డీజేలకు అడ్డుకట్ట పడేనా?
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:30 AM
వేడుక ఏదైనా డీజే సర్వ సాధారణమైంది. పెళ్లిళ్లు, జన్మదినాలు, ర్యాలీలు, వేడుకలు, ఎలాంటి కార్యక్రమం అయినా డీజే మోత మోగాల్సిందే.
- జిల్లాలో వేలాది వివాహాలు
- అధిక శబ్దాన్నిచ్చే డీజేలు సిద్ధం
- కట్టడి చేయకుంటే కష్టమే
రాజాం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వేడుక ఏదైనా డీజే సర్వ సాధారణమైంది. పెళ్లిళ్లు, జన్మదినాలు, ర్యాలీలు, వేడుకలు, ఎలాంటి కార్యక్రమం అయినా డీజే మోత మోగాల్సిందే. గతంలో ఎక్కడో పబ్‌లకు పరిమితమైన ఈ సంస్కృతి పల్లెలకు పాకింది. అయితే, ఈ డీజే శబ్దాలు పలువురికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. డీజేల వద్ద నృత్యాలు చేస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అస్వస్థతకు గురవుతున్నారు. డీజేలను నిషేధించినట్టు ప్రభుత్వంతో పాటు పోలీసులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ప్రస్తుతం మాఘ మాసం ప్రారంభకావడంతో పెళ్లి సందడి నెలకొంది. దీంతో డీజేల మోతకు రంగం సిద్ధం అవుతోంది. వీటిపై పోలీస్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.
ప్రమాదకరం..
సాధారణంగా మన చెవులు 120 నుంచి 130 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే భరించగలవు. అంతకు మించితే పెను ప్రమాదమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 60 డెసిబుల్స్‌లోపు శబ్దం వింటే ఎటువంటి ఇబ్బందులుండవు. 100 డెసిబుల్స్ దాటితే గుండె జబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 110 డెసిబుల్స్ దాటితే చికాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పి, 120 డెసిబుల్స్ దాటితే చిరాకు, చర్మంపై రోమాలు నిక్కపొడుచుకోవడం, విపరీతమైన తలబాధ వస్తుంది. 160 డెసిబుల్స్ దాటితే చెవుల్లో వినికిడి కణాలపై ప్రభావం చూపుతాయి. నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం కలుగుతుంది. 190 డెసిబుల్స్ శబ్దం దాటితే కర్ణభేరి పగిలిపోతోంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు.పూర్వపు స్థితి రావడం చాలా కష్టం.
రసాయనాల నీటితో..
డీజేల వద్ద నృత్యాలు చేసేవారి పైకి నీటిని వెదజల్లేందుకు వాటికి స్పింకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నీటిలో రసాయనాలతో కూడిన రంగును కలుపుతున్నారు. ఈ నీరు ఏమాత్రం కంటిలోకి వెళ్లినా ప్రమాదకరమే. డీజే బాక్సుల నుంచి వచ్చే వైబ్రేషన్ చాలా ప్రమాదకరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారిపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. ఆ వైబ్రేషన్‌తో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోతాయి. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భిణిలు అధిక శబ్దాలు వింటే గర్భస్థ పిండంపై పెను ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన డీజేలను నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
చర్యలు తప్పవు...
జిల్లాలో డీజేల వినియోగం నిషేధం. వివాహాలు, శుభకార్యాల్లో డీజేల శబ్దంతో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. డీజేలపై ఫిర్యాదు వస్తే తప్పకుండా కేసులు నమోదుచేస్తాం.
-సీహెచ్ ఉపేంద్ర, సీఐ, రాజాం
అనర్థాలు అధికం
ఇటీవల శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో ప్రజలు రుగ్మతల బారిన పడుతున్నారు. ఎక్కువ డెసిబుల్ శబ్దం కలిగించే డీజేలు, సైలెన్సర్లతో అనర్థాలు అధికం. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్దం వింటే పెను ప్రభావం చూపుతుంది. అందుకే దూరంగా ఉండాలి.
-యడ్ల నీరజరాణి, వైద్యులు, రాజాం