daughter on a Bus... కూతురిని బస్సు ఎక్కించి వస్తుండగా..
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:49 PM
While Returning After Seeing Off His Daughter on a Bus... ‘తల్లీ పరీక్ష బాగా రాయమ్మా..’ అంటూ కుమార్తెను బస్సు ఎక్కించిన కొద్ది నిమిషాల్లోనే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఓ లారీ మృతువు రూపంలో ఆయన్ని కబళించింది. ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా చేసింది.
కొత్తపల్లిలో ఘటన
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
గరుగుబిల్లి/సీతానగరం,జూన్5(ఆంధ్రజ్యోతి): ‘తల్లీ పరీక్ష బాగా రాయమ్మా..’ అంటూ కుమార్తెను బస్సు ఎక్కించిన కొద్ది నిమిషాల్లోనే ఆ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఓ లారీ మృతువు రూపంలో ఆయన్ని కబళించింది. ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా చేసింది. గరుగుబిల్లి మండలం రావుపల్లి - కొత్తపల్లి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
బలిజిపేట మండలం వెంగాపురానికి చెందిన బొమ్మి వెంకట నాయుడు(56) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. భార్య, కూతురు, కుమారుడుతో కలిసి గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం తన కుమార్తెకు పార్వతీపురంలో డిగ్రీ సింగిల్ సిట్టింగ్ పరీక్ష ఉండడంతో బైక్‌పై గురుగుబిల్లి వరకు వారు చేరుకున్నారు. అక్కడ కుమార్తెను పార్వతీపురం బస్ ఎక్కించి వెంకటనాయుడు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపానికి చేరుకునేసరికి పార్వతీపురం వైపు వెళ్తున్న లారీ ఆయన బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో వెంకటనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి ఇక తిరిగి రాడనే వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ భోరున విలపించారు. మరోవైపు పరీక్ష రాసిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న కుమార్తె లావణ్య షాక్‌కు గురైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి కన్నీంటిపర్యంతమైంది. ‘లే..నాన్న ఇంటికెళ్దాం’ అంటూ రోదించడం చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. కాగా ఈ విషయం తెలుసుకున్న గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వెంకటనాయుడు మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం ప్రక్రియలను పూర్తి చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటనాయుడు మృతికి గ్రామస్థులు, సహోద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.