Share News

While returning from duty...విధి నిర్వహణకు వెళ్లి వస్తూ..

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:34 AM

While returning from duty... కేసు దర్యాప్తులో భాగంగా ఓ గ్రామానికి వెళ్తున్న కానిస్టేబుల్‌ తిరిగి ప్రయాణంలో ఇంటికి వస్తానని ఫోన్‌ చేసి చెప్పాడు. ఆదివారం కదా భార్య, పిల్లలను బయటకు తీసుకువెళ్తానన్నాడు. దీంతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు గుండెలు మెలేసే దుర్వార్త తెలిసింది. వస్తానన్న నాన్న ఇక రాడని, ప్రమాదంలో మృతిచెందాడని చెవిన పడిన మరుక్షణం ఆ పిల్లల రోదనకు అంతులేకుండా ఉంది. ఆయన భార్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

While returning from duty...విధి నిర్వహణకు వెళ్లి వస్తూ..
ఆసుపతిలో చికిత్స పొంతున్న వారిని పరామరిస్తున్న మంత్రి, ఎస్పీ.. (ఇన్‌సెట్‌)లో సీర రమణ (ఫైల్‌)

విధి నిర్వహణకు వెళ్లి వస్తూ..

అదుపు తప్పిన పోలీసు వాహనం

కానిస్టేబుల్‌ మృతి, ఎస్‌ఐతో సహా ఇద్దరు పోలీసులకు గాయాలు

విచారం వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఘటన తెలిసి చలించిపోయిన ఎస్పీ దామోదర్‌

కేసు దర్యాప్తులో భాగంగా ఓ గ్రామానికి వెళ్తున్న కానిస్టేబుల్‌ తిరిగి ప్రయాణంలో ఇంటికి వస్తానని ఫోన్‌ చేసి చెప్పాడు. ఆదివారం కదా భార్య, పిల్లలను బయటకు తీసుకువెళ్తానన్నాడు. దీంతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు గుండెలు మెలేసే దుర్వార్త తెలిసింది. వస్తానన్న నాన్న ఇక రాడని, ప్రమాదంలో మృతిచెందాడని చెవిన పడిన మరుక్షణం ఆ పిల్లల రోదనకు అంతులేకుండా ఉంది. ఆయన భార్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు. గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ సీర రమణ విషాదాంతమిది. కేసు దర్యాప్తులో భాగంగా ఓ గ్రామానికి వెళ్లివస్తుండగా జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ రమణ మృతి చెందగా ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయనగరం/దాసన్నపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):

దొంగతనం కేసు విచారణ కోసం విజయనగరం రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొండకరకాం గ్రామానికి కానిస్టేబుల్‌ శీర రమణ (48)తో పాటు ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేంద్ర ప్రసాద్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌(డ్రైవర్‌) రాజు జీపులో ఆదివారం ఉదయం వెళ్లారు. తిరిగొస్తున్న సమయంలో గాజులరేగ ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న లోయ వద్దకు వచ్చేసరికి బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో జీపు సుమారు 20 అడుగుల లోతులోకి దూసుకుపోయి చెట్టును ఢీకొని ఆగింది. వాహనంలో నుంచి బయటకు రాలేక పోలీసులు చాలాసేపు ఆర్తనాథాలు చేశారు. అంతలో అటు వెళ్తున్న కొందరు వ్యక్తులు గమనించి 108కి ఫోన్‌ చేశారు. కొంతసేపటికి అక్కడకు చేరుకున్న పోలీసులు, ప్రజలు వారందరినీ బయటకు తీసుకొచ్చి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కానిస్టేబుల్‌ శీర రమణ (48) ఊపిరి ఆగిపోయింది. ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేంద్ర ప్రసాద్‌ ఎడమ చేతికి, పక్కటెముకలకు గాయాలయ్యాయి. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజుకి వెన్నుపూస తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు చెబుతున్నారు.

ఫ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెంటనే ఎస్పీ దామోదర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం హూటాహూటిన ఆసుపత్రికి చేరుకుని రమణ భౌతిక కాయాన్ని పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, హెచ్‌సీ నాగేంద్రప్రసాద్‌, కానిస్టేబుల్‌ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. హోంమంత్రి అనిత ఫోన్‌ చేసి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. కానిస్టేబుల్‌ రమణ మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు ఽధైర్యం చెప్పారు.

చలించిపోయిన ఎస్పీ దామోదర్‌

విధి నిర్వహణలో కానిస్టేబుల్‌ రమణను కోల్పోవడం బాధాకరమని చెబుతూ ఆస్పత్రి వద్ద ఎస్పీ దామోదర్‌ కన్నీరుపెట్టారు. అక్కడే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఓదార్చారు. ప్రమాదంపై పోలీసులు, స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

భూపాలపురంలో విషాదం

గుర్ల, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): భూపాలపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ సీర రమణ ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిసి గ్రామంలో విషాదం అలముకుంది. విధి నిర్వహణలో కష్టపడే వ్యక్తిగా, కలివిడిగా ఉండే స్నేహశీలిగా అందరికీ సుపరిచితుడైన రమణ మరణాన్ని వారంతా జీర్ణించుకోలేకోయారు. రమణ కానిస్టేబుల్‌గా 2002లో వృత్తిలో ప్రవేశించాడు. బొబ్బిలి, ఎస్‌.కోటలో పనిచేస్తూ ప్రస్తుతం విజయనగరంలో రూరల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన తల్లిదండ్రులు పైడితల్లి, నారాయణమ్మకు ముగ్గురు కుమారులు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. రమణ, బంగారునాయుడు వీరిద్దరూ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. రామారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ గ్రామంలోనే జీవిస్తున్నారు. రమణకు భార్య కృష్ణవేణి, పిల్లలు రాహుల్‌, దేవా ఉన్నారు. వీరిద్దరూ జొన్నాడ లెండి కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. కుటుంబమంతా ప్రస్తుతం విజయనగరంలో ఉంటోంది.

Updated Date - Aug 24 , 2026 | 12:34 AM