Share News

Whose credit is it? Whose theft is it? క్రెడిట్‌ ఎవరిది? చోరీ ఎవరిది?

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:47 PM

Whose credit is it? Whose theft is it? ఎర్రబస్సు రాని చోటకు ఎయిర్‌బస్సు ఎందుకు? భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇవ్వొద్దు. మేం అధికారంలోకి వస్తే వాటిని వెనక్కి ఇచ్చేస్తాం. విశాఖలో విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్ల దూరంలో మళ్లీ భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకో?’ 2019 ఎన్నికలకు ముందు జగన్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. ఇప్పుడేమో ఎయిర్‌పోర్టు నిర్మాణం ఘనతే తమదే అంటున్నారు.

Whose credit is it? Whose theft is it? క్రెడిట్‌ ఎవరిది? చోరీ ఎవరిది?

క్రెడిట్‌ ఎవరిది? చోరీ ఎవరిది?

కీలకమైన పనులన్నీ జరిగింది టీడీపీ హయాంలో

ప్రారంభించిందే చంద్రబాబు

వైసీపీ నేతలది వింత వాదన

అధినేత నుంచి జిల్లా నాయకుల వరకూ క్రెడిట్‌ చోరీ మాటలు

ఎయిర్‌పోర్టు అందుబాటులో రావడంతో నేడు వితండవాదం

విజయనగరం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

‘ఎర్రబస్సు రాని చోటకు ఎయిర్‌బస్సు ఎందుకు? భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇవ్వొద్దు. మేం అధికారంలోకి వస్తే వాటిని వెనక్కి ఇచ్చేస్తాం. విశాఖలో విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్ల దూరంలో మళ్లీ భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకో?’ 2019 ఎన్నికలకు ముందు జగన్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. ఇప్పుడేమో ఎయిర్‌పోర్టు నిర్మాణం ఘనతే తమదే అంటున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారంటూ రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ఒకేలా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తూ రాజకీయ లబ్ధి పొందింది వైసీపీ. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం విషయంలో క్రెడిట్‌ చోరీ చేస్తోందని కొత్తగా ఆరోపించడం ప్రారంభించింది. దీనికి టీడీపీ కూటమి గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. దీటుగా సమాధానం చెబుతోంది.

2014లో రాష్ట్ర విభజన జరిగాక విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఏపీకి కొత్త విమానాశ్రయాన్ని కేటాయించింది. విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్‌గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కావడంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిపాదన చేశారు. విశాఖలో విమానాశ్రయం ఉన్నప్పటికీ ఇండియన్‌ నావీ సర్వీసులు నడుస్తుంటాయి. దీంతో పౌర విమానయాన సంస్థలు సర్వీసులను అందించేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పటి సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోనే మరో విమానాశ్రయం ఉండాలని భావించారు. అది కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంటే భవిష్యత్‌లో పౌర విమానయాన సేవలతో పాటు డొమిస్టిక్‌ సేవలు అందుతాయని ఆలోచించి భోగాపురాన్ని ఎంపిక చేశారు. అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు చొరవతో అనుమతులన్నీ త్వరితగతిన పొందారు. 2019 ఫిబ్రవరిలో జీఎంఆర్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుని ప్రాథమిక పనులు ప్రారంభించింది.

అప్పట్లో వైసీపీ హెచ్చరికలు..

తాము అధికారంలోకి వస్తే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాను అని స్వయంగా జగన్‌ ఈ ప్రాంతంలో ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించారు. అప్పట్లో భూ సమీకరణ సవ్యంగా జరగకుండా కోర్టు కేసులను కూడా వైసీపీ నేతలే వేశారు. ఎన్నిరకాల అడ్డంకులు ఎదురైనా నాడు టీడీపీ ప్రభుత్వం 2,703 ఎకరాలను సమీకరించగలిగింది. అలాగే విమానాశ్రయానికి అనుసంధానంగా విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లు కూడా ఇక్కడే ఏర్పాటుచేయాలని నిర్ణయించి అదనంగా 500 ఎకరాలను సేకరించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అది అవసరం లేదని చెప్పించి డీపీఆర్‌ను మార్చేశారు. ఆ 500 ఎకరాలను వెనక్కి తీసుకున్నారు. దీంతో విమానాశ్రయ నిర్మాణానికి మిగిల్చింది 2,203 ఎకరాలే.

2024 ఎన్నికల ముందు శంకుస్థాపన

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రాష్ట్రంలో నిర్మాణాలన్నింటినీ రద్దు చేశారు. ఆ పద్దులో భోగాపురం విమానాశ్రయాన్ని కూడా చేర్చారు. కానీ 2024 ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందని భావించి 2023లో మరోసారి ఆదరాబాదరగా శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలో భోగాపురం విమానాశ్రయం గురించి ఢిల్లీ వెళ్లి సమీక్షించిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన సందర్భాలు లేవు. దీంతో నత్తనడకన పనులు జరిగాయి. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే భోగాపురం ఎయిర్‌పోర్టుకు పూర్వవైభవం వచ్చింది. అప్పుడు అశోక్‌గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రి ఉండగా.. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు అదే మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహించడంతో పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఈయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ పరుగులు తీయించారు. వైసీపీ హయాంలో పదుల సంఖ్యలో యంత్రాలతో పనులు చేయించగా.. టీడీపీ హయాంలో వందల యంత్రాలు, వేలాది ఇంజనీరింగ్‌ నిపుణులు, కార్మికులతో మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు జరిపిస్తున్నారు.

వైసీపీకి వెంటాడుతున్న భయం..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రమంతో జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. పార్టీకి మనుగడ ఉంటుందో లేదోనని కలవరపడుతూ అర్థం లేని విమర్శలకు దిగుతున్నారు. కళ్లెదుటే ఇంతటి భారీ ప్రాజెక్టు అందుబాటులోకి రావడాన్ని సహించలేకపోతున్నారు. పైగా జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్ట్‌ నుంచి రూ.1000 కోట్ల విలువైన భూమిని ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సిటీకి అందించారు. దీనిని కూడా వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. క్రెడిట్‌ చోరీ అంటూ కొత్త నాటకాలకు తెరతీశారు. వారి మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

---------------------------

Updated Date - Jan 06 , 2026 | 11:47 PM