విజయం ఎవరిదో?
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:31 AM
రెండు దశాబ్దాల తరువాత రాజాం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. గురువారం 65 శాతం పోలింగ్ నమోదైంది.
- 30న రాజాం మునిసిపల్ ఓట్ల లెక్కింపు
-చైర్‌పర్సన్ బరిలో నలుగురు
- కౌన్సిలర్ పోటీలో 89 మంది
- ఇద్దరి మధ్యనే రసవత్తర పోటీ
రాజాంరూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల తరువాత రాజాం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. గురువారం 65 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్ధుల జాతకాలు బ్యాలెట్ బాక్సుల్లోకి చేరాయి. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్‌కు రెండు రోజులే సమయం ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఏ పెట్టెలో ఎవరి విజయం దాగుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో పాటు వార్డులవారీగా పోలింగ్‌కు హాజరైన ఓటర్ల మనోభావాల మేరకు తమ విజయావకాశాలపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏ బూత్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయోనని కూడికలు, తీసివేతలతో బిజీగా ఉన్నారు.
కూటమి.. వైసీపీ మధ్యే పోటీ
చైర్‌పర్సన్ అభ్యర్థులుగా కూటమి తరపున భేరి సౌజన్యలత, వైసీపీ నుంచి పాలవలస పద్మావతి బరిలో నిల్చొన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా చైర్‌పర్సన్ పోటీలో ఉన్నారు. అయితే, కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. స్వతంత్రులు నామమాత్రమే. అలాగే 32 వార్డుల్లో కూటమి, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులు 89 మంది బరిలో నిలిచారు. ఇక్కడ సైతం ఇండిపెండెంట్ల పోటీ నామమాత్రమే.
మహిళలే కీలకం..
రాజాం మునిసిపాలిటీలో పురుషులు కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 36,787 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 18,260 మంది, మహిళలు 18525 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఓటింగ్‌లో సైతం పురుషులు కన్నా మహిళలే ఎక్కువగా పాల్గొన్నారు. మొత్తం 24,088 ఓట్లు పోలవగా వారిలో 11,730 మంది పురుషులు, 12,356 మంది మహిళలు ఓటేశారు. చైర్‌పర్సన్ బరిలో ఇద్దరూ మహిళలే ఉండడం, 32 వార్డుల్లో 16 వార్డులు సైతం మహిళలకే కేటాయించడంతో మహిళామణులు ఎవరికి పట్టం కట్టారో రెండో రోజుల్లో తేలిపోనుంది.
ఎవరికి వారే లెక్కలు..
గెలుపోటములపై ఇరుపార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. తాము గెలుస్తామంటే తామే గెలుస్తామని అంటున్నారు. అన్ని వార్డుల్లోనూ తామే విజయబావుటా ఎగురవేస్తామని కూటమి నాయకత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమికి ఉన్న ఆదరణ, అనుకూలంగా వెలువడిన ఫలితాలే ఇందుకు తార్కాణమని వారు బలంగా చెబుతున్నారు. వైసీపీ నాయకులు సైతం తామే విజయం సాధిస్తామంటున్నారు. రాజాం మున్సిపాలిటీని దక్కించుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని తిరిగి ప్రారంభిస్తామని అంటున్నారు.
కౌంటింగ్‌కు సన్నాహాలు..
రాజాం-బొబ్బిలిరోడ్‌లోని వరలక్ష్మి సెయింటాన్స్ పాఠశాలలో కౌంటింగ్ నిర్వహించేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. కౌటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ అధికారికంగా మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఏజెంట్లగా నియమితులయ్యే వారికోసం దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. ఏజెంట్లు ఉండదలచిన వారంతా దరఖాస్తు తీసుకుని అభ్యర్థితో సంతకం చేయించి ఓ ఫొటోను అతికించి మున్సిపల్ కార్యాలయంలో అందించాలని అధికారులు సూచిస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే పాస్‌లు జారీచేస్తారు. కౌంటింగ్ హాల్లోకి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు.