Whose argument is theirs...! ఎవరి వాదన వారిదే...!
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:19 AM
Whose argument is theirs...! జిందాల్ భూముల వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో విబేధాలు సృష్టిస్తోంది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న భూ నిర్వాసితులకు మద్దతుగా ఓ వర్గం, యువతకు ఉపాధి పేరుతో యాజమాన్యానికి అండగా మరో వర్గం మాట్లాడుతోంది.
ఎవరి వాదన వారిదే...!
టీడీపీలో విభేదాలు సృష్టిస్తున్న జిందాల్ భూముల వ్యవహారం
భూ నిర్వాసితులకు మద్దతుగా ఓ వర్గం
ఉపాధి పేరుతో యాజమాన్యానికి అండగా మరో వర్గం
ఆరునెలలుగా బలప్రదర్శనలు
స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని నేతల్లో ఆవేదన
జిందాల్ భూముల వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో విబేధాలు సృష్టిస్తోంది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న భూ నిర్వాసితులకు మద్దతుగా ఓ వర్గం, యువతకు ఉపాధి పేరుతో యాజమాన్యానికి అండగా మరో వర్గం మాట్లాడుతోంది. భూ నిర్వాసితులకు అనుకూలంగా మాట్లాడుతున్న వారిపై పోలీస్‌లు బైండవర్ కేసులు పెడుతున్నారని, యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడుతున్న వారిపై ఎందుకు బైండవర్ కేసులు పెట్టడం లేదని తహసీల్దార్ డి.శ్రీనివాసరావును బుధవారం కొందరు ప్రశ్నించారు. ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపనేమోకానీ ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు రాబోవు స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.
శృంగవరపుకోట, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎస్.కోట మండలంలోని మూలబొడ్డవర, చీడిపాలెం, చినఖండేపల్లి, కిల్తంపాలెం గ్రామాల పరిధిలో జిందాల్ ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూ సేకరణ చేపట్టింది. 382 మంది రైతుల నుంచి 834.66 ఎకరాల అసైన్డ్, 151.04 ఎకరాల ప్రభుత్వ, 180.73 ఎకరాల జిరాయితీ భూములు కలిపి 1166.43 ఎకరాలను జిందాల్ యాజమాన్యానికి అప్పగించింది. అయితే భూములను తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను యాజమాన్యం నెరవేర్చకపోవడంతో భూ నిర్వాసితులు పలుమార్లు ఆ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించారు. అప్పటికప్పుడు ఏదో ఒక మాట ఇస్తూ యాజమాన్యం వారి కోపాన్ని తాత్కాలికంగా తగ్గించేది. అయితే ఇంతవరకు ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమను స్థాపించలేదు. ఇటు పరిశ్రమ రాక, అటు వ్యవసాయం లేక ఆ భూములన్నీ బీడువారాయి.
- కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే జిందాల్ యాజమాన్యం ప్రతిపాదిత పరిశ్రమ కాకుండా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న భావనతో కూటమి ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భూ నిర్వాసితులు గత ఏడాది జూన్ నుంచి ఆందోళన బాట పట్టారు. ఇంతవరకు పరిశ్రమలను స్థాపించకపోవడంతో పాటు ఇచ్చిన మాటను నిలుబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మద్దతు ఇస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఈయన ఆ పార్టీతో ఉన్న విభేదాలతో సఖ్యతగా ఉండడం లేదు.
- గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి, రఘురాజు క్యాడర్‌తో కలిసి టీడీపీలో చేరారు. ఈ క్యాడర్ అంతా భూనిర్వాసితుల పక్కన నిలబడ్డారు. పరిశ్రమలకు అనుకూలకంగా ఉన్న కొంతమంది భూ నిర్వాసితులు, టీడీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువత పరిశ్రమలను స్థాపించాంటూ పట్టుబడుతున్నారు. కూటమి తరుపున బీజేపీ నాయకులు సీహెచ్‌ఆర్‌కే ప్రసాద్, కొట్యాడ లోకాభిరామకోటి గొంతు కలుపుతున్నారు. కూటమిలోని జనసేన నేతలు భూనిర్వాసితుల తరుపున నిలబడుతున్నారు.
- టీడీపీ శ్రేణులు చెరో వైపు నిలబడడంతో నాయకులకు ఇబ్బందిగా మారింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్న వారికి కలవరం పట్టుకుంది. ఓట్లు చీలితే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు.