Share News

మొక్కజొన్నను కొనేవారేరీ?

ABN , Publish Date - May 16 , 2026 | 12:24 AM

మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటను సాగు చేసిన వారు ఇప్పుడు దాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

 మొక్కజొన్నను కొనేవారేరీ?
భీమసింగిలో రోడ్డుపై పంటను ఆరబెట్టిన రైతు

- ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు

- రైతులను దోచుకుంటున్న దళారులు

- క్వింటాకు రూ.1700 చెల్లింపు

- తప్పని నష్టాలు

జామి, మే 14 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటను సాగు చేసిన వారు ఇప్పుడు దాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకపక్క కొనుగోలు కేంద్రాలు లేక మరోపక్క వ్యాపారులు ముందుకు రాక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు క్వింటాకు రూ.1,700 చెల్లిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది జామి మండలంలో 1700 ఎకరాల్లో మొక్కజొన్న పంటను పండించారు. వాతవరణం అనుకూలించడంతో దిగుబడులు బాగానే వచ్చాయి. కొన్నిచోట్ల ఎకరాకు 30 క్వింటాళ్లు, మరికొన్ని చోట్ల 50 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేస్తామని, క్వింటాకు రూ.2400మద్దతు ధర చెల్లిస్తామని మండల వ్యవసాయశాఖ అధికారులతో పాటు జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారులు ఈ ఏడాది మార్చిలో చెప్పడంతో రైతులు ఎంతో సంతోషపడ్డారు. అయితే మే నెల వచ్చి రెండు వారాలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఊసు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే.. ప్రభుత్వానికి లేఖ రాశామని, అనుమతులు వచ్చిన వెంటనే పంట కొనేస్తామని వారు చెప్పడంతో రైతులు నిజమేనని నమ్మారు. కానీ, నెలలు గడుస్తున్నా కొనుగోలు మాత్రం జరగడం లేదు. ఇదే సమయంలో దళారీలు రంగ ప్రవేశం చేసి రైతులను దోచుకుంటున్నారు. తమకు పంటను ఇచ్చేస్తే రోజుల వ్యవధిలో డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో చేసేది లేక కొంతమంది రైతులు వారికి అమ్మడం మొదలుపెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,400 కాకుండా రూ.1700 మాత్రమే దళారులు చెల్లిస్తున్నారు. మరికొంతమంది రైతులు మాత్రం ఇంకా ప్రభుత్వం కొంటుందన్న ఆశతో పంటను ఎప్పటికప్పుడు సంరక్షణ చేసుకుంటూ కాపాడుకుంటున్నారు. ఇప్పటికి దాదాపు 50శాతం పంటను దళారులు కొనుగోలు చేశారని రైతులు అంటున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి పూర్ణిమ, మార్క్‌ఫెడ్‌ డీఎం సురేష్‌ను వివరణ కోరగా.. ‘కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అనుమతులు వచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - May 16 , 2026 | 12:24 AM