Share News

Zilla Parishad Chairperson Post? జడ్పీ పీఠం ఎవరిది?

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:02 AM

Who Will Win the Zilla Parishad Chairperson Post? పరిషత్‌ పోరు ప్రశాంతంగా ముగిసింది. 15 జడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సత్తాచాటారు. అయితే జిల్లా పరిషత్‌ పీఠం ఎవరిది అన్నది? ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన మన్యంలో కొత్తగా ఏర్పడిన జడ్పీ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం ఆశావహుల్లో సందడి నెలకొంది.

  Zilla Parishad Chairperson Post? జడ్పీ పీఠం ఎవరిది?

  • కురుపాం జడ్పీటీసీ వీరేష్‌చంద్రదేవ్‌ పేరు ఖరారైనట్లు ప్రచారం

పార్వతీపురం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరు ప్రశాంతంగా ముగిసింది. 15 జడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు సత్తాచాటారు. అయితే జిల్లా పరిషత్‌ పీఠం ఎవరిది అన్నది? ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన మన్యంలో కొత్తగా ఏర్పడిన జడ్పీ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గం ఆశావహుల్లో సందడి నెలకొంది. అధిష్ఠానం ఆశీస్సులు పొంది.. మన్యం జిల్లా తొలి జడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని పలువురు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ తరపున బరిలో నిలిచి కురుపాం జడ్పీటీసీగా గెలుపొందిన వీరేష్‌చంద్రదేవ్‌ వైపు అధిష్ఠానం మొగ్గుచూపిస్తున్నట్టు సమాచారం. గతంలో కురుపాం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే పార్టీ టికెట్‌ ఖరారు చేయలేదు. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో టీడీపీ విజయానికి తనవంతు కృషి చేశారు. దీంతో జడ్పీ చైర్మన్‌గా ఆయన పేరును ఖరారు చేస్తూ.. పార్టీ అధిష్ఠానం రేపో మాపో ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- వైరిచర్ల కుటుంబాల నుంచి వారసుడిగా వచ్చిన వీరేష్‌చంద్రదేవ్‌.. పెదనాన్న కిషోర్‌చంద్రదేవ్‌ గతంలో యూపీఏ ప్రభుత్వ కాలంలో కేంద్రమంత్రిగా విధులు నిర్వహించారు. ఆయన తండ్రి ప్రదీప్‌చంద్రదేవ్‌ ఎంపీగా పనిచేశారు.

- జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. కూటమి అభ్యర్థులు పది చోట్ల విజయం సాధించారు. కురుపాం, జియ్యమ్మవలస, పాచిపెంట, పాలకొండ, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బలిజిపేట, భామిని, వీరఘట్టంలో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. సాలూరు మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి 60 ఓట్లు తేడాతో ఓడిపోయారు. పార్వతీపురంలో బీజేపీ అభ్యర్థి 301 ఓట్లు , మక్కువలో 695 ఓట్లు తేడాతో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఆ మూడు చోట్లతో పాటు గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలో స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.

Updated Date - Nov 10 , 2026 | 12:02 AM