Who will rule... will be decided todayఏలేది ఎవరో... తేలేది నేడే
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:36 PM
Who will rule... will be decided today
ఏలేది ఎవరో... తేలేది నేడే
పరిషత్ అభ్యర్థుల ఉత్కంఠతకు కొద్ది గంటల్లో తెర
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఏడు కేంద్రాల్లో కౌంటింగ్
జిల్లా అంతటా నిశ్శబ్ద వాతావరణం
విజయనగరం కంటోన్మెంట్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. ఇంకాసేపట్లో బ్యాలెట్ బాక్సులు తెరుచుకోనున్నాయి. అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. విజేతలెవరో.. పరాజితులెవరో తేటతెల్లం కానుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు నియోజకవర్గాల కేంద్రాల్లో లెక్కంపు చేపడుతున్నారు.
జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు, 438ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 5న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జడ్పీటీసీ స్థానాలకు 103 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఎంపీటీసీ స్థానాల్లో 11స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 438 స్థానాలకు 1,066మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 1586 పోలింగ్ కేంద్రాల్లో 3,609 బ్యాలెట్ బాక్సులతో 54మంది ఆర్వోలు, 1,745ఏఆర్వోలు, 8,722మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విఽఽధులు నిర్వహించారు. వీరికి అనుబంధంగా 93మంది జోనల్ అధికారులు, 211మంది మైక్రో అబ్జర్వర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల విధుల కోసం 434 వాహనాలను ఏర్పాటు చేసింది. ఈనెల 5న జరిగిన పోలింగ్‌లో 9,79,386మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 4,76,498మంది పురుషులు, 5,02,883మంది మహిళలు, ఐదుగురు ఇతరులు ఉన్నారు. జిల్లా మొత్తం మీద 76.18శాతం ఓటింగ్ నమోదైంది. సగటున పురుషుల కంటే మహిళలే అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కాసేపట్లో లెక్కింపు
ఈనెల 5న జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించనున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్దేశించిన ప్రదేశాలలో బ్యాలెట్ బాక్సులను అత్యంత కట్టుదిట్టమైన నిఘా నడుమ పోలీస్ బందోబస్తుతో భద్రపరిచారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. దీంతో జిల్లా అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగరపంచాయతీల ఎన్నికల ఫలితాలు మాదిరిగా వస్తాయా? లేదా అందుకు భిన్నంగా వస్తాయా? లేదా మిశ్రమ ఫలితాలు వస్తాయా? అన్న సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఏదేమైనా ఫలితాల కోసం మరికొద్ది గంటల వరకు వీక్షిస్తే చాలు.
-----------------------