Whoa… The Ghat! వామ్మో.. ఘాట్!
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:52 PM
Whoa… The Ghat! సాలూరుకు సమీపంలో ఉన్న ఏవోబీ ఘాట్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలు ఘాట్‌రోడ్లలో నిలిచిపోవడం, ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొన్ని వాహనాలు బోల్తా పడడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో ఏవోబీ ఘాట్‌రోడ్డులో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
ఏవోబీ ఘాట్ రోడ్డులో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం
మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బందులు
కొవరడిన పర్యవేక్షణ
సాలూరు రూరల్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): సాలూరుకు సమీపంలో ఉన్న ఏవోబీ ఘాట్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలు ఘాట్‌రోడ్లలో నిలిచిపోవడం, ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొన్ని వాహనాలు బోల్తా పడడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీంతో ఏవోబీ ఘాట్‌రోడ్డులో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు నిలిచిపో తున్నాయి. ఈ ఘాట్ రూట్‌లో ఎప్పటికప్పుడు ఇలాగే ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారింది. గ్యాస్, పెట్రోలియం ట్యాంకర్లు, వివిధ లారీలు బోల్తా పడిన సంఘటనలు కోకోల్లలు. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. మొత్తంగా ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లే వారు.. ఆంధ్రా ఘాట్ నుంచి ఒడిశాలో పొట్టంగి ఘాట్ వరకు సాఫీగా ప్రయాణం సాగేలా చూడు భగవంతుడా? అని వేడుకునే పరిస్థితి ఏర్పడింది. లోయల్లోకి వాహనాలు దూసుకెళ్తే.. భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉన్నందున.. ఘాట్ రోడ్డు ఎక్కి దిగినంత వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మూడు రాష్ర్టాల ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది.
సాలూరుకు అతి సమీపంలోని పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్ట్ నుంచి ఏవోబీ ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ వరకూ అంటే సుమారు 8 కిలోమీటర్ల వరకూ ఇది కొనసాగుతుంది. అక్కడి నుంచి ఒడిశా ఘాట్ ఆరంభమవుతుంది. మొత్తంగా సుమారు 16 కిలోమీటర్ల ఈ ఘాట్ రోడ్డు మీదుగా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణి స్తుంటాయి. భారీగా సరుకు రవాణా జరుగుతుంది. విశాఖ నుంచి సాలూరు మీదుగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వరకూ ఏపీతో పాటు ఆయా రాష్ర్టాలకు చెందిన బస్సులు, లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత కీలకమైన ఈ ఘాట్‌రోడ్డులో కొద్దిమంది వాహన దారుల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఓవర్‌లోడ్‌తో వాహనాలు ప్రయాణిస్తున్నా.. సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాదాలు ఇలా..
- గతేడాది నవంబరు 6న ఉదయం 5 గంటలకు ఏపీ ఘాట్‌రోడ్డులో విజయనగరం నుంచి ఒడిశా రాష్ట్రం జైపూర్ వైపు వెళ్తున్న బస్సు ఆహుతైంది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు సురక్షితమైనా.. మూడు గంటల పాటు ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.
- ఒడిశా ఘాట్‌రోడ్డులో గతేడాది సెప్టెంబరులో ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో దాదాపు ఒక రోజు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది.
- విశాఖ వైపు బియ్యం లోడ్‌తో వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ ఈ నెల 6న రాత్రి 11 గంటలకు ఏవోబీలో కంకణాపల్లి ఘాట్ వద్ద బోల్తా పడింది. దీంతో మరుసటి రోజు మంగళ వారం వరకు ఘాట్‌రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు దాదాపు ఎనిమిది గంటలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో రాకపోకలు పునరుద్ధరణ జరిగింది.
- గతేడాది ఏపీ ఘాట్ రోడ్డులో 17 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో ఏడుగురు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. ఈ ఘటనల్లో సుమారు పది సార్లు ఘాట్‌రోడ్డులో కనీసం రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఒడిశా ఘాట్‌లో 7 ప్రమాదాలు జరిగాయి. నాలుగు ప్రమాదాల్లో ట్రాఫిక్ నిలిచింది. ఇలాంటి సమయాల్లో ప్రయా ణికులు అటవీ ప్రాంతంలోనే జాగరణ చేయాల్సి వస్తోంది. మొత్తంగా గత మూడేళ్లలో 30 ప్రమాదాలు జరిగాయి. అందులో గాయపడిన వారు 37 మంది ఉన్నారు. 15 మంది చనిపోయారు.
అదుపుతప్పి.. లోయలో పడి!
సాలూరు రూరల్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం భవానీపట్నం నుంచి 29 మంది ప్రయాణికులతో విశాఖ వైపు వస్తున్న ఒడిశా ఆర్టీసీ వోల్వో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. శనివారం వేకువ జామున రెండున్నర గంటలకు.. ఏపీ బోర్డర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 24 మంది గాయపడ్డారు. కలహాండి జిల్లా కలామ్‌పూర్ బ్లాక్, బల గావ్‌కు చెందిన జంబాబ్ బిహారి(46) పొట్టంగి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో 24 మంది గాయపడ్డారు.
ఒడిశా రాష్ట్రం సుంకి దాటి పనసమానుగుడ్డి మలుపు తిరుగుతున్న సమయంలో ఓ లారీ ఆకస్మికంగా మీదకు వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సు 50 అడుగుల లోయలోకి పడిపోయింది. నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికులకు అసలేం జరిగిందో తెలియలేదు. వారు తేరుకుని చూసేసరికి గాయాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఆర్తనాదాలతో చిమ్మచీకట్లో వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు గాయాలతో డ్రైవర్ అప్రమత్తమై ఒడిశా పోలీసులకు సమాచారమందిం చాడు. దీంతో పొట్టంగి, సిమిలిగుడ, జైపూర్ నుంచి ఒడిశా విపత్తు నివారణ, ఫైర్‌పైటింగ్ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. బస్సు లోయపడిపోవడంతో సహాయక చర్యలు చేయడం కష్టంగా మారింది. ఈ బృందాలు ఆధునిక పరికరాలు, రోప్, స్ట్రక్చర్స్ తదితర వాటితో చిమ్మ చీకటిలో సహాయక చర్యలు చేపట్టాయి. బస్సు అద్దాలను పగులు గొట్టి క్షతగాత్రులను బయటకు తీశాయి. గాయపడిన వారిని తొలుత పొట్టంగి పీహెచ్‌సీకి తరలించాయి. ఈ ఘటన లో విశాఖకు చెందిన టి.జానకిరామరాజు, ఒడిశాకు చెందిన ఎన్‌ఎల్‌రావు, వై.దేవి, ఎస్.కరిక, కరుణమణి, రాజమణి, శ్రీధర్‌రావు, నందలాల్ కశ్యప్, అభిమాన్యు నాయక్, బి.నాగమణి తదితర 24 మంది గాయపడ్డారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిలో నలుగురిని మెరుగైన చికిత్స కోసం కోరాపుట్ జిల్లా కేంద్రాసుపత్రికి, ఇరువురిని విశాఖపట్నం తరలించారు. ఈ సంఘటనపై సుంకి ఐఐసీ చతుర్భుజ్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.