Share News

Why PHEs? పీహెచ్‌ఈలు ఎందుకిలా?

ABN , Publish Date - May 31 , 2026 | 12:08 AM

Why PHEs? పీహెచ్‌ఈలు ఎందుకిలా? పీహెచ్‌సీలు దయనీయంగా ఉన్నాయి. ఏ అనారోగ్య సమస్య వచ్చినా ప్రజలు సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లాలనుకుంటారు. అక్కడ చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటోంది. డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. వైద్యపరికరాలు లేవంటున్నారు.

 Why PHEs? పీహెచ్‌ఈలు ఎందుకిలా?

పీహెచ్‌ఈలు ఎందుకిలా?

కనీస వైద్య సేవలు అందట్లే

నెలకు ఒక ప్రసవం

డాక్టర్‌ ఉంటారో ఉండరో తెలియదు

జిల్లాలో ఆగని మాతా శిశుమరణాలు

జరగని సుఖ ప్రసవాలు

ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్న ప్రజలు

పీహెచ్‌సీలు దయనీయంగా ఉన్నాయి. ఏ అనారోగ్య సమస్య వచ్చినా ప్రజలు సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లాలనుకుంటారు. అక్కడ చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటోంది. డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. వైద్యపరికరాలు లేవంటున్నారు. మందులూ అంతే. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకూ జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల్లో సరాసరి నెలకు ఒక ప్రసవం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో మాతాశిశు మరణాలు కూడా అదుపులోకి రావడం లేదు. గత మూడేళ్లలో ఏటా పెరుగుతూ రావడం ఆందోళనకర పరిణామం.

రాజాం, మే 30(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వాస్పత్రుల్లో సుఖ ప్రసవాలు అంటూ అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. ప్రసవాలు జరగడం లేదు. పీహెచ్‌సీలు ఉత్సవ విగ్రహాలుగా మిగులుతున్నాయి. దీంతో ప్రజలు ప్రైవేటు వైద్యం వైపే చూస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల లక్ష్యం జిల్లాలో 4,320కాగా జరిగినవి కేవలం 443 మాత్రమే జరిగాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 3,330 లక్ష్యంకాగా.. జరిగినవి 1,261. విజయనగరంతో పోల్చుకుంటే మన్యం ఈ విషయంలో ముందంజలో ఉంది. కాగా మాతా శిశు మరణాలు జిల్లాలో ఆగడం లేదు. 2023-24లో ప్రసవ సమయంలో 15 మంది బాలింతలు, 206 మంది శిశువులు మృతిచెందారు. 2024-25లో 17 మంది బాలింతలు, 222 మంది శిశువులు, 2025-26లో 12 మంది బాలింతలు, 224 మంది శిశువులు మృతిచెందారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

జిల్లాలో 50 పీహెచ్‌సీలు ఉన్నాయి. 113 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మన్యంలో 37 పీహెచ్‌సీలకుగాను 83 మంది వైద్యులు పనిచేస్తున్నారు. పీహెచ్‌సీల పరిధిలో వైద్య పరీక్షలు, చికిత్స, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందులు అందించడం వీరి ప్రధాన విధి. ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరిపి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు అందించాలి. మాతా శిశుసంరక్షణ, కుటుంబ నియంత్రణ అన్నవి పీహెచ్‌సీల ప్రధాన విధులు. అంతకు మించి అత్యవసర సేవలు సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులు చూస్తాయి. అయితే పీహెచ్‌సీలు అనేవి ఉత్సవ విగ్రహాలుగా మిగులుతున్నాయి. కనీసం అక్కడ ప్రాథమిక వైద్యం చేయించుకునేందుకు సైతం ప్రజలు ఇష్టపడడం లేదు.

పేద కుటుంబాలపై భారం..

పేద కుటుంబాల్లో ప్రసవం అంటే రూ.50 వేల వరకూ ఖర్చు అవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలతో పాటు ఉచిత వైద్యసేవలు అందే వెసులబాటు ఉంది కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. వైద్యపరికరాలు లేవు. దీంతో ఎక్కువ మంది పీహెచ్‌సీలకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకూ జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల్లో సరాసరి నెలకు ఒక ప్రసవం జరిగింది. అక్కడకు ప్రసవాలకు వెళితే వివిధ కారణాలు చెబుతుండడంతో ఎక్కువ మంది సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌ల్లో ప్రసవిస్తున్న వారూ ఉన్నారు. చాలాచోట్ల మాతా శిశు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

ఆదేశాలిచ్చాం..

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి. మాతా శిశు మరణాల నియంత్రణ జరగాలి. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కేవలం హైరిస్క్‌ కేసులను మాత్రమే ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు రిఫర్‌ చేయాలని సూచించాం. ఈ ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా చూస్తాం.

- జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం

Updated Date - May 31 , 2026 | 12:08 AM