Share News

ఎవరు గెలుస్తారంటావ్‌?

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:56 PM

జిల్లాలో ఎక్కడ చూసినా స్థానిక రాజకీయంపైనే చర్చ జరుగుతోంది.

  ఎవరు గెలుస్తారంటావ్‌?

- ఎక్కడా చూసినా ఎన్నికల ముచ్చట్లే

- కూడళ్లు, టీస్టాళ్ల వద్ద జోరుగా చర్చలు

- అభ్యర్థుల గెలుపోటములపై జోస్యం

విజయనగరం టౌన్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడ చూసినా స్థానిక రాజకీయంపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరూ కలిసినా దాని గురించే మాట్లా డుకుంటున్నారు. టిఫిన్‌ సెంటర్లు, టీస్టాళ్లు, కాలనీల కూడళ్లు, వాకింగ్‌ చేసే ప్రాంతాలు ఇలా ప్రతిచోటా ఎన్నికల ముచ్చట్లే. ఏ అభ్యర్థి గెలుస్తాడు.. ఎంత మెజార్టీ వస్తుంది.. ఫలానా అభ్యర్థి మంచోడు.. ఆయనకు ఓటమి తప్పదు.. ఇలా చర్చలు జోరుగా సాగుతున్నాయి.

వెంకటరావు: రామారావు గారూ! ఎలా ఉంది మీ వార్డులో పరిస్థితి. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావ్‌.

రామారావు: ప్రచారం అయితే ఇద్దరూ చేస్తున్నారు. కానీ, ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా ఉందండి.

వెంకటరావు: నేను ఇలాంటి ఎన్నికలు సానా చూశాను. గతంలో కూడా నేను చెప్పినోలే గిలిచారు. ఇప్పుడు కూడా నా అంచనాలు మిస్సవ్వవు.

రామారావు: ఆ కూటమి అభ్యర్థి తెగ ఖర్చు పెట్టేతండు... ఓరిబాబు వాడి ఎనకాల ఎంతమంది తిరుగుతున్నారో తెల్డం లేదు. వార్డులో ఉన్న వారికి గొప్ప హామీలు ఇచ్చేతండు. నాకు తెలిసి బంపర్‌ మెజార్జీతో కూటమోడే గెలుత్తాడు. ఏటంతావ్‌ సన్యాసిరావు.

సన్యాసిరావు: నేదు బావా ప్రతిపక్ష పార్టీలో ఉన్న అభ్యర్థి మంచోడు. డబ్బులకు ఆశపడడు. ఆయనకు బోల్డు వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చాడు. జనాలు ఆడివైపే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఓటర్లలో మార్పు వత్తంది. నేను సానా మందితో మాట్లాడాను కదా. నాకు తెలిసిపోయింది. ఎవలు గెలుత్తారో అలా చూడు. నేను చెప్పినోడే గెలిసేస్తాడు..బావా.

వాకింగ్‌లో ఇలా..

రాంబాబు గారూ నగరంలో ప్రచారం ఎలా ఉందండి.. ఏమోనండి.. ప్రచారం అయితే చాలా జోరుగా చేస్తున్నారు. ఉదయం 6గంటల నుండే వార్డుల్లో అభ్యర్థులు తిరుగుతున్నారు. రాత్రి 8వరకూ కాలనీల్లోనే కనబడుతున్నారు. నగరంలో అధికారపార్టీ గెలుపుపైనే గట్టిగా చర్చలు జరుగుతున్నాయి నారాయణరావు మాస్టారు.

- మీవార్డు ఎలా ఉందండి శేఖర్‌ గారూ. మావార్డులో గతంలో గెలిచిన అభ్యర్థి తరువాత అందుబాటులో లేకపోవడంతో స్థానికులు అసంతృప్తిగా ఉన్నారండి... ప్రస్తుతం అధికార పార్టీ వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని కాలనీ వాసులు అంతా చర్చించుకుంటున్నాం. ఇటీవలే మీటింగ్‌ కూడా పెట్టుకున్నాం. కాలనీ సమస్యలను ఒక పేపర్‌పై రాసి స్థానిక అభ్యర్థులకు విన్నవించి వాటిని పరిష్కరించే వారికే ఓట్లు వేసేందుకు నిర్ణయించుకున్నాం సార్‌.

Updated Date - Oct 24 , 2026 | 10:56 PM