Share News

Why the Silence కొండను కొల్లగొడుతున్నా.. ఎందుకీ మౌనం?

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:56 PM

Why the Silence Despite the Hill Being Plundered? జిల్లాకేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాన్ని అటవీశాఖ కాపాడుకోలేకపోతోంది. కళ్ల ముందే గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నా.. అడ్డుకోలేకపోతోంది. పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో బడిదేవర కొండ వద్ద యథావిధిగానే గ్రానైట్‌ తవ్వకాలు కొనసాగుతున్నాయి.

Why the Silence  కొండను కొల్లగొడుతున్నా.. ఎందుకీ మౌనం?
బడిదేవరకొండ వద్ద పరిస్థితి ఇదీ..

  • బడిదేవర కొండ వద్ద కొనసాగుతున్న గ్రానైట్‌ తవ్వకాలు

  • నేటికీ కోర్టును ఆశ్రయించని వైనం

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఆదేశాలే అమలు

  • ఆ శాఖాధికారుల తీరుపై విమర్శల వెల్లువ

పార్వతీపురం, ఏప్రిల్‌22(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాన్ని అటవీశాఖ కాపాడుకోలేకపోతోంది. కళ్ల ముందే గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నా.. అడ్డుకోలేకపోతోంది. పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో బడిదేవర కొండ వద్ద యథావిధిగానే గ్రానైట్‌ తవ్వకాలు కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయల గ్రానైట్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందని తెలిసినప్పటికీ అటవీశాఖ తమకేమీ పట్టనట్లు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అసలు ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

ఇదీ పరిస్థితి..

- బడిదేవర కొండ ప్రాంతం పూర్తిగా రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందిందని గతంలో అటవీ శాఖ అధికారులు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించారు. అయితే అదే ప్రాంతంలో మళ్లీ గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్నా.. ప్రస్తుత అటవీశాఖాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. దీనిపై జిల్లా నుంచి నివేదికలు వెళ్లాయి తప్పితే.. ఇంతవరకు హైకోర్టును ఆశ్రయించకపోవడంపై ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

- కొండపై బడిదేవరమ్మ కొలువై ఉందని ఆ ప్రాంత ప్రజల నమ్మకం. గిరిజనులతో పాటు మైదాన ప్రాంతవాసుల ఆరాధ్య దైవమైన అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఈ కొండపై గ్రానైట్‌ వ్యాపారుల కన్నుపడింది. 2014లో గ్రానైట్‌ తవ్వకాలకు గనులశాఖ అనుమతులను మంజూరు చేసింది. దీనిపై అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. గనులశాఖ అనుమతులు ఇచ్చిన ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆయా శాఖల వాదనలు జరుగుతున్న సమయంలోనే కొంతమంది స్థానికులు సైతం కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఉన్నతాధికారులతో కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌-1లో సర్వే నిర్వహించారు. ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉందని తేల్చారు. దీంతో హైకోర్టు గనులశాఖ ఇచ్చిన అనుమతులు రద్దు చేసింది.

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమతులు రద్దయినా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్‌ మారింది. తనకు అన్యాయం జరిగిందని అప్పట్లో ఓ గ్రానైట్‌ వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అప్పట్లో సర్వే ఆఫ్‌ ఇండియా ద్వారా సర్వే నిర్వహించారు. అయితే తెరవెనుక ఆ వ్యాపారితో పాటు కొంతమంది వైసీపీ నాయకులు చక్రం తిప్పారు. ఈ క్రమంలో సర్వే నివేదికల ఆధారంగా గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ కాదని రెవెన్యూ పరిధిలో ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. మొత్తంగా గత వైసీపీ ప్రభుత్వం కాలంలో అటవీశాఖ అనుమతులు లేకుండానే రెవెన్యూ అధికారులు గ్రానైట్‌ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కాగా అవే ఆదేశాలు కూటమి ప్రభుత్వ పాలనలోనూ కొనసాగుతుండడం గమనార్హం.

- గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు తగిన ఆధారాలను అటవీశాఖకు సమర్పించి ఉంటే గ్రానైట్‌ తవ్వకాలకు బ్రేక్‌ పడేది. అయితే ఆ దిశగా ఆ శాఖాధికారులు చర్యలు తీసుకోకపో వడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో రహదారుల నిర్మాణంతో పాటు గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసే భూముల విషయంలో అభ్యంతరాలు తెలిపే ఆ శాఖ గ్రానైట్‌ తవ్వకాలపై ఎందుకు మౌనంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

పత్రాలు అందించాం..

హైకోర్టును ఆశ్రయించాలని మా శాఖ న్యాయవాదికి పత్రాలు అందించాం. గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్నట్టు నిరూపించాలని కోరాం. అయితే ఇప్పటివరకు కోర్టులో పిటిషన్‌ మాత్రం దాఖలు కాలేదు. ఏదేమైనా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్న ప్రాంతాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

- ప్రసూన, డీఎఫ్‌వో, పార్వతీపురం మన్యం

Updated Date - Apr 22 , 2026 | 11:56 PM