Share News

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోరేం?

ABN , Publish Date - May 07 , 2026 | 12:14 AM

మండలం కేంద్రంలో ఉన్న జేఏ చానెల్‌ ఆక్రమణలకు గురైనా సంబంధిత శాఖలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నించారు.

 ఆక్రమణదారులపై చర్యలు తీసుకోరేం?
ఉద్యోగిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ రఘురాజు

- వాడీవేడిగా మండల సమావేశం

జామి, మే 6 (ఆంధ్రజ్యోతి): మండలం కేంద్రంలో ఉన్న జేఏ చానెల్‌ ఆక్రమణలకు గురైనా సంబంధిత శాఖలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నించారు. ఆక్రమణలు తొలగించడం చేతకాకపోతే తప్పుకోవాలని మందలించారు. ఆక్రమణలు తొలగించి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చూడాలన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ సబ్బవరపు అరుణ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్‌పీటీసీ సభ్యులు మట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ఎందుకు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ప్రశ్నించారు. మండలంలో టెండర్ల ప్రకారం చేయించాల్సిన రూ.నాలుగు కోట్ల 20లక్షల పనులు ఇతరులకు ఎలా కట్టబెట్టారని పంచాయతీరాజ్‌ జేఈతో పాటు ఎంపీడీవోను ప్రశ్నించారు. వెంటనే పనులు రద్దుచేసి టెండర్ల ద్వారా కేటాయించాలన్నారు. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు వెలిశాయని.. వాటిని నిరోధించడంలో ఎందుకు వి ఫలమవుతున్నారని ఎక్సైజ్‌ అధికారులను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మట్లాడుతూ రీసర్వే ద్వారా రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలకు ప్రభుత్వం రూ.700కోట్లు కేటాయించిందని... రెవెన్యూ అధికారులు నిజాయితీగా సర్వే చేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారిగా ఉన్న డ్వామా పీడీ తీరుపై ఎంపీటీసీ సభ్యులు ఆక్షేపణ వ్యక్తం చేశారు. లోట్లపల్లిలో మేట్లు తమకు వేతనదారుల నుంచి రూ.300 వంతున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీల్లోనూ ఇదే తీరు ఉందన్నారు. ఈ సమావేశంలో జడ్‌పీటీసీ సరయు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా... ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జామిలో లండ దేముడు అనే వృద్ధుడికి ప్రభుత్వం పింఛను అందించేవరకు బీజేపీ నాయకురాలు ఆదిలక్ష్మి ద్వారా నెలకు రూ.రెండువేల వంతున అందిస్తానని చెప్పారు.

Updated Date - May 07 , 2026 | 12:14 AM