Share News

Whoa... Strong Winds! వామ్మో.. గాలులు

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:25 AM

Whoa... Strong Winds! జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉండగా.. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమైంది. అయితే గాలుల తీవ్రత, ఉరుములు మెరుపులు, పిడుగుల శబ్దాలకు జనం భయాందోళన చెందారు.

Whoa... Strong Winds! వామ్మో.. గాలులు
రావివలస ప్రాంతంలో విద్యుత్‌ తీగలపై కూలిన చెట్లు

  • నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు.. కూలిన చెట్లు

  • అంధకారంలో గ్రామాలు

  • పిడుగుపాటుకు ఏడుగురు మహిళలకు అస్వస్థత

  • మక్కువలో దూడ మృతి

పార్వతీపురం/గరుగుబిల్లి/సీతంపేట రూరల్‌/మక్కువ రూరల్‌/సాలూరు, జూన్‌14 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉండగా.. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమైంది. అయితే గాలుల తీవ్రత, ఉరుములు మెరుపులు, పిడుగుల శబ్దాలకు జనం భయాందోళన చెందారు. గరుగుబిల్లి మండలం రావివలస, లఖనాపురం, చినగుడబతో పాటు పలు గ్రామాల్లో 30కి పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రహదారికి ఆనుకుని ఉన్న చెట్లు సైతం విద్యుత్‌ వైర్లపై కూలాయి. మరోవైపు పంట పొలాల్లో ఉన్న స్తంభాలు కూడా ఓ వైపు వాలాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సీతంపేట, మక్కువ తదితర మండలాల్లోనూ సుమారు గంటపాటు వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సాలూరు, వీరఘట్టం, పాలకొండలో ఓ మోస్తరుగానే వర్షం కురిసింది. మొత్తంగా వాతావరణం చల్లబడడంతో ఎండవేడి నుంచి జిల్లావాసులు కాస్త ఉపశమనం చెందారు. పొలం పనులకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని మరోవైపు ఖరీఫ్‌ రైతులు చెబుతున్నారు.

ఉపాధి పనులకు వెళ్తుండగా..

పాలకొండ/వీరఘట్టం: వీరఘట్టం మండలం అడారు పంచాయతీ పరిధి చేబియ్యంవలసకి చెందిన ఏడుగురు మహిళలు ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురయ్యారు. గ్రామ సమీపంలో చెరువులో ఉపాధి పనులు చేసేందుకు వెళ్తుండగా.. వీరికి సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆ మహిళలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బాధితులు జ్యోతి, సంగమ్మ, యశోదమ్మ, గంగమ్మ, లక్ష్మి, గౌరమ్మ, సిమ్మమ్మను స్థానికులు హుటాహుటిన బీటీవాడ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే మెరుగైన చికిత్స కోసం వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

- మక్కువ మండలం తూరుమామిడిలో కర్రి గౌరునాయుడుకు చెందిన దూడ పిడుగుపాటుకు గురై మృతిచెందింది. పశువుల శాల పక్కనే ఆవు దూడ ఉండగా.. ఒక్కసారిగా ఆప్రాంతంలో పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే దూడ మృతిచెందినట్లు రైతు వాపోయాడు. కాగా ఆ శాల పక్కనే గల ఇల్లు కూడా పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతిందని గ్రామస్తులు తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 12:25 AM