Share News

Will do re-survey later? తర్వాతైనా రీ సర్వే చేస్తారా?

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:19 AM

Will do re-survey later? జామి అగ్రహారం భూముల్లో(ఇనాం) రీసర్వే చేసి తమకు హక్కులు కల్పించాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్న సాగు రైతులకు మరోసారి నిరాశే ఎదురైంది. జామిలో బుధవారం నుంచి రీసర్వే జరుగనున్న నేపథ్యంలో ఈ భూముల్లో కూడా రీ సర్వే చేస్తారని వారంతా భావించారు. కానీ అధికారులు ముందు జిరాయితీ భూముల్లో రీసర్వే చేస్తామని, తర్వాత అగ్రహారం భూముల్లో చేపడ్తామని చెబుతుండడంతో రైతులు డీలాపడ్డారు.

Will  do re-survey later? తర్వాతైనా   రీ సర్వే చేస్తారా?
జామి అగ్రహారం భూములు

తర్వాతైనా

రీ సర్వే చేస్తారా?

అగ్రహారం భూముల(ఇనాం) రైతుల్లో అనుమానాలు

తర్వాత రీసర్వే చేస్తామన్న అధికారులు

ముందు జిరాయితీ భూముల్లో చేపడతామనడంపై అభ్యంతరాలు

సమస్య పరిష్కారంపై దశాబ్దాలుగా ఎదురుచూపు

జామి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జామి అగ్రహారం భూముల్లో(ఇనాం) రీసర్వే చేసి తమకు హక్కులు కల్పించాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్న సాగు రైతులకు మరోసారి నిరాశే ఎదురైంది. జామిలో బుధవారం నుంచి రీసర్వే జరుగనున్న నేపథ్యంలో ఈ భూముల్లో కూడా రీ సర్వే చేస్తారని వారంతా భావించారు. కానీ అధికారులు ముందు జిరాయితీ భూముల్లో రీసర్వే చేస్తామని, తర్వాత అగ్రహారం భూముల్లో చేపడ్తామని చెబుతుండడంతో రైతులు డీలాపడ్డారు. తర్వాతైనా చేస్తారో... లేదోనన్న సందేహంలో పడ్డారు.

జామి అగ్రహారం భూములపై నెలకొన్న వివాదం ఏళ్లుగా కొలిక్కిరావడం లేదు. పూర్వీకుల నుంచి ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతులు హక్కుల కోసం పోరాడుతున్నారు. నేతలు, అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఆందోళనలు చేశారు. సర్వే చేసి హక్కులు కల్పించాలన్న వారి కోరికను గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గత ఏడాది జనవరిలో రైతులు మంత్రి లోకేశ్‌, కలెక్టర్‌కు విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లోనూ కథనాలు వచ్చాయి. వాటిపై జిల్లా అధికారులు స్పందించి జామి మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయ్యాక అగ్రహారం భూముల్లో కూడా రీసర్వే చేస్తామన్నారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని రైతులు ఊరట చెందారు. కానీ అధికారులు మళ్లీ మెలిక పెట్టారు. జామిలో బుధవారం నుంచి రీసర్వే ప్రారంభం అవుతున్నప్పటికీ ముందు జిరాయితీ భూముల్లో రీసర్వే ఉంటుందన్నారు. మండల కేంద్రంలో ఉన్న 3,500 ఎకరాల జిరాయితీ భూములకు మాత్రమే చేస్తామని, అగ్రహారం భూములు 2,700 ఎకరాల్లో తర్వాత రీసర్వే చేస్తామని చెబుతున్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే జిరాయితీ భూముల సర్వే పూర్తయ్యాక అగ్రహారం భూములపై స్పష్టత వస్తుందని, అందుకే ఈ విధంగా సర్వేకు ముందుకు వెళ్తున్నట్లు తహసీల్దార్‌ కృష్ణంరాజు తెలిపారు.మండల రెవెన్యూ అధికారుల ప్రకటనను అగ్రహారం రైతులు తప్పుపడుతున్నారు. జిరాయితీలను ఆనుకొని అగ్రహారం భూములున్నప్పుడు సర్వే ఒకేసారి ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఐదు దశాబ్దాలుగా..

ఐదు దశాబ్దల కాలంగా ఆ భూముల్లో సర్వే చేయాలని కోరగా 2016లో సుమారు 1694 ఎకరాల్లో సర్వేచేశారు. మిగిలిన 892 ఎకరాల్లో సర్వేచేయకుండా వదిలేశారు. సర్వే చేసిన భూములను కూడా ఆన్‌లైన్‌లో నమోదుచేయలేదు. అదేవిధంగా 322 మందికి పట్టాలు ఇచ్చినా వాటికి చట్టబద్ధత లేదని రైతులు చెబుతున్నారు. దీంతో కథ మొదటికి వచ్చింది. మరోసారి అలా కాకుండా ఈసారి రీసర్వేలో అన్ని భూముల వివరాలను ఆన్‌లైన్‌ చేయాలని వారంతా కోరుతున్నారు. అధికారుల అడుగులు చూస్తుంటే సర్వేకు ఇంకెంతకాలం పడుతుందోనని సందేహిస్తున్నారు.

ఒకేసారి సర్వే చేయాలి

30ఏళ్లుగా అగ్రహారం భూముల సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇదే సమయంలో ఈప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వందలమంది రైతులం కలిసి మంత్రి లోకేశ్‌కు లేఖ ఇచ్చాం. మా కోరిక నెరవేరుతుందని అనుకుంటున్న సమయంలో రెవెన్యూ అధికారులు జిరాయితీల్లో సర్వే చేస్తాం. అగ్రహారం భూముల్లో తరువాత చేస్తామనడం సరికాదు.

- కొత్తలి కన్నంనాయుడు, అగ్రహారం భూమి రైతు, జామి

Updated Date - Apr 22 , 2026 | 12:19 AM