Share News

మమ్మల్ని పోషించేవారు ఎవరయ్యా?

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:10 AM

బాబూ మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా? మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని పోషించే వారు ఎవరయ్యా అంటూ ఆ తండ్రి, భార్యా బిడ్డలు రోదిస్తున్నారు.

 మమ్మల్ని పోషించేవారు ఎవరయ్యా?
మహేష్‌(ఫైల్‌)

-రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

-తండ్రి, భార్యా బిడ్డల రోదన

-పెదమేరంగిలో విషాదం

జియ్యమ్మవలస, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): బాబూ మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా? మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని పోషించే వారు ఎవరయ్యా అంటూ ఆ తండ్రి, భార్యా బిడ్డలు రోదిస్తున్నారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగికి చెందిన గంట మహేష్‌ (35) అనే యువకుడు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈయన తండ్రి ఎరకయ్య ఆ రెవెన్యూ గ్రామానికి వీఆర్‌ఏగా పనిచేస్తూ పక్షవాతంతో మంచం పట్టాడు. దీంతో తండ్రి ఉద్యోగాన్ని మహేష్‌ తాత్కాలికంగా నిర్వహిస్తున్నాడు. తండ్రితో పాటు భార్య మణి, పిల్లలు అక్షర, అఖిల్‌ను చూసుకుంటూ ఉండేవాడు. శనివారం సాయంత్రం తండ్రికి అవసరమైన మందుల కోసం పార్వతీపురం వెళ్లాడు. మందులు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా గరుగుబిలి మండలం ఉల్లిభద్ర నాగావళి కుడి ప్రధాన కాలువ వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. సంఘటన ప్రాంతాన్ని గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌ ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కనిపెట్టేందుకు చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు పర్యవేక్షణలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి మార్గంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి కేసును ఛేదించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మహేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. భారీ వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయినట్లు చెప్పారు. మహేష్‌ మృతితో తండ్రి, భార్యా బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెదమేరంగిలో విషాదచాయలు నెలకొన్నాయి.

Updated Date - Sep 07 , 2026 | 12:10 AM