Share News

Basic Infrastructure మౌలిక వసతులు కల్పిస్తారా?

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:41 AM

Will Basic Infrastructure Be Provided? పురపాలక సంఘాల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్వతీపురం మున్సిపాల్టీలో ఉన్న 30 వార్డుల సంఖ్య తాజాగా 36కు చేరింది. అయితే వార్డుల పెంపు విషయం పక్కన పెడితే.. మౌలిక వసతుల కల్పన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

  Basic Infrastructure   మౌలిక వసతులు కల్పిస్తారా?
పార్వతీపురం పట్టణం

  • పార్వతీపురం మున్సిపాల్టీని వేధిస్తున్న సమస్యలెన్నో..

  • నాలుగైదు రోజులకొకసారి తాగునీటి సరఫరా

  • అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ

  • అధికారులు దృష్టి సారించాలని విన్నపం

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌3(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘాల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్వతీపురం మున్సిపాల్టీలో ఉన్న 30 వార్డుల సంఖ్య తాజాగా 36కు చేరింది. అయితే వార్డుల పెంపు విషయం పక్కన పెడితే.. మౌలిక వసతుల కల్పన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా మున్సిపాల్టీ ప్రజలను తాగునీటి సమస్య వేధిస్తోంది. పారిశుధ్య నిర్వహణ కూడా రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొత్తవార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

పార్వతీపురం మున్సిపాల్టీ జిల్లా కేంద్రంగా ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల నిర్లక్ష్య వైఖరి కారణంగా పట్టణం కనీస అభివృద్ధికి నోచుకోలేదు. ప్రధాన సమస్యలేవీ పరిష్కారం కాలేదు. వాస్తవంగా పార్వతీపురం జిల్లాకేంద్రంగా మారిన తర్వాత మున్సిపాల్టీ చుట్టూ పుట్టగొడుగుల్లా కాలనీలు వెలుస్తున్నాయి. అనధికారికంగా పట్టణ జనాభా 70 వేలు దాటిపోయింది. కాగా ఇప్పటికీ నాలుగైదు రోజులకొ కసారి తాగునీటి సరఫరా అవుతుండగా.. శివారు కాలనీ ప్రాంతవాసులకు వాటర్‌ ట్యాంకర్లే దిక్కు. వార్డుల్లో పారిశుధ్య నిర్వహణకు కనీసం ఐదు నుంచి ఆరుగురు పారిశుధ్య కార్మికులు అవసరమని గతంలో ప్రజారోగ్యశాఖాధి కారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే పారిశుఽధ్య కార్మికులు 125 మంది లోపే ఉన్నారు. దీంతో పట్టణంలో పారిశుఽధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడే చెత్తాచెదారం దర్శనమిస్తుండగా కాలువల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు తరచూ రోగాలపాలవుతున్నారు. ఇకపోతే ఏ మాత్రం వర్షం పడినా.. పట్టణంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వర్షాకాలంలో పట్టణవాసులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు 30 వార్డుల్లోని వీధిలైట్ల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. జిల్లాకేంద్రంలో వార్డుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఆయా సమస్యలను మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది. పెరుగుతున్న వార్డులు, జనాభాకు తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాల్సి ఉంది. అదేవిధంగా తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణపై కూడా అధికారులు దృష్టి సారించాలని పురపాలక సంఘ వాసులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ డి.పావనిని వివరణ కోరగా... ‘పార్వతీపురం మున్సిపాల్టీలో ఉన్న 30 వార్డుల సంఖ్యను 36కు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. అయితే అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మున్సిపల్‌ ప్రత్యేకాధికారి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణపై శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 12:41 AM