Why step back? వెనకడుగు ఎందుకో?
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:43 PM
Why step back? సోలార్ విద్యుత్ యూనిట్ ద్వారా వాడిన విద్యుత్ కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగితే అది వారికే లాభం. డిస్కంలే ఆ మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ఒకసారి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. కిలోవాట్ ప్లాంట్‌పై రూ.30 వేలవరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయినా గాని జిల్లాలో సూర్యఘర్ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు.
వెనకడుగు ఎందుకో?
సూర్యఘర్ పథకానికి ఆదరణ అంతంతమాత్రమే
దరఖాస్తులు 9,982
ఏర్పాటుచేసుకుంది 2,260 మంది
మరింత చైతన్యం తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం
ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు మొగ్గు
సోలార్ విద్యుత్ యూనిట్ ద్వారా వాడిన విద్యుత్ కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగితే అది వారికే లాభం. డిస్కంలే ఆ మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ఒకసారి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. కిలోవాట్ ప్లాంట్‌పై రూ.30 వేలవరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయినా గాని జిల్లాలో సూర్యఘర్ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. జిల్లా వ్యాప్తంగా 9,982 దరఖాస్తులు రాగా ఏర్పాటుచేసుకుంది 2,260 మంది మాత్రమే.
రాజాం, జనవరి7(ఆంధ్రజ్యోతి):
సోలార్ విద్యుత్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడం లేదు. సూర్యఘర్ పథకం యూనిట్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తున్నా కూడా ముందుకు రావడం లేదు. తాజాగా బీసీలకు రూ.20 వేల రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మార్గాల్లో చైతన్యం తేవడం ద్వారా ఎక్కువ మంది ముందుకొస్తారని భావిస్తోంది. మరోవైపు విద్యుత్ శాఖ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులను ఆహ్వానించాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సైతం తగ్గించిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రణాళిక వేస్తోంది. నియోజకవర్గాల వారీగా కౌంటర్లు ఏర్పాటుకు సన్నద్ధం అవుతోంది. ఏడాదిన్నర కాలంలో 9,982 మంది మాత్రమే వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. అందులో 2,260 మంది రూప్‌టాప్ సోలార్ వేసుకున్నారు.
జిల్లాలో 5,98,425 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా 2 శాతం మంది మాత్రమే సోలార్ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రజలకు విద్యుత్ భారం నుంచి తప్పించేందుకు కూడా ఈ పథకం దోహదపడుతుందని చెబుతున్నాయి. కానీ గత కొంతకాలంగా జరుగుతున్న రిజిస్ర్టేషన్ ప్రక్రియ చూస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదని అర్థమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, మహిళా సంఘ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. డాబాలు లేకపోయినా.. ఖాళీ స్థలాల్లో సోలార్ పలకల ఏర్పాటుకు అవకాశమిచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం పీఎం సుర్యఘర్ పథకాన్ని దాదాపు ఏడేళ్ల కిందటే అందుబాటులోకి తెచ్చింది. భారీగా రాయితీలు ప్రకటించింది. కానీ వైసీపీ ప్రభుత్వం సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. మూడు కిలోవాట్ల పథకానికి సంబంధించి రూ.78 వేల వరకూ సాయం అందించనుంది. ఈ ప్లాంట్లు ఏర్పాటుచేసుకుంటే ఇంటి అవసరాలకుపోను విద్యుత్ మిగిలి ఉంటే అమ్ముకోవచ్చు. డిస్కంలే కొనుగోలు చేసి ఆ నగదును లబ్ధిదారుడికి అందిస్తాయి. మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మాత్రం ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
రాయితీ ఇలా..
ఒక కిలో వాట్ ప్లాంట్ ఏర్పాటుచేసుకునేందుకు దాదాపు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకూ ఖర్చవుతుంది. దీనికి రూ.30 వేలవరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రెండు కిలోవాట్ల ప్లాంట్ అయితే రూ.లక్ష నుంచి రూ.1.45 లక్షల ఖర్చు అవుతుంది. రూ.60 వేలు వరకూ సబ్సిడీ అందిస్తారు. మూడు కిలోవాట్లు అయితే రూ.1.80 లక్షల నుంచి రూ.2.20 లక్షల ఖర్చు అవుతుంది. రూ.90 వేల వరకూ రాయితీ పొందవచ్చు. ఇంటి అవసరాలకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే.. చాలా వరకూ మిగలనుంది. దానిని డిస్కంలకు అమ్మి కొంత ప్రయోజనం కూడా పొందవచ్చు.
బహుళ ప్రయోజనం..
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో లబ్ధిదారుడితో పాటు ప్రభుత్వానికీ ప్రయోజనమే. ఇప్పుడు ఖర్చు పెరిగినా.. దీర్ఘకాలంలో విద్యుత్ పంపిణీ, కొనుగోలులో భారం తగ్గనుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200లోపు యూనిట్లకు ఉచితంగానే విద్యుత్ అందిస్తున్నారు. సాధారణంగా ఒక్కో యూనిట్‌కు రూ.6 ఖర్చు అవుతుంది. సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే చాలా వరకూ ప్రభుత్వానికి ఆదా అయినట్టే. సాధారణంగా ఎక్కువ మంది ఎస్సీ లబ్ధిదారులు 150 యూనిట్లకు మించి వాడరు. అదే ఒక కిలోవాట్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లను అందిస్తుంది. అప్పుడు ప్రభుత్వంపై కేవలం 20 నుంచి 30 యూనిట్ల భారమే పడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 50685 మంది ఉన్నారు. అటు పార్వతీపురం మన్యం జిల్లాలో 73,328 మంది లబ్ధిదారులు ఉన్నారు. కానీ ఇప్పటివరకూ ఒక శాతం మంది కూడా వినియోగించుకోలేదు. ఏడాదిగా రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేపడుతున్నా.. సూర్యఘర్ కింద సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుతో దరఖాస్తులు పెరుగుతాయని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.
ఉత్తర్వులు రావాలి
సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే బీసీలకు రూ.20 వేల రాయితీపై ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా కౌంటర్లు ఏర్పాటుచేస్తాం. పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నా వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఇంటి శ్లాబుతో పాటు ప్రాంగణంలో అయినా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తే సూర్యఘర్ పథకం వర్తిస్తుంది. దీనికి రాయితీ సైతం అందిస్తారు. మిగులు విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి.
- సురేష్‌బాబు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, విజయనగరం
-----------------------