Share News

మాకు దిక్కెవరు దేవుడా!

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:10 AM

‘కన్నా..ఎక్కడున్నావురా.. మమ్మల్ని పోషిస్తావని ఎంతో ఆశపడ్డాం.

మాకు దిక్కెవరు దేవుడా!
చంద్రమౌళి (ఫైల్‌), రోదిస్తున్న భార్య సునీత

- రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

- స్నేహితుడి పెళ్లికి వచ్చి వెళ్తుండగా ఘటన

- భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

- శిఖబడిలో విషాదం

జియ్యమ్మవలస/గరుగుబిల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘కన్నా..ఎక్కడున్నావురా.. మమ్మల్ని పోషిస్తావని ఎంతో ఆశపడ్డాం. ప్రయోజకుడివి అయ్యావని సంబరపడ్డాం. మాతో సరదాగా గడపడానికి వచ్చావని సంతోషపడ్డాం. ఇంతలోనే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావా.. ఇలా చేశావేమమ్మా అగ్ని గంగమ్మ! మాకు దిక్కెవరు దేవుడా! అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ ధవళసింగి చంద్రమౌళి (29) తల్లిదండ్రులు, భార్య రోదించడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. గరుగుబిల్లి మండలం నందివానివలస - గిజబ గ్రామాల మధ్య గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం వల్లరగుడబ గ్రామంలో జరిగిన స్నేహితుని పెళ్లికి బుధవారం చంద్రమౌళి వెళ్లాడు. పెళ్లి వేడుక ముగిసిన తరువాత గురువారం వేకువజామున తన ద్విచక్ర వాహనంపై శిఖబడికి వస్తుండగా నందవానివలస - గిజబ గ్రామాల మధ్య శివాలయం సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వ్యాన్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో చంద్రమౌళి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానిదిగా గుర్తించారు.

రెండు రోజుల కిందటే వచ్చాడు..

పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ కాంటినెంటర్‌ మీడియం రెజిమెంట్‌లో చంద్రమౌళి జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి తల్లిదండ్రులు గంగారావు, సత్యవతి, భార్య సునీత, ఏడాదిన్నర పాప ఆద్వీక ఉన్నారు. తల్లిదండ్రులకు చంద్రమౌళి ఒక్కడే కుమారుడు. తన స్వగ్రామం శిఖబడిలో బుధవారం నుంచి గ్రామదేవత అగ్ని గంగమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం చంద్రమౌళి ఈ నెల 24న సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సరదాగా స్నేహితులు, బంధువులతో గడిపాడు. బుధవారం వల్లరగుడబలో తన స్నేహితుని పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వ్యాన్‌ ఢీకొని మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చంద్రమౌళి మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Updated Date - Feb 27 , 2026 | 12:10 AM