Encroachments ఆక్రమణలకు అడ్డుకట్టపడేనా?
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:47 PM
Will Encroachments Be Curbed? జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో చెరువుల ఆక్రమణలు గురువుతున్నాయి. సాగునీరందించే చెరువులు పంట భూములుగా మారుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,816కు పైగా చెరువులు ఆక్రమణలకు గరై ఆనవాళ్లను కోల్పోయాయి.
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
గరుగుబిల్లి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో చెరువుల ఆక్రమణలు గురువుతున్నాయి. సాగునీరందించే చెరువులు పంట భూములుగా మారుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,816కు పైగా చెరువులు ఆక్రమణలకు గరై ఆనవాళ్లను కోల్పోయాయి. కాగా జల సంరక్షణలో భాగంగా చెరువుల పరిరక్షణ కోసం సరిహద్దు కందకాలు తవ్వి.. ఆక్రమణలకు చెక్ పెట్టాలని ఇటీవల కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆక్రమణలను గుర్తించేందుకు మండల అధికారులు కదిలారు. ఆయా చెరువుల ప్రాంతాలకు వెళ్లి కందకాలు తవ్వే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారు వెళ్లిన తర్వాత కొలతల కోసం వేసిన సామగ్రిని తీసివేసి యథావిధిగా కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
గరుగుబిల్లిలోని రాచప్ప చెరువులో ఆలయ నిర్మాణానికి కొంతమేర చెరువు గర్భంలో స్థలాన్ని చదును చేశారు. రహదారికి ఆనుకుని పలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇక ఉద్దవోలు రెవెన్యూ పరిధిలోని తామర చెరువు ఆక్రమణలతో రూపురేఖలను కోల్పోయింది. ఈ చెరువు పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. అయినప్పటికీ కొంతమంది చెరువును కబ్జా చేస్తుండడంతో ఆయకట్టుకు నీరందడం లేదు. చినగుడబ పరిధిలోనూ ఇదే విధంగా ఆక్రమణలున్నాయి. దీనిపై గరుగుబిల్లి తహసీల్దార్ పి.బాలను వివరణ కోరగా గరుగుబిల్లిలో ఆక్రమణలను తొలగించామని తెలిపారు. అనధికార నిర్మాణాలపై ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు సమాచారం అందించామన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగింపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో పాటు గ్రామ స్థాయిలో పరిశీలించి నివేదికలు అందించాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. నిబంధనలకు వ్యతి రేకంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.