Why the secrecy? దాపరికం ఎందుకో?
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:47 PM
Why the secrecy? దత్తిరాజేరు మండలం కోమటిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 48-17, 17-18,72-19లో ఉన్న భూమిపై 2017 నవంబరులో ఏవిధంగా మ్యుటేషన్ చేశారో? ఆ భూమి ఎవరి పేరున ఉండేది? అనే వివరాలు తెలియజేయాలంటూ ఓ వ్యక్తి దత్తిరాజేరు తహసీల్దార్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం కింద గత నెలలో దరఖాస్తు చేశాడు. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ మ్యుటేషన్ ఫైల్ కార్యాలయంలో లేదని సమాచారం ఇచ్చారు.
దాపరికం ఎందుకో?
భూముల మార్పుపై ఆర్‌టీఐ కింద సమాచారం కోరిన రైతులు
నిరాకరిస్తున్న అధికారులు
కొందరు మొక్కుబడిగా వివరణ
తప్పులు బయటపడతాయన్న భయమా?
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):
- దత్తిరాజేరు మండలం కోమటిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 48-17, 17-18,72-19లో ఉన్న భూమిపై 2017 నవంబరులో ఏవిధంగా మ్యుటేషన్ చేశారో? ఆ భూమి ఎవరి పేరున ఉండేది? అనే వివరాలు తెలియజేయాలంటూ ఓ వ్యక్తి దత్తిరాజేరు తహసీల్దార్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం కింద గత నెలలో దరఖాస్తు చేశాడు. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ మ్యుటేషన్ ఫైల్ కార్యాలయంలో లేదని సమాచారం ఇచ్చారు.
- గంట్యాడ మండలంలోని రామవరం, గొడియాడ, పెణసాం, చినమానాపురం, రామవరం, బుడతనాపల్లి గ్రామాల్లో 2025 జనవరి 1 నుంచి అదే ఏడాది ఆగస్టు 31 తేదీల మధ్య ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, డాక్యుమెంట్‌ల జారీ, పీవోఎల్‌ఆర్ ద్వారా ఎన్ని మ్యుటేషన్లు ఆమోదించారు? ఎన్ని తిరష్కరించారు? తెలియజేయాలంటూ ఓ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గత ఏడాది సెప్టెంబరు నెలలో సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ అధికారులను కోరాడు. దీనికి స్పందించిన రెవెన్యూ అధికారులు అరకొర సమాచారం ఇచ్చారని అప్పీలుదారుడు తెలిపారు.
- విజయనగరం మండలం పినవేమలి రెవెన్యూ పరిధిలో ఓ వ్యక్తికి వారసత్వం ద్వారా వచ్చిన భూమిలో పశువుల శాలలు, గడ్డివాములు ఉన్నాయి. 2023 సంవత్సరంలో గ్రామంలో రీసర్వే జరిగిన సమయంలో ఆ భూమిని వేరే వ్యక్తి పేరున రెవెన్యూ అధికారులు మార్పు చేశారు. ఏవిధంగా ఆన్‌లైన్‌లో మార్పు చేశారో? తెలియజేయాలంటూ రాకోడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా గత ఏడాది డిసెంబరు 12న మండల రెవెన్యూ అధికారిని కోరాడు. ఇంత వరకూ సమాచారం ఇవ్వలేదు.
ఈ ముగ్గురు అప్పీలుదారులు అడిగిన సమాచారం ప్రజా అవసరాలకు సంబంధించినదే. కానీ సమాచారం ఇవ్వడంలో అధికారులు ఎందుకు దాపరికం చేస్తున్నారు? వారికే తెలియాలి. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు సంబంధించి సమాచారం అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రక్షణ వ్యవహారాలు, వ్యక్తిగత సమాచారం మినహా ఏం అడిగినా రాతపూర్వకంగా తెలియజేయాలి అని చట్టం చెబుతోంది. ఒక వేళ ఎక్కువ పేజీలు ఉంటే దానికి అప్పీలుదారుడు నుంచి ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు వసూలు చేసి సమాచారం ఇవ్వాలి. కాగా అధికారులకు ఇటీవల కాలంలో అందుతున్న ఆర్‌టీఐ దరఖాస్తులన్నీ చాలా వరకూ రెవెన్యూవే. మరోవైపు జిల్లాలోని కొంతమంది రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా భూములను ఆన్‌లైన్‌లో మార్పు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు, కాస్త అవగాహన ఉన్న వారు సమాచార చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు మారిన భూముల వివరాలను అడుగుతున్నారు. అయితే నిబంధనలకు అనుగుణంగా రికార్డులు మారిన భూముల సమాచారం ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలా జరగలేదు కాబట్టే అధికారులు దాస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇదే విషయమై జిల్లా రెవెన్యూ అధికారి మురళి వద్ద ప్రస్తావించగా అధికారుల కార్యకలాపాలపై అడిగిన సమాచారం మేరకు తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉందని, ఇవ్వకుండా దాటవేయకూడదని అన్నారు.
-----------------