ZP Chairperson’s Post? జడ్పీ పీఠం ఎవరికో?
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:09 AM
Who Will Get the ZP Chairperson’s Post? జిల్లాలో మరికొద్దిరోజుల్లో నూతనంగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో జడ్పీ కొనసాగగా.. పాలకవర్గం పదవీకాలం గడువు ఈ నెల 24తో ముగియనుంది. 25 నుంచి మన్యం జిల్లాలో నూతనంగా జడ్పీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే జడ్పీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందనే దానిపై ప్రచారం జోరుగా సాగుతోంది.
ఓటర్ల వర్గీకరణ పనిలో అధికారులు
గరుగుబిల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరికొద్దిరోజుల్లో నూతనంగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో జడ్పీ కొనసాగగా.. పాలకవర్గం పదవీకాలం గడువు ఈ నెల 24తో ముగియనుంది. 25 నుంచి మన్యం జిల్లాలో నూతనంగా జడ్పీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే జడ్పీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందనే దానిపై ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే అధికారులు మండలాల్లో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వర్గీకరణ పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల జాబితాలను ఆయా మండల కేంద్రాల్లో ప్రచురిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- పంచాయతీరాజ్ చట్టం 1994, 2006 రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఏడాది ఆగస్టు 2026న ప్రభుత్వం జీవో నెంబరు 105ను పునరుద్ధరించింది. ఈ మేరకు 34 శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన అధికారులు ఓటర్ల వర్గీకరణ పనిలోపడ్డారు.
- ప్రస్తుతం జిల్లాలో కురుపాం ఎస్టీ, సాలూరు ఎస్టీ, పాలకొండ ఎస్టీ, పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. 451 పంచాయతీల్లో పురుషులు 3,14,887 మంది, 3,23,273 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 6,48,226 మంది ఓటర్లు ఉన్నారు. అయితే నూతనంగా ప్రకటించిన జీవో మేరకు గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, కురుపాం, సాలూరు , మక్కువ , కొమరాడ మండలాల్లో అధికంగా గిరిజనులే ఉన్నారు. దీంతో జడ్పీటీసీ స్థానం గిరిజన మహిళకు కేటా యించే అవకాశం ఉంది. మొత్తంగా ఏడు మండలాల పరిధిలో 5వ షెడ్యూల్డ్‌కు సంబంధించి పీసా ప్రాంతంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో గిరిజన మహిళ (జనరల్)కే జడ్పీటీసీ స్థానం దక్కనుంది.
- పార్వతీపురం మండలం మైదాన ప్రాంతంలో అధికంగా ఎస్సీలు ఉండడంతో ఈ స్థానం ఎస్సీ మహిళ (జనరల్)కు దక్కనుంది. సీతానగరం, మండలంలో బీసీ, ఎస్సీలు సమానంగా ఉన్నారు. దీంతో ఎస్సీలకు లేకుంటే బీసీ వర్గానికి జడ్పీటీసీ స్థానం కేటాయించే అవకాశం ఉంది.
- పాలకొండ, వీరఘట్టం మండలాల్లో బీసీ, భామిని, బలిజిపేట, గరుగుబిల్లిలో బీసీ ఓపెన్ కేటగిరి (ఓసీ) మహిళకు కేటాయించే అవకాశం ఉంది. జియ్యమ్మవలసలో బీసీ / ఓసీ మిశ్రమ మైదాన ప్రాంతం కావడంతో ఓపెన్ కేటగిరీలో ఓసీ మహిళకే కేటాయించే అవకాశం ఉంది. మొత్తంగా 15 జిల్లా ప్రాదేశికాల్లో 7 గిరిజనులు, రెండు షెడ్యూల్డ్ కులాలు, మూడు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు, మరో మూడు ప్రాదేశికాలు ఓపెన్ కేటగిరిలో మహిళలకు కేటాయించనున్నారు. ప్రధానంగా గిరిజన జనాభా గరిష్టంగా ఉండడంతో పాటు పీసా నిబంధన మేరకు రిజర్వేషన్ అమలు చేయనున్నారు. 15 జిల్లా ప్రాదేశికాలకు గాను 7 స్థానాలు పూర్తిగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి షెడ్యూల్డ్ తెగలు లేదా మహిళా వర్గానికే దక్కే అవకాశం ఉంది. 50 శాతం సమాంతర రిజర్వేషన్ మిశ్రమ భాగస్వామ్యంతో ఎన్నికయ్యే 15 మంది జిల్లా ప్రాదేశిక సభ్యుల్లో 8 స్థానాలు మహిళలకే కేటాయించే అవకాశం లేకపోలేదు.
- దీనిపై జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎస్.రవీంద్రను వివరణ కోరగా .. ‘మొదటిగా పంచాయతీలు, మండల, జిల్లా ప్రాదేశికాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలను ప్రచురించాం. జిల్లా ప్రాదేశికాలు, మండల పరిషత్‌లకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.’ అని తెలిపారు.