Who Will Get It? ఎవరికి దక్కేనో?
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:55 PM
Who Will Get It? ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాయితీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1129 మంది వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాకు రూ. 2.58 కోట్లతో 534 యూనిట్లే (వివిధ రకాల యంత్ర పరికరాలు) మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువగా ఉండడం.. యూనిట్లు తక్కువగా ఉండడంతో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు.
జిల్లాకు 534 యూనిట్లు మంజూరు ... దరఖాస్తులు 1129
తీవ్ర పోటీ నేపథ్యంలో త్వరగా పంపిణీ చేయాలని విన్నపం
పాలకొండ, జూలై1(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాయితీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1129 మంది వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాకు రూ. 2.58 కోట్లతో 534 యూనిట్లే (వివిధ రకాల యంత్ర పరికరాలు) మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువగా ఉండడం.. యూనిట్లు తక్కువగా ఉండడంతో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ప్రజా ప్రతినిధులు, అధికారుల సిఫారుసులతో వాటిని దక్కించుకునేందుకు కొంతమంది ముమ్మర ప్రయ త్నాలు చేస్తున్నారు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతి యంత్ర పరికరాలకు విపరీత డిమాండ్ ఉండడంతో లాటరీ పద్ధతి తప్పదేమోనని కొందరు భావిస్తున్నారు. కాగా ప్రజాప్రతినిధుల అనుయాయులకే యంత్ర పరికరాలు దక్కే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 26 పెద్ద ట్రాక్టర్లు మంజూరుకాగా, 338 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ట్రాక్టర్‌కు సగటున 77 మంది పోటీ పడుతున్నట్టు స్పష్టమతుంది. రోటోవీటర్స్, పట్లర్స్, కేజ్‌వీల్స్‌కు 204 యూనిట్లకు 336 మంది, రేపర్స్, వీడర్స్, బ్రష్‌కట్టర్లు 132 యూనిట్లకు 336 మంది పోటీ పడుతున్నారు. పవర్‌టిల్లర్స్ 28 యూనిట్లకు 58 మంది , బేటరీస్పేయర్లు, పవర్ స్పేయర్లు 103కు గాను 102 మంది పోటీ పడుతున్నారు. డాల్‌వీల్స్, పల్వరేజర్స్‌కు పది యూనిట్లు మంజూరు కాగా 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. చాఫ్ కట్టర్ 20 యూనిట్లకు 27 మంది, మల్టీ క్రాప్ క్రషర్స్ 11 యూనిట్లకు 34 మంది దరఖాస్తు చేసు కున్నారు. ఇలా అన్ని యూనిట్లకు డిమాండ్ ఉండడంతో యంత్ర పరికరాలు ఎవరికి దక్కు తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై డీఏవో భవానీ శంకర్‌ను వివరణ కోరగా.. ‘జిల్లాకు మంజూరైన వ్యవసాయ యంత్ర పరికరాలను త్వరలోనే పంపిణీ చేస్తాం. నిబంధనల మేరకు రైతులకు రాయితీపై అందిస్తాం.’ అని తెలిపారు.