Victorious పురపోరులో విజేతలెవరో?
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:36 PM
Who Will Emerge Victorious in the Municipal Polls? పురపోరులో కీలకమైన కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ప్రతి వార్డుకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసి ఓట్లు లెక్కింపు చేపడతారు. కాగా కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో వివిధ పార్టీ అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
అభ్యర్థుల్లో టెన్షన్.. తేలనున్న భవితవ్యం
పార్వతీపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పురపోరులో కీలకమైన కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ప్రతి వార్డుకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసి ఓట్లు లెక్కింపు చేపడతారు. కాగా కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో వివిధ పార్టీ అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. విజయం ఎవరిని వరిస్తుందో.. ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా చర్చించుకుంటూ ఫలితాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఓటింగ్ శాతం ఎక్కడ తగ్గింది? ఎక్కడ పెరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు దీనిపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. పార్వతీపురం మున్సిపాల్టీలో చైర్ పర్సన్ రేసులో నలుగురు ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా 122 మంది బరిలో ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 85 మంది వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. చైర్‌పర్సన్ పదవికి ఆరుగురు పోటీలో ఉన్నారు. పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇక 28 వార్డుల్లో 63 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 19వ వార్డు జనసేనకు ఏకగ్రీవమైనట్లు తెలిసింది.
జనరల్ ఏజెంట్లే కీలకం...
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి అభ్యర్థికి ఒక జనరల్ ఏజెంట్‌ను నియమించారు. కౌటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థితో పాటు జనరల్, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే ఉంటారు. కౌంటింగ్ కేంద్రాలకు వారిని తప్ప మిగతా వారిని ఎవరినీ అనుమతించరు. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఓట్లు లెక్కిస్తారు. అయితే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
పార్వతీపురంలో ఏర్పాట్లు ఇలా..
బెలగాం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి అంతస్తులో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. రౌండ్లు వారీగా బ్యాలెట్ పేపర్ లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్‌కు ఆరు వార్డుల చొప్పున ఓట్లు లెక్కిస్తారు.మొదటి రౌండ్‌లో 1 నుంచి ఆరు వార్డులు, రెండో రౌండ్‌లో 7 నుంచి 12, మూడో రౌండ్‌లో 13 నుంచి 18 , 4వ రౌండ్‌లో 19 నుంచి 24 , ఐదో రౌండ్‌లో 25 నుంచి 30 , ఆరో రౌండ్‌లో 31 నుంచి 36 వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ హాల్‌కు సెల్‌ఫోన్లు, ఎటువంటి ఎలక్ర్టానిక్ డివైజ్‌లు తీసుకు రాకూడదని పార్వతీపరం కమిషనర్ రాంగోపాల్ తెలిపారు.
నగర పంచాయతీలో..
పాలకొండ: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిలర్ల అభ్యర్థులకు సంబంధించి ఏడు టేబుల్స్ ద్వారా నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థులకు సంబంధించి ఎనిమిది టేబుళ్ల ద్వారా రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నట్టు నగర పంచాయతీ కమిషనర్ రాజు తెలిపారు. కౌంటింగ్ కోసం ఒక్కో టేబుల్‌కు సూపర్‌వైజర్, ముగ్గురు అసిస్టెంట్లు విధులు నిర్వహించనున్నారు. కాగా స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్యర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాలూరులో ..
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలర్ల, చైర్ పర్సన్ అభ్యర్థులకు సంబంధించి ఎనిమిది టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రౌండ్లలో ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా 30 పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శంకరరావు సోమవారం తెలిపారు. కాలేజీ పక్కన ఉన్న లేఅవుట్‌లో పార్కింగ్‌కు స్థలం కేటాయించామన్నారు. స్ర్టాంగ్ రూముల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత: ఎస్పీ
బెలగాం: పార్వతీపురం, సాలూరు, పాలకొండలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సోమవారం వారితో మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, టేబుళ్ల మధ్య తగిన ఎత్తు, పటిష్ఠమైన మెస్ బారికేడింగ్ ఉందో లేదో తనిఖీ చేయాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, ఇతర కౌంటింగ్ సామగ్రికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.