Who will take the ZP chair?జడ్పీ పీఠం ఎవరికో?
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:45 PM
Who will take the ZP chair? జిల్లా పరిషత్ టీడీపీ వశమైంది. 22 స్థానాల్లో గెలవడంతో టీడీపీ కూటమికే జిల్లా పరిషత్ పీఠం దక్కనుంది. అయితే ఈ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య కూడా అధికంగా ఉంది.
జడ్పీ పీఠం ఎవరికో?
కుమార్తెకు ఇవ్వాలంటున్న బంగార్రాజు
చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర ప్రయత్నాలు
ఇదే దారిలో ఇంకొందరు
మేథోమథనంలో హైకమాండ్
విజయనగరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ టీడీపీ వశమైంది. 22 స్థానాల్లో గెలవడంతో టీడీపీ కూటమికే జిల్లా పరిషత్ పీఠం దక్కనుంది. అయితే ఈ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య కూడా అధికంగా ఉంది. చిన్నశ్రీను కుమార్తె సిరిసహస్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో భోగాపురం నుంచి నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె డాక్టర్ చంద్రకళ సైతం ప్రధాన ఆశావహురాలిగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఖాయమని తెలుస్తోంది.
చిన్న శ్రీను వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. బొత్స సత్యనారాయణకు సమీప బంధువుగా ఉన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట టీడీపీలో చేరారు. ఆయన జడ్పీ చైర్మన్‌గా ఉంటూ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. కుమార్తె సిరి సహస్రను జడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఆ బలమైన హామీతోనే ఆయన టీడీపీలో చేరారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపించింది. అయితే చివరి నిమిషం వరకూ జడ్పీటీసీకి సిరి సహస్ర నామినేషన్ వేసే విషయంలో గోప్యత పాటించారు. అడ్డంకులన్నీ తొలగిపోయేలా చిన్నశ్రీను ప్రయత్నించారని ఆయన అనుచరుల సమాచారం.
మరోవైపు భోగాపురం జడ్పీటీసీగా గెలిచిన డాక్టర్ కర్రోతు చంద్రకళ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె విద్యాధికురాలు. డాక్టర్ కావడంతో పాటు పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. అన్నింటికీ మించి తండ్రి బంగార్రాజు పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకోవచ్చునని పరిశీలకుల అంచనా.
ప్రస్తుతం ఆయన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆపై మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు సిద్ధపడ్డారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. అయినా ఎక్కడా పార్టీకి తలొంపు తెచ్చే కార్యక్రమాలు చేపట్టలేదు.. చంద్రబాబు, లోకేశ్ సూచనలతో నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి పొందినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ తరహా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి తన కుమార్తెకు ఇవ్వాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.
- వీరితో పాటు మరికొంతమంది ఆశావాహులు ఉన్నట్లు సమాచారం. అయితే వారెవరూ అభిప్రాయం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. తెరవెనుక ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రిని కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
-----------------