Share News

Why This Delay? ఎందుకీ జాప్యం?

ABN , Publish Date - May 13 , 2026 | 11:54 PM

Why This Delay? జిల్లాలో మహిళా సంఘాలకు అన్ని విధాలా తోడ్పాటు నిచ్చేందుకు ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకురాల (వీవోఏ) నియామకానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేసింది. కానీ ఆ ప్రక్రియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో మహిళా సంఘాలు వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.

 Why This Delay? ఎందుకీ జాప్యం?
జియ్యమ్మవలస మండల సమాఖ్య భవనం

  • నాలుగు నెలలైనా కదలిక లైని వైనం

  • నేటికీ అందని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు

  • ఎదురుచూపుల్లో మహిళా సంఘాలు

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

జియ్యమ్మవలస, మే13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళా సంఘాలకు అన్ని విధాలా తోడ్పాటు నిచ్చేందుకు ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకురాల (వీవోఏ) నియామకానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేసింది. కానీ ఆ ప్రక్రియ ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో మహిళా సంఘాలు వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. జిల్లాలో 567 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. 19,957 వరకూ మహిళా సంఘాలు ఉన్నాయి. వాటిల్లో 2,22,104 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారికి గ్రామైక్య సంఘాల వీవోఏల ద్వారా బ్యాంక్‌ లింకేజీలు, ఉన్నతి, స్త్రీనిధి వంటి రుణాలు ఇప్పించడం, అవసరమైన బుక్కుల్లో తీర్మానాలు రాయడం వంటి 15 రకాల సేవలు అందిస్తున్నారు. అయితే గ్రామాల్లో మహిళా సంఘాలు ఎక్కువవడంతో వీవోఏలపై పనిభారం పెరిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశిస్తున్న కొన్ని కార్యక్రమాలను సకాలంలో చేయలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర సర్కారు.. 30 మహిళా సంఘాలకు ఒక వీవోఏను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీఎం పర్యవేక్షణలో మండల సమాఖ్యలో సీసీలు, గ్రామ సంఘ అధ్యక్షులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామైక్య సంఘాలను విభజించి... తీర్మానాలు రాసి జిల్లా సమాఖ్యకు పంపించారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్లు రాలేదు. దీంతో గతంలో ఉన్న గ్రామ వీవోఏలు ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల పని అంతా వారే చేసుకోవాల్సి వస్తోంది. ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి వస్తోంది. ప్రస్తుతంజిల్లాలో గ్రామైక్య సంఘాలు 567 ఉండగా.. అదనంగా 58 వరకు ఏర్పడ్డాయి. అంటే 58 వీవోఏలను నియమించాల్సి ఉంది. కానీ నియా మకంలో జాప్యం జరుగుతుండడంతో అటు గ్రామైక్య సంఘాలు, ఇటు మహిళా సంఘాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల 561 మంది వీవోఏలకు కొత్తగా సెల్‌ఫోన్లు ఇచ్చారు. అందులో ఉన్న మహిళా సంఘాల యాప్‌లపై అవగాహన కల్పించారు. కానీ ఈ నూతన వీవోఏల నియా మకం మాత్రం చేపట్టలేదు. ఇదిలా ఉండగా.. పాత గ్రామైక్య సంఘాల్లోని వీవోఏలు మహిళా సంఘాలకు సహకరించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు వచ్చాక..

రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు వచ్చిన తరువాత.. నూతన, పాత గ్రామ సంఘం తీర్మానం, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను ఇనిస్టిట్యూషన్‌ బిల్డింగ్‌ (ఐబీ) ఏపీఎంకు సంబంధిత ఏపీఎం పంపిస్తారు. ఆయన వీటిని సెర్ప్‌లో ఉన్న ఐబీ విభాగానికి పంపించాలి. వారు టెక్నికల్‌ పర్సన్‌ ద్వారా ఈ నూతన గ్రామ సంఘాలను వెబ్‌లో చేర్పుల జాబితాలో పొందుపరుస్తారు. అక్కడ నూతన సంఘాలకు అనుమతులు లభిస్తుంది. నూతన గ్రామ సంఘాలకు ఒక వీవోఏ అవసరమని బడ్జెట్‌ ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ఫైనాన్స్‌ అనుమతి ఇవ్వాలి. నిబంధనల ప్రకారం వీవోఏ తీర్మానంలో ఏపీఎం లాగిన్‌లో అప్రూవల్‌ ఇవ్వాలి. దీనిని సెర్ప్‌లో అనుమతిస్తే వీవోఏకు బడ్జెట్‌ రిలీజ్‌ చేయాలి. మరి ఈ ప్రక్రియ అంతా ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై వెలుగు ఏపీఎం -బి.శివున్నాయుడును వివరణ కోరగా.. ‘నూతన గ్రామైక్య సంఘాల ఏర్పాటు, వీవోఏల నియామక విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇంకా వీవోఏల రిజిస్ట్రేషన్‌ పత్రాలు రాలేదు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.’ అని తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 11:54 PM