Why Was It Stopped Here? ఇక్కడెందుకు ఆపారో?
ABN , Publish Date - May 19 , 2026 | 12:14 AM
Why Was It Stopped Here? జిల్లాలో రేషన్ డిపో డీలర్ల నియామకం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. మన్యం జిల్లాలో మాత్రం నిలిచిపోయింది. అసలు ఈ ప్రక్రియ ఇక్కడెందుకు ఆపారన్న దానిపై స్పష్టత కొరవడింది
16 నెలలైనా అందని నియామక పత్రాలు
ఇతర జిల్లాల్లో పూర్తయిన ప్రక్రియ
తీవ్ర నిరాశలో అభ్యర్థులు
ప్రభుత్వం స్పందించాలని విన్నపం
పార్వతీపురం, మే18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ డిపో డీలర్ల నియామకం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. మన్యం జిల్లాలో మాత్రం నిలిచిపోయింది. అసలు ఈ ప్రక్రియ ఇక్కడెందుకు ఆపారన్న దానిపై స్పష్టత కొరవడింది. రానున్న రోజుల్లో డీలర్ల నియామకం జరుగుతుందా? లేక రద్దు చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఫలితాలు వచ్చి 16 నెలలైనా ఇంతవరకు నియామక పత్రాలు అందకపోవడంపై అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి...
- పార్వతీపురం డివిజన్ పరిధిలో 36, పాలకొండ డివిజన్ పరిధిలో 20 రేషన్ డిపోల్లో డీలర్ల నియామకానికి 2024, డిసెంబరు9న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 19న వాటిని పరిశీలించారు. ఆ తర్వాత అభ్యర్థులకు అదే నెలలో పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించారు. ఇందులో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. మొత్తంగా 56 దుకాణాలకు అర్హత పొందిన వారి జాబితాను 2025, జనవరి 10న ప్రకటించారు. ఆ జాబితాను ఆయా మండలాల తహసీల్దార్లకు అందించారు. అయితే అప్పట్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నియామక పత్రాలు అందించలేదు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో పలువురికి నియామకపత్రాలు అందించారు. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం ఈ ప్రక్రియను ముందుకు సాగలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేన చెందుతున్నారు.
- ప్రతి ఎనిమిది వందల రేషన్ కార్డులకు ఒక డీలర్ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బలిజిపేట , గరుగుబిల్లి, కొమరాడ , మక్కువ , పాచిపెంట , పార్వతీపురం , సాలూరు మండలాలతో పాటు పార్వతీపురం టౌన్ పరిధిలో నిబంధ నల ప్రకారం డీలర్ల నియామక ప్రక్రియ చేపట్టారు. అదేవిధంగా జియ్యమ్మవలస , పాలకొండ , వీరఘట్టం మండలాల్లో పరిధిలోని పలు గ్రామాల్లో రేషన్ డీలర్లు నియామకానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతవరకు నియామక పత్రాలు అందించకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆ ప్రాంతంలో ఉండలేక.. వేరే ఉద్యోగాలకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు.
- ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో రేషన్ డిపోలకు డీలర్లు లేరు. దీంతో ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో అటు ఇన్‌చార్జి డీలర్లు, ఇటు కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై డీఎస్‌వో అశోక్‌ను వివరణ కోరగా.. ‘గతంలో ఈ ప్రక్రియ ఆపాలని ఉత్తర్వులు వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో డీలర్ల నియామకాలు చేపడతాం.’ అని తెలిపారు.