పశువులను తప్పించబోయి..
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:10 AM
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేట్ సమీపంలో ద్విచక్రవాహనం చోదకుడు పశువులను తప్పించబోయి వాటిని ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
పాలకొండ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేట్ సమీపంలో ద్విచక్రవాహనం చోదకుడు పశువులను తప్పించబోయి వాటిని ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. నగర పంచాయతీ పరిధిలోని ఎన్‌కేరాజపురానికి చెందిన కొవగాన వాసు(32) శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్వగ్రామానికి తన ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నాడు. అక్కడ ఇన్‌గేట్ సమీపంలో రోడ్డుపై నుంచి నిలిచి ఉన్న పశు వులను తప్పించబోయి వాటికి ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై పడి ఉన్న వాసును స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వాసు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాసు మరణవార్త విని స్నేహితులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. ఇటీవల తన తల్లిదండ్రులు పేరిట పట్టణంలో పలుచోట్ల, మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు సేదతీరేందుకు సిమెంట్ బల్లలు వేయించారు. అందరితో కలివిడిగా ఉండే తన స్నేహితుడు లేడన్న విషయం తెలుసుకున్న సహచరులు ఆసుపత్రికి చేరుకున్నా రు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సంతాపం తెలిపారు. మృతుడికి భార్య జ్యోతీర్మయి, పిల్లలు దీక్షిత్, జశ్వంత్ ఉన్నారు.