child ఏ తల్లి కన్నబిడ్డో?
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:04 AM
Whose child is this? ఏ తల్లికన్నబిడ్డో.. వారికి మనసెలా వచ్చిందో.. సీతంపేట ఏజెన్సీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగ శిశువును వదిలి వెళ్లడం కలకలం
పసికందును చేరదీసిన దారపాడు గ్రామస్థులు
రిమ్స్‌లో చికిత్స
సీతంపేట, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏ తల్లికన్నబిడ్డో.. వారికి మనసెలా వచ్చిందో.. సీతంపేట ఏజెన్సీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగ శిశువును వదిలి వెళ్లడం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన శిశువుపై ఇటుక బెడ్డలను పేర్చడం స్థానికులకు కంటతడి పెట్టించింది. అయితే ఈ ఘటన మన్యంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై గిరిజన గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం..
దారపాడు గ్రామంలో ఈనెల 18న యువకులు సాయంత్రం వేళ వాలీబాల్ ఆటలో నిమగ్న మయ్యారు. ఆ సమయంలో ఇటుక బట్టీ వైపు బంతి వెళ్లడంతో దానిని తీసుకొచ్చెందుకు వెళ్లగా.. పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఏంటని అటువైపుగా వెళ్లి చూసేసరికి.. మగ శిశువు కనిపించింది. దీంతో యువకులు చిన్నారి శరీరంపై ఉన్న ఇటుకలను తొలగించి బయటకు తీశారు. అయితే అప్పటికే చీమలు, దోమలు కుట్టీ శరీరం అంతా గాయాలవడంతో శిశువుకు దారపాడు గ్రామ మహిళలు సపర్యలు చేశారు. వెంటనే దోనుబాయి పీహెచ్‌సీకి తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ కూడా సమాచారం అందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం శిశువును సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ కూడ చిన్నారిని పరిక్షీంచిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఐసీయూలో చిన్నారికి వైద్యసేవలు అందిస్తున్నారు. చిన్నారి యోగక్షేమాలను దారపాడుకి చెందిన వారు చూస్తున్నారు. కాగా అప్పుడే పుట్టిన శిశువును గ్రామ సమీపంలో ఎవరు విడిచి వెళ్లుంటారు? అసలేం జరిగిందనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
దారపాడు గ్రామంలో ఈనెల 17న వినాయక నిమజ్జనోత్సవాన్ని గ్రామస్థులు నిర్వహించారు. ఆరోజు రాత్రి ఒంటి గంట వరకు యువకులు,గ్రామస్థుల డాన్స్‌లతో సందడి చేశారు. అయితే అర్ధరాత్రి 2గంటలు దాటిన తరువాత గ్రామ సమీపంలోకి తెలుపురంగు కారు వచ్చిందని, కొంత సేపటివరకు అది అక్కడే ఉందని దారపాడు గ్రామస్థులు తెలిపారు. ఆ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులే ఈ పసికందును తమ గ్రామ సమీపంలో ఉన్న ఇటుకబట్టీపై వదిలి వెళ్లి ఉంటారని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై దోనుబాయి ఏఎస్‌ఐ త్రినాథరావును వివరణ కోరగా.. ‘గుర్తు తెలియని మగ శిశువును దారపాడు గ్రామంలో ఎవరో విడిచి వెళ్లినట్లు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. దీనిపై జిల్లా శిశు సంరక్షణ(చైల్డ్ ప్రొటక్షన్)అధికారి, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించాం.’ అని తెలిపారు.