Will dog bites be controlled? కుక్కల బెడదకు చెక్ పడనుందా?
ABN , Publish Date - May 23 , 2026 | 11:39 PM
Will dog bites be controlled? వీధి కుక్కల బెడద నుంచి త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. వాటి సంఖ్య భవిష్యత్‌లో తగ్గనుంది. నియంత్రణకు కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో యంత్రాంగం కదులుతోంది. బొబ్బిలి కేంద్రంగా మూడు మున్సిపాలిటీల కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నారు. హర్యానాకు చెందిన స్నేహ ఏజెన్సీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలనకు నేడో రేపో బొబ్బిలి రానున్నారు.
కుక్కల బెడదకు
చెక్ పడనుందా?
నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు
వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లకు ఏర్పాట్లు
స్నేహ ఏజన్సీకి బాధ్యత అప్పగింత
నేడో రేపో సంస్థ ప్రతినిధులు పరిశీలనకు బొబ్బిలి రాక
ఒక్కో కుక్కపై రూ.1500 చెల్లింపునకు ఒప్పందం
వీధి కుక్కల బెడద నుంచి త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. వాటి సంఖ్య భవిష్యత్‌లో తగ్గనుంది. నియంత్రణకు కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో యంత్రాంగం కదులుతోంది. బొబ్బిలి కేంద్రంగా మూడు మున్సిపాలిటీల కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నారు. హర్యానాకు చెందిన స్నేహ ఏజెన్సీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలనకు నేడో రేపో బొబ్బిలి రానున్నారు.
బొబ్బిలి, మే 23 (ఆంఽధ్రజ్యోతి):
దేశవ్యాప్తంగా వీధికుక్కల బెడద తీవ్రతరమైంది. చిన్నారులను, పెద్దలను గాయపరచడం అధికమైంది. ఈ విషయం దేశ అత్యున్నత న్యాయస్ధానం దృష్టికి వెళ్లింది. సుప్రీంకోర్టు స్పందిస్తూ కుక్కల నియంత్రణకు అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రమాదకరమైన వీధికుక్కలు ఎక్కడా కనిపించడానికి వీల్లేదని, ఈ విషయంలో నిర్లిప్తత చూపితే కోర్టు ధిక్కార కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో అధికారులు చర్యలు చేపట్టారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని రామన్నదొరవలస సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కు దగ్గర బొబ్బిలి, పారతీపురం, సాలూరు మున్సిపాలిటీలకు చెందిన కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేసేందుకు పదేళ్ల క్రితమే షెడ్లు, ఇతర వసతులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాటిని ఇన్నాళ్లూ సక్రమంగా వినియోగించుకున్న దాఖలా లేదు. వీధి కుక్కలను అక్కడికి తీసుకొచ్చి పశువైద్యునితో సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించిన అనంతరం వాటిని వారం పదిరోజుల వరకు అక్కడే ఉంచి ఆహారం సమకూర్చాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో మున్సిపాలిటీలు ఈ ప్రక్రియను పక్కాగా అమలు చేయలేదు. ఏదో మొక్కుబడిగా కొన్ని కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి మమ అనిపించేవారు. ఇదిలా ఉంటే జిల్లాలోని పలు ప్రాంతాలలో వీధి కుక్కల బారిన పడి అనేక మంది గాయపడడం, మృత్యువాతపడిన చేదు అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి, మల్లమ్మపేట, కోరాడవీధి, దిబ్బగుడ్డివలస గ్రామాల్లో వీధికుక్కలు, పిచ్చికుక్కలు స్వైరవిహారం చేయడం, కొంతమంది మృత్యువాత పడడం కూడా జరిగింది. దీంతో వీధికుక్కల అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నిధుల లభ్యతను బట్టి శస్త్రచికిత్సలు
లాలం రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, బొబ్బిలి
మున్సిపాలిటీలో నిధుల లభ్యతను బట్టి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయిస్తాం. ఈ మేరకు హర్యానాకు చెందిన స్నేహ ఏజెన్సీకి వర్క్‌ఆర్డర్ ఇచ్చాం. ప్రస్తుతం విజయనగరం కార్పొరేషన్‌లో ఈ ప్రక్రియ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో బొబ్బిలిలో చేపడతాం. బొబ్బిలిలో 640 కుక్కలు ఉన్నట్లు గుర్తించాం. తొలివిడతగా 200 కుక్కలకు ఆపరేషన్లు చేయించి, వాటికి ఆహారం తదితర వాటిని స్నేహ ఏజెన్సీ వారు సమకూర్చుతారు. ఇందుకు ఒక్కో కుక్కపై మున్సిపాలిటీ తరపున రూ.1500 చొప్పున చెల్లిస్తాం.