Share News

Auspicious Ceremony శుభకార్యానికి వెళ్లొస్తుండగా..

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:30 PM

While Returning from an Auspicious Ceremony శుభకార్యానికి ఆటోలో బయల్దేరిన గిరిజనులు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్డులోని చిన్న లోయలో వారి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక గిరిజనుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు.

 Auspicious Ceremony శుభకార్యానికి వెళ్లొస్తుండగా..
ఘాట్‌రోడ్డు లోయలో బోల్తాపడిన ఆటో

  • గిరిజనుడి మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

  • శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు

సీతంపేట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): శుభకార్యానికి ఆటోలో బయల్దేరిన గిరిజనులు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్డులోని చిన్న లోయలో వారి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక గిరిజనుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషాదకర ఘటన సీతంపేట ఏజెన్సీలో చోటుచేసుకుంది. దీనిపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం దబ్బగూడకి చెందిన ఎనిమిది మంది గిరిజనులు సీతంపేట మండలం బుడ్డడుగూడలో జరుగుతున్న ఓ శుభకార్యానికి ఆదివారం ఆటోలో బయల్దేరారు. దారంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. బుడ్డడుగూడ చేరుకున్నారు. శుభకార్యంలో బంధువులందరితో కలిసి ఉత్సాహంగా గడిపారు. భోజనాల అనంతరం దబ్బగూడ గిరిజనులు బుడ్డడుగూడ నుంచి ఆటోలో తిరుగుపయనమయ్యారు. తొత్తడి-సవరగొయిది గ్రామాల మధ్యలో ఘాట్‌రోడ్డు దిగుతుండగా.. ఆ మలుపులో ఆటో అదుపుతప్పి చిన్నపాటి లోయలోకి దూసుకెళ్లి.. బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దబ్బగూడకి చెందిన సవర లక్ష్మణరావుు(35)అక్కడికక్కడే మృతిచెందాడు. అదే ఆటోలో ఉన్న సవర దుడ్డమ్మ, చిలకమ్మలకు చేతులు విరిగిపోయాయి. మహేష్‌ అనే వ్యక్తికి కూడాతీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సహకారంతో 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వారితో పాటు ప్రయాణిస్తున్న మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుడు సవర లక్ష్మణరావుకు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో వారు భోరున విలపిస్తున్నారు. కాగా గిరిజనుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంపై ఎస్‌ఐ వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 11:30 PM