Share News

Why This Twist at the End? చివరిలో ఎందుకిలా?

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:11 AM

Why This Twist at the End? జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగానే జరిగింది. అయితే గతపది రోజులుగా సీన్‌ మారింది. లక్ష్యానికి చేరువవుతున్న సమయంలో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది.

Why This Twist at the End? చివరిలో ఎందుకిలా?
పాలకొండ రైస్‌మిల్లు వద్ద ధాన్యం బస్తాలతో ఉన్న వాహనాలు

  • మిగిలిన 50 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలులో ఇబ్బందులు

  • అధికారులు, రైస్‌మిల్లర్ల మధ్య సమన్వయ లోపం

  • రైతులకు తప్పని అవస్థలు

- ఎల్‌ఎల్‌.పురం గ్రామానికి చెందిన మండాది పాపినాయుడు తన ధాన్యం అమ్ముకోవడం కోసం 15 రోజులుగా ఎదురుచూస్తున్నాడు. రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. ట్రక్‌షీట్‌ కొట్టడానికి అనుమతులు రాలేదని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు చెబుతున్నారు. ఎప్పుడొస్తుందని చెబితే తమకు తెలియదని, వచ్చినప్పుడు సమాచారం అందిస్తామని వారు బదులిస్తున్నారు. దీంతో ఈసురో మంటూ తన ధాన్యం నిల్వలను పంట పొలాలకు తరలించాడు.

====================================

- వెలగవాడకు చెందిన రామకృష్ణ.. నూర్పులు పూర్తి చేసి ట్రక్‌ షీటు కోసం నిరీక్షిస్తున్నాడు. రైస్‌మిల్లర్ల వద్దకు వెళితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే తాము ధాన్యాన్ని సేకరిస్తామని చెబుతున్నారు. దీంతో 15 రోజులుగా ధాన్యం కల్లాల్లోనే ఉంది. మరో వైపు పండుగ సమీపి స్తుండడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.

పాలకొండ, జనవరి6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇలా ఎంతోమంది రైతులు ధాన్యం విక్రయాలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగానే జరిగింది. అయితే గతపది రోజులుగా సీన్‌ మారింది. లక్ష్యానికి చేరువవుతున్న సమయంలో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. అధికారులు, రైస్‌మిల్లర్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తమకు బ్యాంకు గ్యారెంటీలు ఉన్నా ఉన్నతాధికారులు నుంచి టార్గెట్లు రాలేదని, ట్రక్కు షీట్లు ఇవ్వకపోతే ధాన్యాన్ని సేకరించలేమని కొందరు రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. దీనితో ఎంతో ఉత్సాహంగా మిల్లులకు పరిగెత్తిన రైతులు అంతే నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 111 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటి ద్వారా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైబడి ధాన్యం సేకరించారు. 99 శాతం మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమయ్యాయి. ఇక మిగిలిన ధాన్యాన్ని సేకరించేందుకు చొరవ చూపాల్సి ఉంది. పాలకొండ వీరఘట్టం, జియమ్మవలస, తదితర మండలాల్లో ఇంకా రైతుల వద్దే ధాన్యం నిల్వలున్నాయి. వాటి కొనుగోలుకు సంబంఽధించి బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఉన్న రైస్‌మిల్లులకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే బీజీలు ఉన్న కొంతమంది రైస్‌మిల్లర్లు అధికారుల ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రైస్‌ మిల్లులకు ధాన్యం సేకరణకు అనుమతులు ఉన్నా.. అనుకున్న స్థాయిలో బీజీలు లేవు. దీంతో ఆయా మిల్లర్లు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

వాస్తవంగా జిల్లాలో మిల్లర్లంతా ఒకేలా బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లను ఇవ్వలేదు. దీంతో బీజీలు అధికంగా ఇచ్చిన వారు అసోసియేషన్‌, అధికారుల తీరుపై గుర్రుమంటున్నారు. తక్కువ బీజీలు ఇచ్చిన మిల్లర్లకు న్యాయం చేయడానికి 1:3 వంటి నిబంధనలు తీసుకొస్తున్నారని ఆక్షేపి స్తున్నారు. బ్యాంకు గ్యారెంటీలు అందుబాటులో ఉన్నా ధాన్యం సేకరణకు అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. పూర్తిగా బీజీలు చెల్లించని వారికి టార్గెట్లు ఇవ్వడం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక సమస్యలను చూపి ధాన్యం సేకరణకు అనుమతులు ఇవ్వడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఇలా పలు సాంకేతిక పరమైన అంశాలను చూపి. ధాన్యం సేకరణ చేయకపోవడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం

జిల్లాలోని రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం. జిల్లాలోని రైస్‌మిల్లర్ల అసోసి యేషన్‌, మిల్లర్లతో సమన్వయ సమావేశం నిర్వహించాం. సాంకేతిక సమస్యలు అధిగమించి.. పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నాం.

శ్రీనివాసరావు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌,

==============================

పూర్తిస్థాయిలో సేకరిస్తాం..

రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తాం. జిల్లాలోని 111 రైస్‌ మిల్లుల ద్వారా కొనుగోలు చేపడతాం.

- రామ్మోహన్‌రావు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

Updated Date - Jan 07 , 2026 | 12:11 AM