Share News

Will an MIG layout be developed? ఎంఐజీ లేఅవుట్‌ వేస్తారా?

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:03 AM

Will an MIG layout be developed? బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) పరిధిలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలలో మధ్యతరగతి వర్గాల కోసం ఎంఐజీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని ఊరించారు. బుడా ఆవిర్భవించాక ఇచ్చిన హామీ కావడంతో అమలు చేస్తారని అందరూ భావించారు. ఉడా(విశాఖ) మాదిరిగా మంచి కాలనీలు వెలుస్తాయని ఆశపడ్డారు.

Will an MIG layout be developed? ఎంఐజీ లేఅవుట్‌ వేస్తారా?
బుడా కార్యాలయం

ఎంఐజీ లేఅవుట్‌ వేస్తారా?

అటకెక్కిన బుడా ప్రతిపాదన

బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల్లో నేటికీ కొలిక్కి రాని స్థలసేకరణ

నిరాశలో మధ్యతరగతి వర్గీయులు

బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) పరిధిలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలలో మధ్యతరగతి వర్గాల కోసం ఎంఐజీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని ఊరించారు. బుడా ఆవిర్భవించాక ఇచ్చిన హామీ కావడంతో అమలు చేస్తారని అందరూ భావించారు. ఉడా(విశాఖ) మాదిరిగా మంచి కాలనీలు వెలుస్తాయని ఆశపడ్డారు. రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎంఐజీ లేఅవుట్‌ మాత్రం పట్టాలెక్కలేదు. నేటి వరకు స్థలసేకరణే కొలిక్కి రాలేదు. దీంతో ఆయా వర్గీయులు నిరాశలో పడ్డారు.

బొబ్బిలి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నిర్దేశించిన ధరకు అత్యంత సౌకర్యవంతమైన నివాస స్థలాలను అమ్మేందుకు వీలుగా ప్రభుత్వం గతంలో జీఓ నెంబరు 76 జారీ చేసింది. ఆ ప్రకారం నియోజకవర్గానికి ఒక ప్రాజెక్టు చొప్పున అధునాతన లేఅవుట్ల ఏర్పాటు కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఇంతవరకు బొబ్బిలి పట్టణంలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. మూడు పట్టణాలలో డిమాండ్‌ సర్వే పూర్తయింది. నాలుగేళ్ల క్రితం బొబ్బిలిలో 2563 మంది, పార్వతీపురంలో 1127 మంది, సాలూరులో 1373 మంది ప్లాట్ల కొనుగోలు కోసం ప్రాథమికంగా ముందుకొచ్చారు. బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గున్నతోటవలసలో తొలుత సుమారు 50 ఎకరాలను లేఅవుట్‌ కోసం అధికారులు గుర్తించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం మాదిరిగా రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఈ ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గత ప్రభుత్వంలో ప్రకటించారు. 150, 200, 240 చదరపు గజాలుగా మూడు కేటగిరీల్లో స్థలాలను విభజిస్తామన్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ వీటి ధరలను నిర్ణయిస్తుందని కూడా ప్రకటించారు. 40, 60 అడుగుల రహదారులు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అవెన్యూ ప్లాంటేషన్‌, నీరు, విద్యుత్‌ ఇతరత్రా అధునాతన సదుపాయాలను పబ్లిక్‌హెల్త్‌ విభాగం ద్వారా కల్పిస్తామని చెప్పారు. ఉన్న స్థలాల కన్నా దరఖాస్తులు అధికంగా వస్తే లాటరీద్వారా లబ్ధిదారులకు కేటాయింపులు చేపట్టాలని అనుకున్నారు. క్లియర్‌ టైటిల్‌తో ఎటువంటి వివాదాలకు తావులేని రీతిలో ప్లాట్లను బుడా ద్వారా పొందవచ్చని బుడా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ లేఅవుట్‌లో పది శాతం స్థలాలను 20 శాతం రిబేట్‌తో విక్రయించాలనుకున్నారు. పైగా స్థలం సొమ్మును లబ్ధిదారులు వాయిదాల్లో చెల్లించవ్చని, ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని పొందవచ్చని కూడా చెప్పారు.

- సాలూరు పట్టణంలో మాత్రమే బుడా లేఅవుట్‌ వెలిసింది. లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టారు. బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల్లో ఎటువంటి కదలిక లేకపోవడం గమనార్హం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బుడా ఏర్పాటైంది. అనతికాలంలోనే 2019లో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ హయాంలో ఎంఐజీ లేఅవుట్‌ కోసం స్థలాల సేకరణ పేరుతో చాలా హడావిడి చేశారు. కాని ఒక్క లేఅవుట్‌ కూడా వేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అయినా ఈ పనులు జోరందుకుంటాయని భావించినప్పటికీ అలా జరగడం లేదు.

ప్రయత్నాలు జరుగుతున్నాయి

తెంటు లక్ష్మునాయుడు, బుడా చైర్మన్‌, బొబ్బిలి

బుడా ఎంఐజీ లేఅవుట్‌ కోసం స్థలసేకరణ జరుగుతోంది. సీరియస్‌గానే ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం స్థలం సమకూర్చాల్సి ఉంది. సాలూరులో లేఅవుట్‌ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బొబ్బిలి, పార్వతీపురంలో భూ కేటాయింపు ఇంకా జరగలేదు. స్థలం దొరికిన వెంటనే ప్రణాళికాబద్ధంగా వాటిని అభివృద్ధి చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులకు అప్పగిస్తాం.

Updated Date - Oct 10 , 2026 | 12:03 AM