Share News

Who are the winners?విజేతలెవరో?

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:18 AM

Who are the winners? స్థానిక సంగ్రామంలో మొదటిగా జరిగిన పుర పోరులో విజేతలెవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Who are the winners?విజేతలెవరో?
విజయనగరం రాజీవ్‌ క్రీడా మైదానంలోని ఓపెన్‌ హాలులో కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

విజేతలెవరో?

కాసేపట్లో మొదలుకానున్న మున్సిపల్‌ కౌంటింగ్‌

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు, ప్రజలు

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

మూడు ప్రాంతాల్లో లెక్కింపు

ఉదయం 8 గంటలకు ప్రారంభం

ఫలితాల కోసం టీవీలకు అతుక్కుపోనున్న ప్రజలు

స్థానిక సంగ్రామంలో మొదటిగా జరిగిన పుర పోరులో విజేతలెవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్‌ అయ్యాక బ్యాలెట్‌ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించిన విషయం తెలిసిందే. వాటిని మంగళవారం ఉదయం ఏజెంట్ల సమక్షంలో తెరవనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యే అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ముందురోజు టెలీకాన్ఫరెన్స్‌లో సూచనలు ఇచ్చారు. లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ప్రశాంతంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలన్నారు. ఇటు బందోబస్తు కోసం ఎస్పీ దామోదర్‌ మూడు చోట్ల పోలీసులను భారీగా కేటాయించి వారికి దిశానిర్దేశం చేశారు. ఇంకోవైపు ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు టీవీలకు అతుక్కుపోనున్నారు.

ఓటింగ్‌ తగ్గింది ఎందుకో?

సార్వత్రిక ఎన్నికల కంటే తగ్గిన ఓటింగ్‌

గత మునిసిపల్‌ ఎన్నికలతో పోల్చుకుంటే తగ్గిన 2 శాతం

వైసీపీలో అదే భయం

విజయనగరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): విజయనగరం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 2 శాతం ఓట్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 64.51 శాతం ఓటింగ్‌ జరిగింది. ఇప్పుడు మాత్రం 62.73 శాతం మాత్రమే నమోదు కావడం విశేషం. అయితే మునిసిపాల్టీగా ఉన్నప్పుడు దాదాపు 70 శాతం వరకూ ఓటింగ్‌ జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో 69.20 శాతం ఓటింగ్‌ జరిగింది. అయితే పోలింగ్‌ శాతం తగ్గడానికి ప్రధాన కారణం డివిజన్ల విభజన కావొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలకు ముందు కేవలం 50 డివిజన్లు ఉండేవి. పునర్విభజనతో ఆ సంఖ్య 62కు చేరుకుంది. హద్దులు కూడా మారిపోయాయి. అందుకే ఓటర్లు ఏ డివిజన్‌లో ఉన్నారో తెలియక తికమకపడ్డారు. ఆ ప్రభావం పోలింగ్‌పై పడి ఉంటుందని అంచనా.

వైసీపీ ఆశలపై నీళ్లు..

ఓటింగ్‌ తగ్గడంతో విపక్ష వైసీపీలో ఆశలు సన్నగిల్లాయి. సాధారణంగా ఓటింగ్‌ అధికంగా జరిగితేనే అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ఓటర్లు ఓటింగ్‌కు పోటెత్తుతారు. కానీ పోలింగ్‌ శాతం తగ్గిందంటే కచ్చితంగా ఆ ప్రభావం విపక్షంపై పడుతుంది. ప్రభుత్వ పాజిటివ్‌ ఓటర్లే ఎక్కువగా వచ్చి ఓటు వేస్తారు. ఇటు వైసీపీ శ్రేణులు కూడా అధికార పార్టీ హవా ఉంటుందన్న భావనతో చాలా లైట్‌ తీసుకున్నాయి. పార్టీ పోటీ చేయాలని ఆదేశించింది కనుక చేశాం అన్నట్టు వారి వ్యవహారం ఉంది.

మధ్యాహ్నం 3 తరువాతే చివరి ఫలితం

విజయనగరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కౌంటింగ్‌కు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభంకానుంది. మేయర్‌కు ఒక ఓటు, కార్పొరేటర్‌కు ఒక ఓటు కావడంతో టేబుళ్ల వారీగా లెక్కించనున్నారు. విజయనగరం కార్పొరేషన్‌లో మొత్తం 2,23,050 ఓట్లు ఉండగా 1,33,911 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు రెండు లక్షల అరవై వేల ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. చివరి ఫలితం వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో సైతం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్నే ఓట్లకుగాను పోలింగ్‌ జరిగింది. అదితి గజపతిరాజు ఏకంగా 60 వేల ఓట్లతో విజయం సాధించారు. 1,21,241 ఓట్లు సాధించారు. 64.21 శాతం ఓటు షేర్‌ సాధించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన కోలగట్ల వీరభద్రస్వామికి కేవలం 60,632 ఓట్లు మాత్రమే లభించాయి. 32.11 శాతానికి మాత్రమే పరిమితమయ్యారు. అప్పట్లో లక్షా 90 వేల వరకూ ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు 60 వేల ఓట్ల వరకూ తగ్గాయి. అందుకే వైసీపీ ఎక్కువగా భయపడుతోంది. 62 డివిజన్లకుగాను పది సంఖ్యలోపు గెలవవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

----------------------------

సీకేఎం కళాశాలలో నెల్లిమర్ల ఓట్ల లెక్కింపు

నెల్లిమర్ల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక సీకేఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కమిషనర్‌ తమ్మినేని గోవిందరావు తెలిపారు. ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూముల్లో బ్యాలెట్‌ పెట్టలను భద్రపరిచారు. చైర్మన్‌, 23 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నిక జరిగింది. చైర్మన్‌ స్థానానికి నలుగురు అభ్యర్థులు, 23 వార్డు కౌన్సిలర్ల స్థానానికి 59 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 19076 మంది ఓటర్లు ఉండగా 15,320 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 80.31 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో 79.75 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.

- నెల్లిమర్ల నగర పంచాయతీ 2013లో ఏర్పాటైంది. అయితే పాలకవర్గానికి 2021లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నగర పంచాయతీలో 20 వార్డులు ఉండేవి. 17,471 మంది ఓటర్లు ఉండేవారు. ఆ ఎన్నికల్లో 13,933 మంది (79.75 శాతం మంది) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 19076కు పెరగ్గా పోలింగ్‌ శాతం కూడా పెరిగింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 80.31 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

- గతంలో చైర్‌పర్సన్‌ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగ్గా ఈసారి చైర్మన్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరిగింది. చైర్మన్‌ నేరుగా ఎన్నుకునే విఽధానాన్ని ప్రభుత్వం ఈసారి తొలిసారిగా అమలు చేసింది. కాగా చైర్మన్‌ పదవి గతసారి ఎస్సీ మహిళకు కేటాయించగా ఈసారి బీసీ జనరల్‌కు కేటాయించారు. గతంలో 20 సీట్లుకుగానూ 13 సీట్లు వైసీపీ గెలుచుకోగా 7 సీట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈసారి చైర్మన్‌ సీటును కూటమి పార్టీలు భారతీయ జనతాపార్టీ అభ్యర్థికి కేటాయించాయి. కూటమి అభ్యర్థిగా మైపాడ ప్రసాద్‌ బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ ఆశించి బంగపడిన లెంక అప్పలనాయుడు అధిష్ఠానంపై అలకతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. వైసీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు, మాజీ చైర్మన్‌ సముద్రపు రామారావు పోటీలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కనకల పద్మనాభం బరిలో నిలిచారు.

చైర్మన్‌ అభ్యర్థులు వీరే...

నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థులుగా నలుగురు పోటీ చేశారు. కూటమి అభ్యర్థిగా మైపాడ ప్రసాద్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా లెంక అప్పలన్యాడు, వైసీపీ అభ్యర్థిగా సముద్రపు రామారావు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కనకల పద్మనాభం పోటీ చేశారు.

7 టేబుళ్లు ఏర్పాటు చేశాం: కమిషనర్‌

నెల్లిమర్ల నగరపంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని సహాయ రిటర్నింగ్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ గోవిందరావు తెలిపారు. లెక్కింపు కోసం 7 టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో బొబ్బిలి ఓట్ల లెక్కింపు

బొబ్బిలి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపుకోసం నియమితులైన అధికారులందరితో మున్సిపల్‌ కమిషనరు లాలం రామలక్ష్మి సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చారు. అభ్యర్థుల తరపున ఏజెంట్లుగా వ్యవహరించేవారికి అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేశారు. వీరు వెలుపల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

పట్టణంలోని 36 వార్డుల పరిధిలో మొత్తం 49,284 ఓట్లు ఉండగా, 69 పోలింగ్‌ కేంద్రాలలో 35,041 ఓట్లు నమోదయ్యాయి. వీరిలో 16,703 మంది పురుషులు, 18,33 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 18 టేబుళ్లను ఏర్పాటుచేశారు. 9 టేబుళ్లను చైర్‌పర్సన్‌ ఓట్ల లెక్కింపు కోసం, మరో 9 వార్డు కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు.

ఫ బ్యాలెట్‌ బాక్సుల్లో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల ఓట్లను వేరు చేసి వార్డుల వారీగా టేబుళ్లకు అందజేస్తారు. ఇలా చైర్‌పర్సన్‌కు ఓట్లన్నింటినీ ముందుగా పూర్తిగా కలిపివేస్తారు. ఆ తరువాత 25 బ్యాలెట్లు చొప్పున కట్టలు కడతారు. వాటిని తొమ్మిదేసి చొప్పున ఏర్పాటు చేసిన టేబుళ్లలో లెక్కిస్తారు. మొదటి రౌండ్‌ ఫలితాలు వెల్లడి కావడానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు. అక్కడ నుంచి ప్రతీ రౌండ్‌ ఫలితాలు గంట వ్యవధిలో వెల్లడి కావచ్చని అంచనా వేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఎవరు విజేతో తేలిపోతుంది.

Updated Date - Nov 03 , 2026 | 12:18 AM