Why the Delay? ఎందుకీ తాత్సారం?
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:34 PM
Why the Delay? వీధి కుక్కల కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవా లని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో వీధి కుక్కల సంతాన నిరోధక శస్త్రచికిత్సలకు సంబంధించి ఎటువంటి చర్యల్లేవు.
కానరాని సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు
పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయని వైనం
రోజురోజుకూ పెరుగుతున్న కుక్కుకాటు బాధితులు
సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించేదెప్పుడో..?
జియ్యమ్మవలస, జూన్ 2(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవా లని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో వీధి కుక్కల సంతాన నిరోధక శస్త్రచికిత్సలకు సంబంధించి ఎటువంటి చర్యల్లేవు. అదేవిధంగా వాటికి అవసరమైన పునరావాస కేంద్రాలను కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో జిల్లావాసులకు వీధి కుక్కల బెడద తప్పడం లేదు. మరోవైపు కుక్కకాటు బాధితులు రోజురోజుకూ పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాటి బారిన పడి అనేక మంది గాయపడడం, మృత్యువాతపడిన చేదు అనుభవాలు కూడా ఉన్నా.. సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి
- జిల్లాలో 15 మండలాల్లో 965 గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో ఇటీవల చిన్నారుల, పెద్దలపై వీధికుక్కల దాడి అధికమైనా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరి స్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం చూస్తే.. జిల్లాలో 2023 నుంచి ఇప్పటివరకు వీధి కుక్కల బారిన పడి గాయాలపాలైన వారు 20 వేలకు మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, చినమేరంగి సీహెచ్‌సీలు, సాలూరు, పాలకొండ, సీతంపేట ఏరియా ఆసుపత్రులు, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత మూడేళ్లలో దాదాపు 5 వేల మందికి పైగా కుక్క కాటు బాధితులు ఉంటారని అంచనా. పీహెచ్‌సీల వారీగా చూసుకుంటే 2023-24లో 2,706, 2024-25లో 3,872, 2025-26లో 8,847 చొప్పున కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలకు చెందిన కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేసేందుకు పదేళ్ల కిందటే షెడ్లు, ఇతర వసతులను ఏర్పాటు చేసినా.. వాటిని సక్రమంగా వినియోగించుకున్న దాఖలాల్లేవు.
- సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రద్దీ ప్రదేశాలలో వీధి కుక్కలు కనిపించకుండా వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. కచ్చితంగా వాటికి స్టెరిలైజేషన్, రెబీస్ నిరోధక టీకా (యాంటీ రెబీస్ వ్యాక్సిన్)లు తప్పనిసరిగా వేయాలి. సంతాన నిరోధక శస్త్ర చికిత్సల కోసం పట్టుకున్న కుక్కలను మళ్లీ అదే ప్రాంతాల్లో వదలకూడదు. కుక్కలకు ఆహారం వేయాలంటే నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వేయాలి. అదీ కూడా స్థానికంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. అయితే ఇవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. ఇకనైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పశు సంవర్థక శాఖ జేడీ (ఐసీ) డాక్టర్ సీహెచ్ దీనకుమార్‌ను వివరణ కోరగా.. ‘ వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించాం. వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు, పునరావాస కేంద్రం ఏర్పాటు విషయంలో ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే తగు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.