ఈ పాపం ఎవరిది?
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:31 PM
పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు, పచ్చదనాన్ని కాపాడండి - అది మిమ్మల్ని కాపాడుతుంది వంటి ఎన్నో సూక్తులతో మొక్కలు పెంచి, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
- యథేచ్ఛగా చెట్లను నరికేస్తున్న అక్రమార్కులు
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
- ప్రభుత్వ ఆశయానికి తూట్లు
జియ్యమ్మవలస, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు, పచ్చదనాన్ని కాపాడండి - అది మిమ్మల్ని కాపాడుతుంది వంటి ఎన్నో సూక్తులతో మొక్కలు పెంచి, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కానీ ఆ పచ్చదనాన్ని కొందరు దారుణంగా హరించేలా చెట్లను నరికివేస్తుంటే పట్టించుకునే అధికారే కనిపించడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, కాల్చివేడయం షరా మామూలైపోయింది. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టారాజ్యంగా చెట్లను నాశనం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వృక్షాలను కూడా దారుణంగా కూల్చేస్తున్నారు. మొక్కలను నాటి పెంచడంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ చెట్లను నాశనం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
- మండలంలో పది రోజుల కిందట తాళ్లడుమ్మ పంచాయతీ పరిధిలో దాసరిపేట గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాగు చెట్లను మిషన్లతో కోసేశారు. దాదాపు 50 చెట్ల వరకు దారుణంగా ఇలా నరికేశారు.
- అల్లువాడ, తుంబలి, బీజేపురం, శిఖబడి, తదితర గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు కొందరు నిప్పు పెట్టి అగ్నికి ఆహుతి చేస్తున్నారు. మరికొందరు వారికి అవసరమైన చెట్లను నరికేసి ఇంటికి తరలించుకు పోతున్నారు. గతంలో పలుమార్లు వీటిపై కథనాలు పత్రికల్లో వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు.
- పెదబుడ్డిడి గ్రామం వద్ద గత మార్చి నెలలో జడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రహరీ నిర్మాణం పేరుతో పదుల సంఖ్యలో చెట్లను నరికివేసినా విద్యాశాఖ కనీసం చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి ఆ ప్రహరీ నిర్మాణానికి ఆ చెట్లు అడ్డుకాకపోయినా నరికేశారు. కేవలం విచారణతోనే విద్యాశాఖ చేతులు దులుపుకొంది. జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.