Why this school? ఈ పాఠశాలే ఎందుకో?
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:58 PM
Why this school? మేడమ్.. మా పాఠశాలను మార్చకుండా చూడండి. ప్రస్తుతం ఉన్న బాలుర ఆశ్రమ పాఠశాలను బాలికల ఆశ్రమ పాఠశాలగా మార్పు చేసే ప్రయత్నంలో గిరిజన సంక్షేమ శాఖ వున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఇక్కడ చదవుతున్న విద్యార్థులమంతా రోడ్డునపడతాం. ఎక్కడెక్కడినుంచో ఇక్కడ చదువుకొనేందుకు వచ్చాం. బాలికల కోసం మరో ఆరఽశమ పాఠశాలను ఏర్పాటు చేసేలా చూడండి ప్లీజ్ - ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సోమవారం అందించిన విన్నపమిది.
ఈ పాఠశాలే ఎందుకో?
ఎస్.కోట ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలను బాలికల కోసం కేటాయించే ప్రయత్నాలు
ఎక్కువ ప్రవేశాలు ఉన్నప్పటికీ దీనిపైనే కన్ను
వద్దంటూ ఎమ్మెల్యేకు విన్నవించుకున్న గిరిజన విద్యార్థులు
శృంగవరపుకోట, మార్చి 17(ఆంధ్రజ్యోతి):
మేడమ్.. మా పాఠశాలను మార్చకుండా చూడండి. ప్రస్తుతం ఉన్న బాలుర ఆశ్రమ పాఠశాలను బాలికల ఆశ్రమ పాఠశాలగా మార్పు చేసే ప్రయత్నంలో గిరిజన సంక్షేమ శాఖ వున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఇక్కడ చదవుతున్న విద్యార్థులమంతా రోడ్డునపడతాం. ఎక్కడెక్కడినుంచో ఇక్కడ చదువుకొనేందుకు వచ్చాం. బాలికల కోసం మరో ఆరఽశమ పాఠశాలను ఏర్పాటు చేసేలా చూడండి ప్లీజ్
- ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సోమవారం అందించిన విన్నపమిది.
జిల్లాలో ఎనిమిది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉండగా ఆరు బాలురుకు, రెండు బాలికలకు కేటాయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరఽశమ పాఠశాలను బాలురు, బాలికలకు సరిసమానంగా విద్యను అందించాలని ఆలోచన చేస్తోంది. బాలురుకు ఉన్న ఆరు పాఠశాలల్లో రెండు పాఠశాలలను బాలికలకు మార్పు చేయడం ద్వారా చెరో నాలుగు ఆశ్రమ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న బాలుర ఆశ్రమ పాఠశాలను బాలికల ఆశ్రమ పాఠశాలగా మార్చాల్సి ఉన్నప్పటికీ నిర్దేశించిన విద్యార్థుల ప్రవేశాల కంటే అధికంగా ప్రవేశాలున్న శృంగవరపుకోట గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను బాలికల ఆశ్రమ పాఠశాలగా మార్చాలనుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రవేశాలు ఎక్కువ ఉన్నా..
రామభద్రపురం మండలం నేరేళ్లవలస గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 70 మంది , మెంటాడ మండలం అండ్ర గిరిజన అశ్రమ పాఠశాలలో 90 మంది, వేపాడ మండలం కొండగంగుబూడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 150 మంది. నెల్లిమర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 170 మంది బాలురు చదవుతున్నారు. శృంగవరపుకోట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 210 మంది, గంట్యాడ మండలం తాటిపూడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 230 బాలురు విద్యను అభ్యసిస్తున్నారు. బాలికలకు విజయగనరం, బొబ్బిలిలో మాత్రమే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. శృంగవరపుకోట గిరిజన ఆశ్రమ పాఠశాల కంటే నేరేళ్లవలస, అండ్ర,కొండగంగుబూడి, నెల్లిమర్ల ఆశ్రమ బాలుర పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా వున్న ఈ మూడు గిరిజన ఆశ్రమ పాఠశాలలను తప్పించి ఎస్.కోట గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను మార్చాలని చూస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారికీ నష్టమే..
శృంగవరపుకోట మండలంలో దశాబ్దం క్రితం నుంచి ప్రభుత్వ విద్యకు సంబంధించిన పాఠశాలలేటిని ఏర్పాటు చేయలేదు. కస్తూర్బా, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలను నిర్మించలేదు. ఆదర్శ (మోడల్ స్కూల్స్) పాఠశాలలను నెలకొల్పలేదు. దీంతో ఈ మండలానికి చెందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చదువుకొనే అవకాశం కోల్పోతున్నారు. విభిజిత జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా శృంగవరపుకోట నియోజకవర్గంలో వుంది. ఈ మండలాలకు వచ్చేటప్పటికి ఎస్.కోట మండలంలోనే గిరిజన జనాభా ఎక్కువ. దీనికి తోడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు ముఖద్వారం. అరకు, అనంతగిరి మండలాలకు చెందిన గిరిజనులు పిల్లలను ఇక్కడ చదివించుకొనేందుకు ఇష్టపడుతున్నారు. ఎస్.కోటలో వున్న గిరిజన ఆశ్రమ పాఠశాలను బాలికల ఆశ్రమ పాఠశాలగా మార్చేస్తే ఈ నియోజకవర్గ పరిధిలోని గిరిజన బాలురుతో పాటు అరకు, అనంతగిరి మండలాలకు చెందిన గిరిజన బాలురులకు నష్టం జరగనుంది.
- ఈ బాలుర ఆశ్రమ పాఠశాలను మార్పుచేయకుండా అదనంగా బాలికలకు ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పేర్కొన్నారు.
ఫోటో రైటప్‌ః- 16కోట1 ఎస్.కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికు విన్నవించుకుంటున్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులు
---------------