచ్చి.. త్వరగా అనుమతులు మంజూరు చేయాలని, పరిశ్రమల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు సైతం ప్రతి సమావేశంలో ఆదేశిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. మన్యం జిల్లాలో పారిశ్రామిక పురోగతి కనిపించడం లేదు. నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు మంజూరు చేసినా పనులు ఊపందుకోవడం లేదు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటు కావడం లేదు. మొత్తంగా ఉపాధినిచ్చే పరిశ్రమలు లేకపోవడంతో మన్యం వాసులకు వలసలు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేశారు. అయితే నిధుల సమస్య కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. మొత్తంగా ఒక్క పార్క్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలో మన్యం అట్టడుగున ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించగా.. మరి దీనిపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
- పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం పనుకువలస వద్ద 27 ఎకరాల 26 సెంట్ల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు గత ఏడాది మే నెలలో శంకుస్థాపన చేశారు. 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 170 ప్లాట్స్ ఏర్పాటు చేసి.. వాటిని ఔత్సాహిక పారి శ్రామికవేత్తలకు కేటాయించాలని నిర్ణయించారు. అయితే సుమారు రూ.7.5 కోట్లతో చేపడుతున్న రహదారులు, కాలువలు, లైట్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు నేటికీ పూర్తికాలేదు.
- కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం చిలకాం ప్రాంతంలో 19 ఎకరాల 26 సెంట్లు స్థలాన్ని ఎంఎస్‌ఎంఈ పార్క్ కోసం స్థల ఎంపిక చేశారు. భూసేకరణ పూర్తయి శంకుస్థాపన జరిగినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. భూసేకరణకు సంబంధించి చెల్లింపులు జరగకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలంటే రూ.3.85 కోట్ల వరకు చెల్లించాలని ఈ ఏడాది జనవరి 8న పారిశ్రామిక శాఖాధికారులకు ఓ లేఖ వెళ్లింది. అయితే దానిపై ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు.
- పార్వతీపురం నియోజకవర్గం నర్సిపురం పంచాయతీ పరిధిలో 4 ఎకరాల 78 సెంట్లను ఎంఎస్‌ఎంఈ పార్క్ కోసం ఎంపిక చేశారు. అయితే జగనన్న కాలనీ కోసం గతంలో పార్వతీపురం పట్టణ పేదలకు అప్పట్లో ఇక్కడ పట్టాలు కూడా అందించారు. అయితే అది నివాసయోగ్యమైన ప్రాంతం కాకపోవడంతో ఎవరూ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఆ స్థలాన్ని ఎంఎస్ ఎంఈ పార్క్ కోసం కేటాయించారు. కాగా ఆ ప్రాంతంలో పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు వేరే చోట స్థలం మంజూరు చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఎంఎస్‌ఎంఈ పార్క్ పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
- ఇక సాలూరు ప్రాంతంలో సుమారు 15 ఎకరాలను ఎంఎస్‌ఎంఈ కోసం ఎంపిక చేశారు. నిధుల సమస్య కారణంగా ఇక్కడ కూడా పనులు పూర్తికాలేదు.
త్వరలో ప్రారంభమవుతాయి
ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల్లో అభివృద్ధి పనులకు ఏపీఐఐసీ ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించాం. సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. పాలకొండలో దాదాపు పనులు పూర్తయ్యాయి.
- కృష్ణప్రసాద్, జిల్లా ఏపీఐఐసీ మేనేజర్