Share News

Who's wrong? తప్పెవరిది?

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:16 AM

Who's wrong? ఉన్నఫలంగా దిగొస్తారు.. సన్నిహితులుగా కలిసిపోతారు. ఆత్మీయులుగా నాటకమాడతారు. ఆపై మనుషుల ప్రాణాలకు విలువ కడతారు. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చేరిన రోగి ప్రాణాలు కోల్పోతే తీవ్ర దుఃఖంలో ఉండే బంధువులను కలిసేందుకు ఆత్మీయులుగా కొందరు వ్యక్తులు అవతారమెత్తి ఓదార్చుతున్నారు. అయ్యిందేదో అయ్యింది..

 Who's wrong? తప్పెవరిది?
ఆసుపత్రిలో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యానర్‌

తప్పెవరిది?

ప్రాణాలకు విలువ కడుతున్నారు

పదో తరగతి బాలికకు రూ.5 లక్షలు..

బాలింత విలువ రూ.12 లక్షలు..

ఆపరేషన్‌ వికటించిన వ్యక్తికి రూ.10 లక్షలు..

ఉన్నఫలంగా దిగొస్తారు.. సన్నిహితులుగా కలిసిపోతారు. ఆత్మీయులుగా నాటకమాడతారు. ఆపై మనుషుల ప్రాణాలకు విలువ కడతారు. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చేరిన రోగి ప్రాణాలు కోల్పోతే తీవ్ర దుఃఖంలో ఉండే బంధువులను కలిసేందుకు ఆత్మీయులుగా కొందరు వ్యక్తులు అవతారమెత్తి ఓదార్చుతున్నారు. అయ్యిందేదో అయ్యింది.. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా..? అంటూ కొత్తరాగం ఆలపిస్తున్నారు. ప్రాణానికి ధర నిర్ణయించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఘోర సంస్కృతి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తప్పెవరిదన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు.

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి):

ఆస్పత్రుల్లో రోగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతే.. అందుకు నిజంగా వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమైతే.. ఆసుపత్రి యాజమాన్యం ఇస్తున్న తాయిళాలను రోగి కుటుంబ సభ్యులు ఎందుకు తీసుకుంటున్నారు? అలా కాకుండా చికిత్స సమయంలో రోగి శరీరం సహకరించక, వ్యాధి ముదిరి, శరీరంలో మార్పులు చోటుచేసుకుని ప్రాణాలు పోతే కనీసం మానవత్వం లేకుండా ఆసుపత్రుల్లో ఆందోళన చేయడం తగునా..? వైద్యులపై దాడులకు పాల్పడడం, హాస్పిటల్‌ వాతావరణాన్ని కలుషితం చేయడం సరైనదేనా? అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

కొన్ని ఉదాహరణలివిగో...

- రేగిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ఆమె కుటుంబసభ్యులు రాజాంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యురాలు ఆమెకు సర్జరీ చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన 24 గంటల తరువాత ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆ గ్రామానికి చెందిన ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద రాత్రి 11 గంటల వరకూ ఆందోళన చేశారు. ఇదే అదనుగా కొంతమంది రంగంలోకి దిగారు. బేరం ప్రారంభమైంది. కొద్ది గంటల్లో రూ.12 లక్షలకు డీల్‌ కుదిరింది. అంతే.. క్షణాల్లో మృతదేహాన్ని తీసుకుని ఇంటిబాట పట్టారు.

- రాజాం పట్టణంలోని మరో ఆసుపత్రిలో ఓ వ్యక్తి కిడ్నీ చికిత్స కోసం చేరారు. వైద్యపరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. శస్త్ర చికిత్స అనంతరం రోగి పరిస్థితి విషమం కావడంతో శ్రీకాకుళం రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డాడు. శస్త్రచికిత్స వికటించి మరణించారంటూ రాజాంలోని ఆ ఆసుపత్రి ఎదుట మృతిచెందిన వ్యక్తికి సంబంధించిన వారంతా ఆంధోళనకు దిగారు. ఇక్కడా అదేసీన్‌ రూ.10 లక్షలకు బేరం కుదిరింది. ఈ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యంతో పాటు శస్త్రచికిత్స చేసిన వైడ్యుడిపై భారం పడింది.

- తాజాగా ఈనెల 8న గురవాం గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటనలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే తమ కుమార్తె ప్రాణం పోయేందుకు వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆంధోళనకు దిగారు. రూ.5 లక్షల సెటిల్మెంట్‌తో ఇంటిబాట పట్టారు.. ఇలాంటి ఘటనలు రాజాం ప్రాంతంలో కొన్నేళ్లుగా జరుగుతూ ఉన్నాయి. ప్రాణం కోల్పోయి కుటంబసభ్యులు మానసికంగా కుంగిపోతుంటే.. భారీగా పరిహారం చెల్లిస్తూ వైద్యులు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఇలా అయితే ఎలా?

భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగిస్తే.. ప్రాణాపాయంతో ఆసుపత్రులో చేరేందుకు వచ్చే రోగులకు పట్టణంలోని ఆసుపత్రుల్లో ఎంట్రీ ఉంటుందా..? రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందించేందుకు ముందుకొస్తారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అదే పరిస్థితి రోగులకు ఎదురైతే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా..? అనారోగ్యంతో తమవద్దకు వచ్చే రోగుల్ని రక్తపరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, మెడిసిన్‌ పేరుతో రోగులపై కొంతమంది వైద్యులు అదనపు భారం మోపుతారా? అనేవి కూడా చర్చనీయాంశమే.

Updated Date - Feb 13 , 2026 | 12:16 AM