Who is the auction for? వేలంపాట ఎవరికోసమో?
ABN , Publish Date - May 26 , 2026 | 11:45 PM
Who is the auction for? పంచాయతీల్లో చేపల చెరువులకు వేలంపాటలు నిర్వహిస్తే ఆదాయం పంచాయతీకి దక్కాలి. కానీ పెద్దలకు వెళ్తోంది. ఇదెట్లా అనుకుంటున్నారా? వేలం పాట అధికారులు, ప్రజలు సమక్షంలో జరిగితే ఆదాయం పంచాయతీకి వస్తుంది. కానీ నాయకులు, పెద్దలు ఒకటై నచ్చిన వ్యక్తికి చేపల పెంపకానికి చెరువులను అప్పగించి ఆ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి తమ జేబులో వేసుకుంటున్నారు. తమకేమీ తెలియదంటూ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ఇదే తంతు జరుగుతోంది.
వేలంపాట ఎవరికోసమో?
గ్రామాల్లో చెరువులు, కోనేర్లకు చేపల పెంపకానికి వేలం
గ్రామ పెద్దలదే పెత్తనం
తమకేమీ తెలియదంటున్న పంచాయతీ కార్యదర్శులు
నాయకుల జేబుల్లోకి లక్షల రూపాయలు
పంచాయతీల్లో చేపల చెరువులకు వేలంపాటలు నిర్వహిస్తే ఆదాయం పంచాయతీకి దక్కాలి. కానీ పెద్దలకు వెళ్తోంది. ఇదెట్లా అనుకుంటున్నారా? వేలం పాట అధికారులు, ప్రజలు సమక్షంలో జరిగితే ఆదాయం పంచాయతీకి వస్తుంది. కానీ నాయకులు, పెద్దలు ఒకటై నచ్చిన వ్యక్తికి చేపల పెంపకానికి చెరువులను అప్పగించి ఆ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి తమ జేబులో వేసుకుంటున్నారు. తమకేమీ తెలియదంటూ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ఇదే తంతు జరుగుతోంది.
జామి/ఎస్.కోట రూరల్, మే 26(ఆంధ్రజ్యోతి):
ఎస్.కోట, జామి మండలాల్లోని పంచాయతీల్లో చేపలు చెరువుల వేలం పాటలు గుట్టుగా జరుగుతున్నాయి. ఆదాయమంతా పెద్దల జేబుల్లోకి వెళ్తోంది. కనీస ఆదాయం లేక అభివృద్ధిలో వెనకబడుతున్న ఆ పంచాయతీల్లో పెద్దఎత్తున చెరువులు ఉన్నా వాటిని ఆదాయం వైపుగా మలుచుకునే పరిస్థితి లేదు. అధికారికంగా వేలంపాట వేయదలిస్తే అడ్డుకుంటున్నారు. మంచినీటి వనరులను చేపల పెంపకానికి ఎలా వేలం వేస్తారని ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నారు.. ఇదంతా తెరముందు.. తెరవెనుక చూస్తే అదే పంచాయతీలలో పెద్దలుగా చెలామణి అవుతున్నవారు అనధికారికంగా చేపల పెంపకందారులను పిలిపించి వారికి నచ్చిన రేటు చెప్పి నాలుగేళ్లు.. మూడేళ్లకు లీజుకు ఇస్తూ లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ డబ్బులు ఏమైనా గ్రామ ఆభివృద్ధికి ఖర్చుచేస్తున్నారా అంటే అదీలేదు. వారి సొంతానికి వాడుకుంటున్నారు.
ఫ ఎస్.కోట మండలంలోని ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో ఐదు చెరువులు ఉన్నాయి. వీటిలో గడిచిన 15ఏళ్లుగా గంట్యాడ మండలం కొర్లాంకు చెందిన ఓ వ్యక్తి పెద్దఎత్తున చేపలు పెంచుతూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. గత ఏడాది పంచాయతీ కార్యదర్శి ప్రశ్నించగా తాను ఏడాదికి రూ.40వేలకు పైగా స్థానికులకు ఇస్తున్నట్లు చెప్పాడు.
ఫ జామి మండలం జాగరం గ్రామంలో ఉన్న కోనేరును కొంతమంది నాయకులు నాలుగు సంవత్సరాలకు రూ.లక్షా 80వేలను ఖరారు చేస్తూ స్థానికులకు అప్పగించారు. దీనిపై పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు అందడంతో ఈప్రక్రియకు బ్రేక్ పడింది. ఈగ్రామంలో వున్న పలు చెరువులను గతంలో వేలం వేసి వాటాలు పంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫ ఎస్.కోట మండలంలోని తలారీ గ్రామంలో వున్న తల్లెమ్మ చెరువును స్థానికంగా వున్న వైసీపీ నేతలు కొంతమందికి లీజుకు ఇచ్చారు. ఎందుకిలా అని పలువురు ప్రశ్నిస్తే ‘గ్రామాల్లో జరిగే పండుగలకు నువ్వు డబ్బులు ఇస్తావా’ అంటూ వారి నోరు మూయించారు.
ఫ ఎస్.కోట మండలంలోని అలుగుబిల్లి చెరువును అనధికారికంగా లీజుకు ఇచ్చేశారు. మూడునెలల క్రితం ఈచెరువులో ఇద్దరు చిన్నారులు చేపలు పట్టడం వివాదమైంది. ముదరకుండా స్థానిక పెద్దలు రాజీ చేయించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఈరెండు మండలాల్లో పదులసంఖ్యలో చెరువుల్లో అనధికారికంగా చేపల పెంపకం జరుగుతోంది. ఇదంతా ఆయా పంచాయతీ కార్యదర్శులకు తెలిసి జరుగుతున్నప్పటికీ స్థానిక నాయకుల మాటకు ఎదురుచెప్పలేక మౌనం వహిస్తున్నారు. దీనిపై జిల్లా ఆదికారులు దృష్టిసారిస్తేనే మార్పు వస్తుంది.